కలెక్టర్ – ది బీహార్ చాప్టర్

By KTV Telugu On 2 May, 2023
image

ఖాకీ – ది బీహార్ చాప్టర్ పేరుతో నెట్ ఫ్లిక్స్‌లో ఓ వెబ్ సిరీస్ వచ్చింది. అది వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ . చాప్టర్ వన్‌లో ఓ యువ ఐపీఎస్ అధికారి బీహార్‌లో ఎదుర్కొన్న పరిస్థితులను చూపించారు. అది వెబ్ సీరిస్ కాబట్టి హీరోను చంపలేదు. కానీ బీహార్‌లో ఆ రోజుల్లో అంటే 90ల్లో ఉండే అరాచకాలను చూపించారు. రాజకీయ నాయకులు నేరగాళ్ల ముఠాలు ఎలా పడుగూ పేకల్లా కలిసిపోయి ఉండేవో చూపించారు. నిజంగా అంత అరాచకం ఉండేదా అని ఇప్పుడు ఆశ్చర్యపోతూంటారు కానీ తెలంగాణలోని మహబూబ్ నగర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గురించి తెలుసుకుంటే అంత కంటే ఘోరంగా ఉంటుందని అర్థమవుతుంది. అప్పటి ముఠా రాజకీయాల నుంచి తప్పిస్తానని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ ఇప్పుడు అలాంటి దారుణాలకు పాల్పడిన వారందర్నీ జైలు నుంచి బయటకు తెస్తున్నారు. అందుకే అప్పటి బీహార్ చాప్టర్ మరోసారి ప్రారంభమవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉమ్మడి ఏపీలో ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్రను మర్డర్ చేశారు. ఓ ఐపీఎస్ ఆఫీసర్ జోలికి వెళ్లడానికి ఉగ్రవాద సంస్థలు కూడా ముందూ వెనుకా ఆడతాయి. ఇప్పటి వరకూ ఇలా హత్యకు గురైన వారు అతి తక్కువ మంది. అలాంటి వారిలో ఉమేష్ చంద్ర. అంతకు ముందు ఆయన ట్రాక్ రికార్డు ఫియర్ లెస్ గా ఉండటంతో ఇప్పటికీ ఉమేష్ చంద్రను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్ హత్య 1999లో జరిగింది. అంతకు ఐదేళ్ల ముందే అంటే 1994లో ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్యను హత్య చేశారు. కానీ హత్య చేసింది టెర్రరిస్టులో నక్సలైట్లో కాదు రాజకీయ నాయకులు. బీహార్‌లో రాజకీయ నాయకులే ముఠా నాయకులుగా మారిపోయి ఉంటారు. కిడ్నాప్‌లు హత్యలు దొమ్మీలే వారి వ్యాపారం. రాజకీయం సైడ్ బిజినెస్. అలాంటి రాష్ట్రంలో కృష్ణయ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గా ఉండగా హత్య చేశారు. అదీ కూడా అత్యంత దారుణంగా. ఆ కృష్ణయ్య తెలంగాణకు చెందిన అధికారి.

కృష్ణయ్య తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన వారు. తండ్రి వ్యవసాయ కూలీ. అట్టడుగు కుటుంబం నుంచి పైకి వచ్చిన కృష్ణయ్య ఎంతో కష్టపడి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించారు. ఆయనకు బీహార్ క్యాడర్ కేటాయించారు. కృష్ణయ్య నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం. అరాచక ముఠాలు రాజ్యమేలుతున్నా ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. అణిచివేయడానికి ప్రాదాన్యం ఇచ్చేవారు. అలా ఆయన గోపాల్ గంజ్ జిల్లాలో కలెక్టర్ మేజిస్ట్రేట్‌గా మసయంలో ఆనంద్ మోహన్ సింగ్ అనే మాఫియా ప్లస్ రాజకీయనాయకుడు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.

