మూడురోజుల్లో ఐదున్నరలక్షల కోట్ల నష్టం. అదానీకేం బానే ఉన్నాడు. వాపును చూసి బలుపనుకుని పెట్టుబడులు పెట్టిన మదుపరులు హాహాకారాలు చేస్తున్నారు. ఈ పతనంలో ఇక్కడితో ఆగేలా లేదు. అదానీ షేర్లు పాతాళానికి జారిపోయేలా ఉన్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక తప్పని మాటలతో ఖండించడమే తప్ప నష్టనివారణకు అదానీ చేసిందేమీ లేదు. ఆయననుంచి పెట్టుబడుదారులకు ఎలాంటి భరోసా లేదు. ఒక్క రిపోర్ట్‌తో గౌతం అదానీ సంపద మంచుకొండలా కరిగిపోతోంది. ప్రపంచకుబేరుల్లో ఆయన స్థానం జర్రున జారిపోతోంది. అదానీ గ్రూప్ అసాధారణ ఎదుగుదల వెనుక ఏం జరిగిందో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బట్టబయలుచేయటంతో ఈ మల్టీమిలీయనీర్ ముసుగు తొలగిపోయింది. ఆ నివేదికకు ముందు 200బిలియన్ డాలర్లకు పైగా ఉన్న అదానీ సంపద మూడ్రోజుల్లోనే 80 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వ్యాపార సామ్రాజ్యం పేకమేడలా కూలిపోతుంటే నిస్సహాయంగా చూస్తున్నాడు అదానీ.
నేపథ్యమేమీ లేదు. వందరూపాయలతో ముంబై వచ్చాడు. కాలేజీ డ్రాపవుట్. అలాంటి వ్యక్తి ఇంత భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడంటే తెరవెనుక ఎన్ని జరిగి ఉండాలి అందుకే ఓ నివేదికకే ఆయన సామ్రాజ్యం కంపించిపోతోంది. అదానీ సంపదలో ఎక్కువభాగం ఆయన 30 సంవత్సరాల కిందట స్థాపించిన అదానీ గ్రూప్‌తోనే ముడిపడింది. పోయినేడాది సంపదలో జెఫ్ బెజోస్‌ని మించిపోయాడు అదానీ. అలాంటి వ్యాపార దిగ్గజం నాలుగోస్థానంనుంచి 15వ స్థానానికి పడిపోయారు. స్టాక్‌మార్కెట్‌లో అదానీ గ్రూప్ పతనంతో ఆయన ర్యాంక్ ఒక్కరోజులోనే 11నుంచి 15కి దిగజారింది. అదే సమయంలో ముఖేష్ అంబానీ 9వస్థానానికి ఎగబాకారు. అదానీ ఎదుగుదల అసాధారణమే కాదు అసహజంగా కూడా కనిపిస్తుంది. ఆయన షేర్లు స్వల్పకాలంలోనే ఏకంగా 891శాతం పెరిగింది. ఇది అసహజ ఎదుగుదలని కొందరు అనుమానించిందే నిజమైంది. నిజంగా కంపెనీకి అంత విలువ ఉంటే, ఆ కంపెనీపై మదుపరులకు భరోసా ఉంటే ఈ స్థాయిలో షేర్ల పతనం ఉండేది కాదు.
1988లో కమోడిటీ ట్రేడింగ్ మొదలుపెట్టడానికి ముందు అదానీ డైమండ్ బిజినెస్ చేసేవారు. తర్వాత అదే అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌గా మారింది. తర్వాత అన్ని రంగాల్లో అదానీ వేలుపెట్టారు. అధికారంలో ఉన్న పెద్దల ఆశీస్సులు తోడుకావటంతో సునాయాసంగా అంతస్తులు పెంచుకుంటూ పోయారు. ఎంటర్‌ప్రైజెస్ తర్వాత గుజరాత్ ముంద్రపోర్ట్ నిర్వహణ బాధ్యతలు అదానీనే తీసుకున్నారు. దేశంలోని అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారుల్లో అదానీ ఒకరు. ఆస్ట్రేలియాలోని వివాదాస్పద కార్మైకేల్ కోల్ మైన్ కూడా ఆయన నిర్వహణలోనే ఉంది. ఈమద్య అదానీ డేటా సెంటర్లు, సిమెంట్స్, ఎయిర్‌పోర్టుల్లోనూ వేలుపెట్టారు. మీడియా రంగంలోనూ ఆయన జొరబడ్డారు.
