ఎలక్షన్‌ కమిషన్‌పై సుప్రీం నిర్ణయం.. మార్పు మంచిదే

By KTV Telugu On 3 March, 2023
image

దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలుకలైపోతున్నాయి. ఎన్నికల కమిషన్‌మీద కూడా అపవాదులు ఉన్నాయి. న్యాయవ్యవస్థలోనూ జోక్యం చేసుకోవడానికి ఓ పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవీఎంల మీద అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌మీద అపనిందలు ఎదురవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా ఉండటం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా ఉంది. శేషన్‌లాంటి అధికారి వస్తేనే ఈ వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు.
ఇకనుంచి నచ్చినోళ్లను ఎన్నికల కమిషన్‌లో పెట్టడం కుదరదు. కావాల్సినవాడనో పనికొస్తాడనో ఎన్నికల కమిషనర్లుగా అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడేలా ఉంది. అందుకే కొన్ని నియమాలు పెట్టింది అత్యున్నత న్యాయస్థానం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులుగా ఉండే కమిటీనే ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది.

ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే లోక్‌సభలో విపక్ష మెజార్టీ పార్టీ ఎంపీని కమిటీలో సభ్యుడిగా చేర్చాలని సుప్రీం సూచించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకే ఈసీలను రాష్ట్రపతి నియమిస్తారని సుప్రీం తేల్చిచెప్పింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. అది పక్కదారి పడితే వినాశకర పరిణామాలకు దారితీస్తుంది. సుప్రీం తన తీర్పులో ఇదే విషయాన్ని నొక్కిచెప్పింది. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత నవంబరులోనే ఈ తీర్పును రిజర్వ్‌ చేసింది. మాజీ అధికారి అరుణ్‌ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించే ప్రక్రియ వాయువేగంతో 24 గంటల్లో జరిగిపోవడంలో ఔచిత్యాన్ని ఇదివరకే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవసరమైతే ప్రధానిమీదయినా చర్యలు తీసుకునే సత్తా ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఈ దేశానికి అవసరమని సుప్రీం అభిప్రాయపడటం ఓ మంచి పరిణామం. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన సంస్కరణలపై లోక్‌సభలో చట్టం చేయాలని సుప్రీం ఆదేశించింది. పార్లమెంటులో చట్టం చేసేదాకా ఈ కమిటీనే కొనసాగుతుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేయటంతో ఎన్నికల కమిషన్‌ ఒత్తిళ్లనుంచి బయటపడబోతోంది.