ఆనంద మోహన్‌ సింగ్ బీహార్‌లో మాఫియా ముఠా నాయకుడు. గోపాల్‌ గంజ్‌ జిల్లాలో తనమాటను నెగ్గించుకునేవాడు. ఆ జిల్లాకు ఏ అధికారి వచ్చినా అతడు చెప్పినట్టు వినాల్సిందే. ఆ జిల్లా కలెక్టర్‌ గా వచ్చిన జి.కృష్ణయ్య ఆనంద్ మోహన్‌కు తలొగ్గలేదు. ఆయన ఎవరి మాటా వినేవాడు కాడు. ఆనందమోహన్‌ గద్దింపులనూ హూంకరింపులనూ అతడు లెక్క చేయలేదు. ఆయన అడ్డు తొలగించుకునేందుకు ఆనంద మోహన్‌ తన ముఠాను పురికొల్పి కృష్ణయ్యను 1994లో హత్య చేయించాడు. అతడి మనుషులు కృష్ణయ్యను జీపులోంచి లాగి అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. ఆనందమోహన్‌ భార్య లవ్లీ సింగ్‌ కూడా ముఠా నాయకురాలే. ఓ కలెక్టర్‌ ప్రాణానికే దిక్కులేని రాష్ట్రంగా బీహార్ మారిపోయిందని జాతీయంగా చెడ్డ పేరు వచ్చింది.

ముక్కుసూటిగా వ్యవహరించడం వల్లనే కృష్ణయ్యను ఆనందమోహన్‌ సింగ్‌ ముఠా హత్య చేసింది. జిల్లా మేజస్ట్రేట్‌ హోదాలో ఉన్న అధికారికే రక్షణలేదని బీహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. నితీశ్‌ కుమార్‌ ఈ పరిస్థితిని మారుస్తానని ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చారు. సుదీర్ఘ కాలం ఆయన సీఎంగా ఉన్నారు. కొంత వరకూ కట్టడి చేసినా ఇప్పుడు మళ్లీ రాజకీయ అవసరాల కోసం అలాంటి ముఠాల్ని ప్తోసహిస్తున్నారు.
ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య హత్య కేసులో ఆనందమోహన్‌కి కింది కోర్టులో మరణశిక్ష పడి హైకోర్టు యావజ్జీవ ఖైదుగా శిక్షగా మార్చింది. జైల్లో ఉన్న ఆనంద్ మోహన్ అక్కడి నుంచి రాజకీయం దందాలుbచేస్తున్నారు. ఆయన భార్య, కుమారుడు కూడా ఎమ్మెల్యేలే. గోపాల్ గంజ్ జిల్లాల్లో ఇప్పటికీ ఆయన ప్రభావం ఉంది.

జైల్లోనే నుంచే అలా చేస్తున్నారండే ఇక బయటకు వస్తే ఎలా ఉంటుంది. లాలూకు అత్యంత సన్నిహితుడైన ఆయనను నితీష్ ప్రభుత్వం రూల్స్ మార్చి మరీ విడిచి పెట్టేసింది. ఆనంద్ మోహన్ సింగ్‌కు ఎక్కువ కాలం జైలు శిక్షను అనుభవించిన వారిని విడుదల చేసేందుకు ఉద్దేశించిన నియమ నిబంధనలు ఇలాంటి వారికి వర్తించవు. ఇది క్షమాభిక్ష సూత్రాలకు వ్యతిరేకం. విధి నిర్వహణలో ఉన్న అధికారులను హత్య చేసిన వారికి ఈ నిబంధన వర్తించదన్న నిబంధన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆ రూల్స్‌ను సడలించడం వల్ల ఆనందమోహన్‌ విడుదలచేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్‌లో అధికారంలో ఉన్నప్పుడల్లా ఈ ముఠాలు చెలరేగిపోయేవి ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు రాజకీయాల కోసం వారికి స్వేచ్చనిస్తున్నారు. వారెలాంటి అరాచకాలకు కేంద్ర బిందువుగా మారుతారోనన్న ఆందో్ళన అంతటా వ్యక్తమవుతోంది.