కశ్మీర్ మారిపోయిందా ? ఇండియన్ స్విస్ అవుతుందా?

By KTV Telugu On 25 May, 2023
image

కశ్మీర్‌లో జీ 20 సదస్సుకు సంబంధించి టూరిజం అంశంపై నిర్వహించిన సన్నాహాక సమావేశానికి కశ్మీర్ వేదిక అయింది. కశ్మీర్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అనే ఆలోచన గత కొన్ని దశాబ్దాల్లో లేదు. దానికి అక్కడ ఉండే భద్రతాపరమైన సమస్యలే కాదు అంతర్జాతీయంగా ఆ ప్రాంతాన్ని వివాదాస్పదంగా చిత్రీకరించడానికి చైనా, పాకిస్తాన్ తో పాటు మరికొన్ని వాటి మిత్రదేశాలు చేసే ప్రయత్నాలు కూడా అయితే ఈ సారి పరిస్థితి మారింది. చైనా అభ్యంతరం చెప్పినప్పటికీ జీ 20 సన్నాహక సదస్సు కశ్మీర్‌లో జరిగింది. 30 దేశాల నుంచి మంత్రులు, ప్రతినిధులు వచ్చారు. వారితో పాటు ప్రపంచ మీడియా వచ్చింది. ఏ చిన్న ఘటన జరిగినా కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా జరిగే ప్రచారం తేడాగా ఉంటుంది. అందుకే కేంద్రం ఎలాంటి చాన్స్ తీసుకోలేదు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లు వచ్చిన డెలిగేట్స్ ను భయపెట్టేలా కాకుండా ఆహ్లాదంగా ప్రకృతిని ఆస్వాదించేలా చేశారు. దీంతో కశ్మీర్ గురించి చాలా పాజిటివ్ వేలో తొలిసారి ప్రపంచం ముందుకు వెళ్లిందని అనుకోవచ్చు.

జమ్ముకశ్మీర్‌ అందాలకు కేరాఫ్ అడ్రస్. మంచు దుప్పటి కప్పుకున్న భూతల స్వర్గం. ఒక్కసారి అక్కడికి వెళితే మరోసారి చూడాలనిపించే అందాల స్వర్గ ధామం. రారమ్మని పిలిచే మంచు కొండలు, స్వర్గాన్ని తలపించే తులిప్ పూల అందాలు, మైమరపించే ఆపిల్ తోటలు, చినార్ చెట్లు ఇలా కశ్మీర్ అంటే ఓ స్వర్గం ఓ అందాలలోకం. స్వర్గం భూమి మీదకు చేరుకొని దారి మరిచిపోయి ఇక్కడే ఉండిపోయిందా అన్నట్లు ఉంటాయి కశ్మీర్ అందాలు చుట్టూ కొండలు. చిన్నగా కురిసే మంచు కళ్లు పెద్దవి చేసే పచ్చదనం అందాలు మంచుకొండల మధ్యలోంచి నీలం రంగంలో ప్రవహించే నదులు దారి తప్పి స్వర్గానికి వచ్చామా అనే ఫీలింగ్ ఉంటుంది కశ్మీర్‌లో. ఎత్తైన శిఖరాలు, లోయలు, ఆలయాలు, సరస్సులు కశ్మీర్ ప్రత్యేక ఆకర్షణ. దాల్ సరస్సు, బోట్ హౌస్‌లు, తులిప్ గార్డెన్స్‌, నోరూరించే కశ్మీరి రుచులు ఇలా జమ్ముకశ్మీర్‌ ప్రత్యేకతలు ఎన్నో. కానీ టెర్రరిజం పడగ నీడలో కశ్మీర్ ఇమేజ్ మారిపోయింది. అదో నరకం అక్కడికి వెళ్తే తిరిగి రావడం కష్టమనుకునే పరిస్థితి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ఇమేజ్ క్రమంగా మారుతోంది.