23వేలమంది ఉద్యోగులున్న అదానీ గ్రూప్ అడ్డదారుల్లో ఎదిగిందని హిండెన్‌బర్గ్ నిగ్గు తేల్చింది. యూఎస్ ట్రేడెడ్ బాండ్లు, నాన్ ఇండియన్ ట్రేడెడ్ డెరివేటివ్ సాధనాలతో అదానీ షార్ట్ పొజిషన్లు తీసుకున్నట్లు హిండెన్ బర్గ్ గుర్తించింది. అదానీ సంస్థల స్కై-హై వాల్యుయేషన్స్ గురించి ప్రశ్నించిన హిండెన్‌బర్గ్ 88 సందేహాలకు సమాధానం కోరింది. కానీ దేనికీ సూటిగా స్పందించలేదు అదానీగ్రూప్. తమపై కుట్రపూరితంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న వివరణ తప్ప ప్రశ్నలకు జవాబు మాత్రం ఇవ్వలేదు. గ్రూప్ విస్తరణలో కీలకపాత్ర గౌతమ్ అదానీ అన్న వినోద్ శాంతిలాల్ అదానీది. ఆయన కనుసన్నల్లోనే అదానీ గ్రూప్ ప్రమోటర్లు షేర్లను ఆకాశానికి ఎత్తేశారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా పిలిచే బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కరేబియన్ దేశాల్లో 38 షెల్ కంపెనీల ఏర్పాటువెనుక దుబాయ్ కేంద్రంగా పనిచేసే అదానీ అన్ననే కీలకమన్న అనుమానాలున్నాయి. దుబాయ్, సింగపూర్, మారిషస్ తదితర దేశాల నుంచి డొల్ల కంపెనీలు నడిపిస్తున్నట్లు హిండెన్‌బర్గ్ ఆధారాలు సేకరించింది. షెల్ కంపెనీల ద్వారానే అక్రమ నగదు లావాదేవీలు, గ్రూప్ లిస్టెడ్ కంపెనీల లాభాల మళ్లింపు జరిగినట్లు హిండెన్‌బర్గ్ తేల్చింది. పనామా పేపర్ల కేసులోనూ వినోద్ అదానీ పేరు వినిపించింది. చక్రం తిప్పే అన్న వెనుక ఉండటంతో గౌతం అదానీ జెట్ స్పీడ్‌తో ఎదిగిపోయారు.
413 పేజీల సుదీర్ఘ వివరణలో అసహనం ఉక్రోషమే తప్ప హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశాలపై అదానీ గ్రూప్ స్పందించలేదు. హిండెన్‌బర్గ్ కూడా దీనిపై అదే స్థాయిలో ప్రతిస్పందించింది. జాతీయవాదంతో మోసాన్ని దాచలేమంటూ ఆ సంస్థ ఘాటుగా జవాబిచ్చింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో కొత్త షేర్ల జారీతో 2.5 బిలియన్ డాలర్లు సేకరించే ప్రయత్నాల్లో ఉండగా హిండెన్‌బర్గ్ ఆరోపణలు అదానీని సంకటంలో పడేశాయి. అదానీకి ఇంకా ఏదోమూల కాస్త అదృష్టం మిగిలి ఉన్నట్లుంది. ఆ గ్రూప్ షేర్లన్నీ దారుణంగా పతనం అవుతున్న సమయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవోకు మాత్రం విచిత్రంగా సానుకూల స్పందన లభించింది. ఇష్యూలో 4.55 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తే 5.08 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు కావటంతో అదానీ ఊపిరిపీల్చుకుంటున్నారు.
అదానీ గ్రూప్ షేర్ల పతనం ఏదో స్థాయిలో ఆగొచ్చు. కానీ ఆయన్ని అంతా దొంగలా చూస్తారు. ఏమాత్రం ఒడిదుడుకులు ఉన్నా తొందరగా బయటపడాలనే చూస్తారు. తన గ్రూప్ ఆరోగ్యకరంగా ఉందని అదానీ చెబితే సరిపోదు. అందరిలో నమ్మకాన్ని కలిగించాలి. అదానీ గ్రూప్ ఈ సంక్షోభంనుంచి త్వరలోనే బయటపడుతుందన్నది మార్కెట్ నిపుణుల మాట. కానీ ఆలోపు జరిగే అనర్ధాలతో నష్టపోయేది అదానీ ఒక్కడే కాదు. ఆయన గ్రూప్‌ని నమ్ముకున్న లక్షలమంది. వారికి జరిగిన నష్టాన్ని అదానీ పూడ్చగలరా. మదుపరుల సంపదను కాపాడేందుకు కొన్ని షేర్ల సర్క్యూట్ పరిమితిని సవరించినంత మాత్రాన అదానీ గ్రూప్‌పై ఇప్పటికిప్పుడు విశ్వాసం పెరగదు. ఆయన మళ్లీ మార్కెట్ విశ్వాసాన్ని చూరగొనేలోపు ఎంతమంది అమీర్లు బికారులైపోతారో చెప్పలేం.