గుజరాత్‌ మోడల్‌ బీజేపీని గట్టెక్కిస్తుందా?

By KTV Telugu On 2 December, 2022
image

ఆప్‌-కాంగ్రెస్‌ ఓట్ల చీలిక.. బీజేపీకే ప్లస్సా?

అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్‌ ఎన్నికల్లో, స్థానికసంస్థల ఎన్నికల్లో అన్నిట్లో మోడీనే గెలిపించాలా ఏం ఆయనకు పది తలలున్నాయా అని కాంగ్రెస్‌ ఉక్రోషం. మీరెంత తిడితే నాకంత ఎనర్జీ అంటూ ప్రధాని రియాక్షన్‌. గుజరాత్‌ ఎన్నిక అన్ని పార్టీలకీ ప్రతిష్టాత్మకం. ప్రధాన పోటీ బీజేపీ-ఆమ్‌ఆద్మీ మధ్యేనన్న ప్రచారంతో చివర్లో కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. కానీ కమలం, చీపురుపార్టీల మధ్యే గట్టిపోటీ కనిపించింది. మొదటి దశపోలింగ్‌ ముగియటంతో రెండోదశ ప్రచారం జోరుమీదుంది.

డిసెంబరు 5న మొత్తం 93 స్థానాలకు గుజరాత్‌ రెండో దశ పోలింగ్‌జరగనుంది. ఈ సీట్లలో 61 మధ్య గుజరాత్‌లో, 32 ఉత్తర గుజరాత్‌లో ఉన్నాయి. మధ్య గుజరాత్‌లో ఆదివాసీలు, అర్బన్‌ ప్రాంతాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కాంగ్రెస్‌కి మొదట్నించీ మంచి పట్టు ఉంది. కానీ కీలక నేతలు చేజారటంతో ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని చెప్పలేం. ఇక కాంగ్రెస్‌ సంప్రదాయిక ఓట్లుగా భావించే క్షత్రియ, దళిత, ఆదివాసీ, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లు కూడా గంపగుత్తగా పడే అవకాశాలు లేవంటున్నారు. అదే సమయంలో బీజేపీకి లాభించే పరిస్థితి కూడా లేదు. ఆ ఓటర్లు ఆప్‌వైపు మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గుజరాత్‌ మోడల్‌తో రూపుమారిన పట్టణాలు, నగరాల్లో బీజేపీ ఓటు బ్యాంకు బలంగా ఉంది. కాంగ్రెస్, ఆప్‌ మధ్య కొన్ని వర్గాల ఓట్ల చీలికతో బీజేపీ లాభపడొచ్చు. అందుకే మధ్య గుజరాత్‌పై బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. ఉత్తర గుజరాత్‌లో అధికధరలు, రోడ్డునపడ్డ చిరువ్యాపారులు బీజేపీపై వ్యతిరేకత పెంచాయి. సామాజిక సమీకరణాలు కూడా బీజేపీకి అంత అనుకూలంగా లేవు. ఉత్తరాన ప్రాబల్యమున్న ఠాకూర్లు మొదట్నుంచి కాంగ్రెస్‌కే మద్దతిస్తూ వస్తున్నారు. పటీదార్లు, ఠాకూర్లు, దళితులు పోటాపోటీగా ఆందోళనలు చేసిన ప్రాంతం కావటంతో ఇక్కడి ఫలితాలపై బీజేపీ కలవరపడుతోంది. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో వ్యతిరేకత దెబ్బకొట్టేలా ఉంది. అయితే అదే సమయంలో తనకున్న సానుకూలతలు, కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య ఓట్ల చీలికతో మరోసారి గట్టెక్కుతాననే ధీమాతో ఉంది కమలం పార్టీ.