దక్షిణాది సెంటిమెంట్ పెరుగుతోందా

By KTV Telugu On 10 May, 2023
image

 

భారత దేశంలో ఉత్తరాది, దక్షిణాది అనే మాటలు దేశంలో తరచూ వినిపస్తూ ఉంటాయి. దక్షిణాది ప్రాంతీయ భాషల రాష్ట్రాలతో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రతీ రాష్ట్రానికి భిన్నత్వం ఉంటుంది. ఎవరి సంస్కృతి, సంప్రదాయాలు వారికి ఉంటాయి. కానీ ఉత్తరాదిలో హిందీ ఆధిపత్యం ఎక్కువ. అయితే దేశంలో పాలకులు ఎక్కువగా ఉత్తరాది నుంచే వస్తున్నారు. కీలకమైన పదవుల్లో కూడా దక్షిణాది వాళ్లు ఉండటం లేదు. అందుకే ఈ ఉత్తరాది, దక్షిణాది భావన పెరిగిపోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా సౌత్ లాబీ అంటూ ఈడీ, సీబీఐ అదే పనిగా వినియోగిస్తూండటంతో దేశంలో దక్షిణాది, ఉత్తరాది వేర్వేరు అన్న భావన పెరిగే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు ఇలా కరెక్ట్ కాదని చెప్పింది కానీ జరగాల్సిన నష్టం జరిగింది. దేశంలో దక్షిణాది వేరు అన్న భావన పెరగడానికి ఇటీవలి పరిణామాలు ఎక్కువగా కారణం అవుతున్నాయి. అందులో ఒకటి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం చూపించే విపక్ష.

మన దేశంలో దక్షాణాది రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, కేరళ దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన ఛోదకులుగా ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు దేశ జీడీపీలో 30 శాతం వాటా కలిగి ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఐదు దక్షణాది రాష్ట్రాలు బలమైన ఆర్ధిక వ్యవస్థలు కలగి ఉన్నాయి. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో తమిళనాడు జీఎస్‌డీపీ 24.8 లక్షల కోట్లుగా ఉంది. దక్షణాదిలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. రెండో స్థానంలో 22.4 లక్షల కోట్లతో కర్నాటక ఉంది. తెలంగాణ రాష్ట్రా జీఎస్‌డీపీ 13.3 లక్షల కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ 13.2 లక్షల కోట్లుగానూ, కేరళ 10 లక్షల కోట్లుగా ఉంది. ఆర్ధిక వ్యవస్థలతో పాటు, ఈ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం, రాష్ట్రాల ఆదాయం, అప్పులు, వడ్దీ చెల్లింపు రేషియో, ఆర్ధిక లోటు వంటి వాటిని కూడా విశ్లేషించారు. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 2,75,443 రూపాయల తలసరి ఆదాయంతో టాప్‌లో ఉంది. మిగతా రాష్ట్రాలు తక్కువేమీ కాదు. కనీసం రెండు లక్షల తలసరి ఆదాయం ఉంది. జాతీయ సగటు తలసరి ఆదాయం 1,50,007 రూపాయలు మాత్రమే.

దేశ ఆర్థిక వ్యవస్థకు మెట్రో నగరాలు పెద్ద పునాది. అత్యధిక ఆదాయం ఆ నగరాల నుంచే వస్తుంది. దేశం మొత్తం మీద ప్రముఖ నగరాల పేర్లు తీసుకుంటే మొదట ఢిల్లీ తర్వాత ముంబై పేరు చెబుతారు. ఆ తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పేర్లు చెబుతారు. ఈ మూడు దక్షిణాదిలోనే ఉన్నాయి. ఇక కొచ్చి, విశాఖ, మధురై వంటి టైర్ టు సిటీలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నగరాల రూపురేఖలు చూసినా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. పన్నుల ఆదాయంలో అత్యధికం ఉంటుంది. అందుకే కేసీఆర్ లాంటి రాజకీయ నేతలు మనం కేంద్రానికి ఇస్తున్న దాంట్లో సగం కూడా తిరిగి మనకి రావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మనం కష్టపడాల్సి వస్తోంది. ఇదేం సమాఖ్య అని పలుమార్లు ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ పన్నుల ఆదాయంలో 30శాతం వాటా అందిస్తుంటే కేంద్రం నుంచి కేవలం 18శాతం మాత్రమే నిధులు తిరిగి వెనక్కి వస్తున్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాల్లో అసంతృప్తి ఉంది.