ఇటీవలి కాలంలో కశ్మీర్‌లో పర్యాటకం ఊపందుకుంది. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక మంది టూరిస్టులు జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఏటా కనీసం రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ వెళ్తున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా టూరిస్టు కేంద్రాల్లో పర్యాటకులను ఆకర్షించడానికి అధికారులు వివిధ పనులు చేపట్టారు. అందులో ఒకటి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో చీనాబ్ నదిపై నిర్మించిన కొత్త వంతెన. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా ఇకపై తేలిగ్గా చేరుకోవచ్చు. మరోవైపు ఈ ప్రాంతంలోని జనాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, సందర్శకులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. దీంతో జమ్మూ కశ్మీర్‌ పర్యాటక రంగంలో మరిన్ని కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశం తులిప్ గార్డెన్‌‌‌ను కూడా టూరిజం శాఖ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. అంతర్జాతీయ పర్యాటకుల కోసం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు పలు ప్రత్యక్ష అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక పర్యాటకుల రద్దీ పెరగడంతో స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.

మూడేళ్ల కిందటి వరకూ కశ్మీర్ అనే మాట టీవీలో, పేపర్లలో వచ్చిందంటే ఖచ్చితంగా మొదట వినిపించే మాట ఉగ్రవాదుల దాడి తర్వాత రాళ్ల దాడులు శాంతిభద్రతల సమస్యలు. కశ్మీర్ అంటే కల్లోలతమైన చరిత్ర. కానీ అదే కశ్మీర్‌లో ఇప్పుడు జీ 20 సన్నాహాక సమావేశం జరుగింది. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నా ఎక్కడా చిన్న అపశృతి లేకుండా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల పరంగా అసలు ఎలాంటి సమస్యా లేదు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019లో రద్దు చేశారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. జమ్మూకశ్మీర్‌లో అతివాదంపై పోరాటంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కశ్మీర్‌లో మిలిటెంట్ దాడులు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. మరోవైపు మిలిటెంట్ల సంఖ్య కూడా తగ్గింది. ఆపరేషన్ ఆల్ ఔట్’లో భాగంగా చాలా మంది మిలిటెంట్లను భద్రతా సంస్థలు హతమార్చాయి. అతిపెద్ద నెట్‌వర్క్‌ను ఇంత తక్కువ సమయంలో పూర్తిగా తొలగించడం చాలా కష్టం కానీ మూడేళ్లలోనే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితుల్ని టెర్రరిజం అంటే ఇక్కడ లేదే అనే పరిస్థితుల్ని బలగాలు తీసుకు రాగలిగాయి. దీంతో కశ్మీర్ దేశంలో భాగంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు.

కశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ తో పాటు చైనా కూడా వివాదాస్పద ప్రాంతంగా చేయాలని చూసేది. అందుకు బలంగా గతంలో ఉన్న ఆర్టికల్370ని చూపించేది. కానీ కేంద్రం దాన్ని తీసేసిన తర్వాత పూర్తి స్థాయిలో కశ్మీర్ భారత్ భూభాగం అని అక్కడ ప్రత్యేక ప్రతిపత్తి లేదని స్పష్టంగా ప్రపంచానికి వివరిస్తున్నారు. జీ 20 సమావేశం కశ్మీర్ లో నిర్వహించాలనుకున్నప్పుడు చైనా కూడా అభ్యంతరం చెప్పింది. వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించవద్దని చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ధీటుగా తిప్పికొట్టింది. కశ్మీర్ ఏ విధంగానూ వివాదాస్పద ప్రాంతం కాదని పూర్తిగా దేశంలో అంతర్భాగం అని స్పష్టం చేసింది. పాక్ కుతంత్రాలు కూడా ఈ అంశంలో పారలేదు. జీ సదస్సు నిర్వహణ ఖచ్చితంగా కశ్మీర్ టూరిజానికి ఊతరం ఇచ్చేదే. అయితే ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లుగా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించేసిందని అనుకోవడం కూడా తొందరపాటే. దశాబ్దాలుగా ఉన్న పరిస్థితుల్ని అక్కడి ప్రజల ఆలోచనా సరళిని మార్చి భారతీయత అడుగడుగునా కనిపించేలా మార్చగలిగితే కశ్మర్ విషయంలో భారత ప్రభుత్వం అనుకున్న విజయాల్ని సాధించినట్లు అవుతుంది. కొన్నాళ్ల కిందటి వరకూ కశ్మీర్ ఎప్పటికీ వివాదాస్పద ప్రాంతంగానే ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు మార్పు వస్తుందనేది నిజం. అది పూర్తిగా రావాల్సి ఉంది.