కాంగ్రెస్ గెలిచింది..అధికారంలోకొస్తుందా?
గుజరాత్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌పార్టీకి హిమాచల్‌ప్రదేశ్ విజయంతో పోయిన ప్రాణం లేచొచ్చింది. ప్రతీసారీ ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న హిమాచల్ ఓటర్లు బీజేపీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు కట్టబెట్టారు. కానీ మ్యాజిక్ ఫిగర్ కంటే కొన్ని సీట్ల మెజారిటీనే ఎక్కువగా ఉండటంతో అధికారపీఠం దక్కుతుందా లేదా అన్న అనుమానం మొదలైంది.
పదీపదిహేను సీట్ల తేడా ఉంటేనే బీజేపీ చక్రం తిప్పేస్తుంది. కండువాలు మార్చి అధికారపగ్గాలు అందుకుంటుంది. అలాంటిది బొటాబొటి మెజారిటీ వచ్చిన కాంగ్రెస్‌కి హిమాచల్‌ప్రదేశ్‌ని అంత సులువుగా అప్పగిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. అందుకే ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. అందరినీ క్యాంప్‌కి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.
ఆపరేషన్ కమలాన్ని తిప్పికొట్టేందుకు గెలిచిన ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలిస్తోంది కాంగ్రెస్‌పార్టీ. ప్రియాంకగాంధీ ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. కొత్త ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలకు అప్పగించారని సమాచారం. ఎవరూ చేజారిపోకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా ఐదేళ్లు దాన్ని కాపాడుకోవడం కాంగ్రెస్‌కి పెద్ద సవాలే కాబోతోంది.