ఇండియా కూటమి ధీమా

By KTV Telugu On 4 September, 2023
image

KTV TELUGU :-

ముంబయ్ భేటీతో విపక్షాల కూటమిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ  ఎన్డీయే కూటమికి వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదని ఇండియా కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. తమ విజయాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోడానికి ఇండియా కూటమి సిద్దంగా ఉందని వారంటున్నారు. తమని రాజకీయంగా బలపడనీయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న బిజెపి కుట్ర  ఎన్డీయే కూటమినే దెబ్బతీస్తుందని ఇండియా కూటమి అంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ పని అయిపోయిందని..మూడో సారి ప్రధాని అయ్యే అవకాశాలు అస్సలు లేవని వారంటున్నారు. విపక్షాల మధ్య చీలికలు తీసుకురావాలన్న  బిజెపి కుట్రలు కూడా వర్కవుట్ కావంటున్నారు వారు.

కాంగ్రెస్ సారధ్యంలో 26కి పైగా  పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే.  ఎన్డీయేని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానీయకుండా నిలువరించడమే అజెండాగా ఇండియా కూటమి రోజు రోజుకీ బలపడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే  ఇండియా కూటమిలో చీలిక ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తో పాటు ఉత్తర ప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని  సమాజ్ వాది పార్టీలు త్వరలోనే ఇండియా కూటమికి గుడ్ బై చెప్పడం ఖాయమంటూ బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి రెండు సమస్యలు ఉన్నప్పటికీ ఇండియా కూటమి నుండి కేజ్రీవాల్ వీడే పరిస్థితులు అయితే  లేవంటున్నారు.

ఇండియా కూటమి లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు భాగస్వామ్య పక్షాల మధ్య అపనమ్మకాలు సృష్టించడమే  బిజెపి లక్ష్యంగా కనిపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాల మధ్య గందరగోళాన్ని సృష్టించే ఆలోచనలో భాగంగానే బిజెపి ఇండియా కూటమిపై రక రకాల ప్రచారాలు చేస్తోందని విపక్షనేతలు అంటున్నారు. ఇలా చేయడంతో పాటు ముందస్తు ఎన్నికలతో  విపక్షాలను కకావికలం చేయాలన్నది బిజెపి కుట్రగా కనిపిస్తోందంటున్నారు ఇండియా నేతలు. అయితే బిజెపి   చేసే చిల్లర ట్రిక్కులకు తాము లొంగేదీ లేదు..భయపడేదీ లేదు అని విపక్షాలు అంటున్నాయి. బిజెపి తమని చూసి బెదురుతోందని అనుమానిస్తోన్న ఇండియా కూటమి అదే తమకి శుభ సంకేతంగా భావిస్తోందంటున్నారు విశ్లేషకులు.

రెండు రోజుల ఇండియా కూటమి సమావేశాల అనంతరం నేతలంతా హుషారుగా  కనిపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే  60శాతం భారత దేశం ఇండియా కూటమిలోనే ఉందని అన్నారు. తమని ఓడించడం ఎన్డీయే వల్ల కానే కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎన్డీయే ని ఇంటికి పంపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో  ఉన్న పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు రాహుల్ గాంధీ. భారత్ జుడేగా ఇండియా జీతేగా అన్న నినాదంతో దూసుకుపోతామన్నారు రాహుల్

ఇండియా కూటమిలో ఉన్నది కేవలం 28 పార్టీలు కాదు..140 కోట్ల మంది ప్రజలు అన్నారు  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశాన్ని అవినీతి ఊబిలోకి  నెట్టేసిన ఘనత నరేంద్రమోదీదే అన్నారు కేజ్రీవాల్. తాము దేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్నామన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం కోసం సెప్టెంబరు 18 నుండి 22 వరకు అయిదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండి పడ్డారు. కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసినపుడు కానీ..పెద్ద నోట్ల రద్దు సామాన్యుల జీవితాలు దుర్భరం చేసిన సంక్షోభ సమయంలో కానీ చైనా దురాక్రమణతో సరిహద్దుల్లో ఉత్కంఠ నెలకొన్న తరుణంలోనూ  ప్రత్యేకంగా పార్లమెంట్ ను సమావేశ పర్చని మోదీ ప్రభుత్వం తమ రాజకీయ అజెండా కోసం ప్రత్యేక సమావేశాలు పెడుతోందని ఖర్గే దుయ్యబట్టారు.

ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు ఇండియా కూటమి నేతలు. 14 మంది నేతలతో  ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది ఇండియా కూటమి. ఇందులో డిఎంకే అధినేత స్టాలిన్ తో పాటు  ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తదితరులు ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలని కూటమి భేటీలో నిర్ణయించారు. సెప్టెంబరు నెలాఖరుకల్లా సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని డిసైడ్ అయ్యారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి