నిర్మలమ్మ పద్దులో హైలైట్స్ ఇవే!

By KTV Telugu On 25 July, 2024
image

KTV TELUGU :-

వికసిత్ భారత్ లక్ష్యంగా.. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా.. ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ప్రధానంగా 9 కీలక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ.. ఈ బడ్జెట్‌ని రూపొందించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన-ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాతి తరం సంస్కరణల లాంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంది కేంద్రం.

ఇక.. బడ్జెట్ ప్రసంగంలో.. నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. కొత్త పన్ను విధానం శ్లాబుల్లో మార్పులు చేయడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్‌ని 50 వేల నుంచి 75 వేలకు పెంచారు. ఇక.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో 2 లక్షల 20 వేల కోట్లు కేటాయించారు. ముద్ర లోన్స్ పరిమితిని 10 నుంచి 20 లక్షలు పెంచారు. బడ్జెట్‌లో.. గ్రామీణాభివృద్ధి కోసం 2 లక్షల 66 వేల కోట్లు కేటాయించారు.

తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని ఇవ్వనుంది కేంద్రం. గరిష్ఠంగా 15 వేలను 3 వాయిదాల్లో చెల్లిస్తారు. ఇందుకు.. నెలకు లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు. ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించారు. 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి లక్షన్నర కోట్లు కేటాయించారు. అలాగే. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో డార్మిటరీ తరహా అద్దె ఇళ్లను నిర్మించనున్నారు.

వచ్చే ఐదేళ్లలో.. 20 లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. 5 వందల పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు 10 లక్షల దాకా విద్యా రుణాలు ఇవ్వనుంది కేంద్రం. ఇక.. మౌలిక సదుపాయాల కల్పనకు 11 లక్షల 11 వేల కోట్లు కేటాయించారు. ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం. ఇక.. మహిళలు, బాలికల కోసం 3 లక్షల కోట్ల పథకాలు రూపొందించారు. విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి లక్షా 48 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు లక్షన్నర కోట్లతో దీర్ఘకాల వడ్డీ లేని రుణాలిస్తుంది కేంద్రం. ముఖ్యంగా.. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసి్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. అదేవిధంగా.. బంగారం, వెండి దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి, ప్లాటినమ్‌పై 6.4 శాతానికి తగ్గించింది కేంద్రం. ఇక.. క్యాపిటల్ గెయిన్స్ విధానాన్ని సరళీకరించారు. దీర్ఘకాల లాభాలపై పన్నెండున్నర శాతం పన్ను మాత్ర విధిస్తారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఏంజెల్ ట్యాక్స్‌ని రద్దు చేశారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి