పాతాళంలోకి ఆదాని… పైపైకి అంబాని

By KTV Telugu On 16 February, 2023
image

ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ వెళ్తున్న గౌతమ్ ఆదాని జైత్రయాత్రకు హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన నివేదికతో అడ్డుకట్ట పడింది. రాత్రికి రాత్రి ఆదాని వ్యాపార సామ్రాజ్యానికి బీటలు పడ్డాయి. అప్పటివరకు పట్టిందల్లా బంగారం అన్నట్లున్న ఆదానికి అన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యాపార సంస్థల విలువ క్రమక్రమంగా పడిపోతోంది. ఇన్నిరోజుల పాటు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌ టెన్‌ లో ఉన్న ఆదాని ఒక్కో మెట్టూ కిందకు పడిపోతున్నారు. ఆదాని గ్రూప్ ఇన్వెస్టర్ల సంపద రోజురోజుకూ పడిపోతోంది. హిండెన్ బర్గ్‌ నివేదిక ఆనంతరం జనవరి 24న ప్రారంభమైన పతనం కొనసాగుతూనే ఉంది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఆదాని గ్రూప్‌ మార్కెట్‌ విలువలో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీలు గ‌త మూడు వారాల్లో దాదాపు 120 బిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ కోల్పోయింది.

సోమవారం ఒక్క రోజే రూ. 51,610 కోట్ల సంపద కోల్పోయింది. మరోవైపు మూడీస్‌ సంస్థ నాలుగు అదానీ గ్రూప్ సంస్థల రేటింగ్‌ను త‌గ్గించ‌డంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద సోమవారం రూ.28,770 కోట్ల నిక‌ర వ్య‌క్తిగ‌త సంప‌ద‌ను గౌతం అదానీ కోల్పోయారు. దాంతో ఆయన వ్యక్తిగత సంపద విలువ రూ.4.49 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్‌ టెన్‌లో ఉన్న ఆదాని ఇప్పుడు 24వ స్థానానికి పడిపోయారు. ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్ ముకేష్ అంబానీ మెల్లమెల్లగా పైకి ఎగబాకుతున్నారు. గత 24 గంటల్లో ఆయన సంపద 28 వేల కోట్లకు పైగా పెరిగింది. దీనితో ఏకంగా ఫోర్బ్స్ టాప్-10 బిలియనీర్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

గతంలో 12వ స్థానంలో ఉన్న అంబాని ఒకేసారి మూడు స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నారు. 85.4 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో అత్యంత ధనవంతుడిగానూ నిలిచారు. రిలయన్స్ స్టాక్ భారీగా లాభపడటంతో గత 24 గంటల్లో అంబానీ ఆస్తులు 3.5 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. దాంతో ఒక్కరోజులోనే దాదాపు 28 వేల కోట్లు సంపద పెంచుకుని రికార్డు సృష్టించారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాను పరిశీలిస్తే మొదటి స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఉన్నారు. ఆయన సంపద విలువ 215.9 బిలియన్ డాలర్లు. రెండవ స్థానంలో ఎలాన్ మస్క్ఆ యన ఆస్తి విలువ 196.5 బిలియన్ డాలర్లు. 122.9 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ మూడవ స్థానంలో ఉన్నారు. స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ 108.4 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 106.7 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.