స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దక్షిణాదిపై కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ప్రాంతీయ అనుకూలతలు కావొచ్చు పాలకుల సమర్థత కావొచ్చు కానీ దక్షిణాది తయారీ, సేవా రంగాల్లో గణయనీయమైన ప్రగతి సాధించింది. ఇక్కడ పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతోంది. ఇలా సృష్టిస్తున్న సంపదను చాలా వరకూ ఉత్తరాదికి తరలిస్తున్నారు. కానీ అక్కడ అబివృద్ధే జరగడం లేదు. యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు వెనుకబడిపోతున్నాయి కానీ ముందుకు రావడం లేదు. అయితే కేంద్రంలో ఉండేపాలకులు ఉత్తరాదిపైనే దృష్టి కేంద్రీకరించి నిధులన్నీ వృధా చేస్తున్నారు కానీ దక్షిణాదికి మరింత ప్రోత్సాహం ఇచ్చేపని చేయడం లేదు. అవార్డులు ఇవ్వటంలో సైతం కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపుతోంది. పద్మా అవార్డులు చాలా తక్కువగా దక్షిణాదికి చెందినవారికి దక్కుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే అత్యధిక ఆదాయం ఆర్జిస్తుంటే, రైల్వే బడ్జెట్‌లో అధికమొత్తం ఉత్తరాదికి ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు తూతూ మంత్రంగా ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నారు.

పాంచజన్య అనే పత్రికకు ఎడిటర్‌గా ఉన్న బీజేపీ సిద్ధాంతకర్త గతంలో దక్షిణాది ప్రజలపై తీవ్రమైన జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వారు నల్లజాతి అన్నట్లుగా మాట్లాడారు. దక్షిణాది వాళ్లు నల్లగా ఉంటారు. అయినా మాకు ఎలాంటి వివక్షా లేదు. మేము శ్రీకృష్ణుడ్ని పూజించలేదా అంటూ దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారు అయినప్పటికీ కలసి ఉంటామంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. అదేదో ఉత్తరాది ప్రజలు దేశం నుంచి విడిపోతామన్నట్లుగా దక్షిణాది ప్రజలు కలసి ఉందామని బతిమాలుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అప్పట్లో ఈ అంశంపై దుమారం రేగింది. దేశం నుంచి విడిపోయే ఉద్దేశం దక్షిణాదికి లేదు. నిజంగా విడిపోయే పరిస్థితి వస్తే దక్షిణ భారదేశంలో చాలా అడ్వాన్స్‌డ్‌ కంట్రీ అవుతుంది. యూరోపియన్ కంట్రీస్‌తో పోటీ పడేలా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. నిజానికి దక్షిణాదినే ఉత్తరాదితో కలిసి ఉంటోంది. కానీ అంతు లేకుండా చూపిస్తున్న వివక్ష వల్ల దక్షిణాదిలో మరో ఆలోచనలు వస్తున్నాయి.

పన్నుల ఆదాయంలో పంపిణీకి జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తున్నారు. కానీ ఇప్పుడు 2011 జనగణను లెక్కలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జనాభా నియంత్రణ ఉద్యమంలో దక్షి్ణాది కీలకంగా వ్యవహరించింది. ఫలితంగా జనాభా తగ్గిపోయారు. దీని వల్ల దక్షిణాదికి నిధుల కేటాయింపు తగ్గిపోవడం మాత్రమే కాదు. 2026లో దక్షిణాది ష్ట్రాలకు పార్లమెంటు ఉభయ సభల్లో సీట్ల సంఖ్యా కోసుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. లోక్‌సభ సీట్లలో మార్పుచేర్పులు జరిగేది తిరిగి 2026లోనే. కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడటం కోసమే ఈ నియమం పాటించారు. ఇప్పుడు ఇక 2011 జనగణననే లెక్కలోకి తీసుకుంటే నిధులే కాదు. దక్షిణాదికి పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిపోతాయి. 2026 తర్వాత కొత్త జనాభా లెక్కల ప్రకారం మార్పుచేర్పులు చేస్తే తక్కువ జనాభా రేటున్న దక్షిణ భారత రాష్ట్రాలు సీట్ల పరంగా నష్టపోతాయి.

కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరిగుతూనే ఉంది. గత పదేళ్లుగా కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖ ఒక్కటి కూడా దక్షిణాదికి లేదు. రాష్ట్రపతి వంటి పదవులు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ఒక ప్రాంతానికి దీర్ఘకాలంపాటు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో వేర్పాటు వాదనలు ఏర్పడతాయి. సినీనటుడు కమలహాసన్‌, డిఎంకె నాయకుడు స్టాలిన్‌, ద్రవిడనాడు ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాలు కలిసివస్తే తాను స్వాగతిస్తానని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ సైతం యునైటెడ్‌ స్టేట్స్‌ఆఫ్‌ సదరన్‌ ఇండియా ఆలోచనకు మద్దతు పలికారు. 1962లో రాజ్యసభలో మాట్లాడిన అన్నాదురై మొదట వేర్పాటు వాదాన్ని వినిపించారు. ద్రవిడులకు స్వయం నిర్ణయాధికారం కావాలని ఆయన గట్టిగా కోరారు. ప్రస్తుతం వివక్ష అంతకతంకూ పెరిగిపోతోంది. అదే సమయంలో దక్షిణాదిలో అభివృద్ది అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడుతోంది. కానీ ఉత్తరాది మాత్రం అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. అయినప్పటికీ దక్షిణాదిపై చూపిస్తున్న వివక్ష పెరుగుతూ ఉంటే అది దేశానికి మంచిది కాదనే వాదనలు ఎక్కువగానే వినిపిస్తూ ఉంటాయి.