అదానీ.. మొన్నటిదాకా అంబానీని మించిపోతాడనుకున్నవాడు అథ:పాతాళానికి జారిపోతున్నాడు. ఈ ఎదుగుదలకి కారణమైన పెద్దలు మోకులేసి మళ్లీ నిలబెట్టాలనుకుంటున్నారు. అయినా పట్టు చిక్కడం లేదు. షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. ఆఖరిశ్వాస సమయంలో తులసితీర్థం పోసినట్లు ఇంకా జీవం ఉందని చెప్పేందుకు మధ్యమధ్యలో కొన్ని షేర్లు ఆకుపచ్చరంగులో కనిపిస్తున్నాయి. సరే అదానీ ఉంటాడో పోతాడో సవాళ్లు తట్టుకుని నిలబడతాడో లేదో తర్వాతి విషయం. ఆయనపై అభియోగాలు తప్పని నిరూపించేందుకు కుప్పకూలుతున్న అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని మళ్లీ నిలబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి.
అదానీ వ్యవహారం కాంగ్రెస్ చేతికి బ్రహ్మాస్త్రంలా దొరికింది. అదానీ గ్రూపును కాపాడేందుకు ఎఫ్‌పీవోలో పెట్టుబడులు పెట్టాలంటూ స్వయానా కేంద్రమంత్రి పారిశ్రామికవేత్తలతో లాబీయింగ్ చేస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణ కలకలం రేపుతోంది. కేంద్రమంత్రి వర్గంలో హైప్రొఫైల్లో ఉన్న ఓ మంత్రి అదానీకోసం ఐదారుగురు పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేశారన్నది కాంగ్రెస్ అభియోగం. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్. ఇది భారతీయ సెక్యూరిటీస్ రెగ్యులేషన్ నిబంధనలను ఉల్లంఘించడమేనంటోంది కాంగ్రెస్. అదానీ ప్రతిష్ఠను కాపాడేందుకే బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఆ తర్వాత అదానీ ఎఫ్‌పీవోను రద్దుచేసి ఇన్వెస్టర్ల డబ్బు చెల్లించారన్నది కాంగ్రెస్ ఆరోపణ. ప్రభుత్వరంగ సంస్థలు అదానీ ఎఫ్‌పీవోలో పెట్టుబడులు ఎందుకు పెట్టాయన్న ప్రశ్నతో కేంద్రాన్ని ఇరకాటంలో పడేస్తోంది కాంగ్రెస్.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కుట్రపూరితంగానే అభియోగాలు మోపిందని అదాని గ్రూప్ ఆరోపిస్తోంటే హిండెన్‌బర్గ్ వాదనకు మద్దతిచ్చేలా బ్లూమ్‌బర్గ్, ఫోర్బ్స్ కథనాలు ప్రచురించాయి. అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ పేరుతో సేకరించిన నిధుల్ని ఆస్ట్రేలియాలోని కార్మికాల్ కోల్మైన్కి మళ్లించిందని బ్లూమ్‌బర్గ్ ఆరోపించింది. 2020లో రష్యా ప్రభుత్వానికి చెందిన వీటీబీ బ్యాంకుతో రుణ ఒప్పందంకోసం అదానీ సోదరుడు వినోద్ అదానీ గ్రూపు షేర్లు తాకట్టు పెట్టిన విషయం ఇప్పుడు బయటికొస్తోంది. అంబుజా, ఏసీసీ సిమెంట్స్ కొనుగోలులో కీలకంగా వ్యవహరించిన మారిష్‌సకు చెందిన ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అదానీ సోదరుడిదేనని ఫోర్బ్స్ ఆధారాలు బయటపెట్టింది. వినోద్ అదానీ కంపెనీలతో సంబంధం లేదన్నట్లు అదానీ గ్రూపు విడుదల చేసిన 400 పేజీల స్టేట్మెంట్ ఈ ఆధారాలతో తేలిపోతోంది.