Gujarat Results.. బీజేపీ నయా రికార్డ్‌

By KTV Telugu On 8 December, 2022
image

ఏ బిడ్డా అది మోడీ అడ్డా
గుజరాత్‌లో కమల వికాసం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. వరుసగా ఏడోసారి విజయఢంకా మోగించింది. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా మరోసారి కమలనాథులను విజయతీరాలకు చేర్చింది. బీజేపీ ఎత్తుకున్న భూమిపుత్ర నినాదం కలిసొచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. గుజరాత్‌లో 1995 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. అయితే 1985 అసెంబ్లీ ఎన్నికల్లో 149 స్థానాలతో కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును మాత్రం కాషాయపార్టీ సొంతం చేసుకోలేకపోయింది. ఈసారి ఆ రికార్డుపై గురిపెట్టిన మోడీ-షా ద్వయం ఆ లక్ష్యానికి చేరువైనట్లే కనిపిస్తోంది. ఇక గతంలో పశ్చిమ్ బెంగాల్‌లో వామపక్షాలు నెలకొల్పిన రికార్డును బీజేపీ సమం చేసింది. బెంగాల్‌లో వామపక్షాలు 33 ఏళ్ల పాటు పాలన సాగించగా ఇప్పుడు బీజేపీ కూడా అదే ఫిగర్ అందుకుంటోంది.

మొత్తం 182 సీట్లున్న గుజరాత్‌లో ఏకంగా 150కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే 150 సీట్లల్లో కమలం పార్టి విజయం సాధించనున్నట్లు స్పష్టమవుతోంది. గుజరాత్‌ చరిత్రలోనే ఈ స్థాయి సీట్లు ఎవరికీ ఎప్పుడూ రాలేదు. గతంలో ఏ పార్టీకి కూడా ఈ స్థాయిలో మెజారిటీ రాలేదు. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. 27 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ ఈసారి భారీగా సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఇప్పటి వరకూ ఆదివాసీ ఓట్లను గంపగుత్తగా దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి మాత్రం ఆప్ రాకతో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ ఓట్లను ఆప్, ఎంఐఎం భారీగా చీల్చినట్టు స్పష్టమవుతోంది.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు దక్కాయి. ఐతే ఈసారి ఏకంగా 150కి పైగా సీట్లు వస్తుండడంతో కాషాయ దళంలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఏకపక్ష విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గుజరాత్‌లో నరేంద్ర మోడీ ఎక్కువ కాలం సీఎంగా పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ఉన్నారు. తదుపరి సీఎం ఎవరన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. అటు, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ ఖంగుతిన్న పరిస్థితి కనిపిస్తోంది.