చందమామపై మువ్వన్నెల పతాకం రెప రెప లాడింది. ప్రపంచ దేశాలు అసూయ పడేలా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ -3తో అదర గొట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలకు రోవర్ ను సురక్షితంగా ల్యాండ్ చేసిన మొట్ట మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. చంద్రుడి ఉపరి తలంపై అడుగు పెట్టడం ఒక ఎత్తు అయితే దక్షిణ ధృవంపై అడుగు పెట్టడం సరికొత్త చరిత్ర. ఇంత వరకు ప్రపపంచంలో ఏ దేశమూ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టలేకపోయాయి.
ఈ ఘనతను భారత్ సొంతం చేసుకుంది.
చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్( చంద్రయాన్- త్రీ ల్యాండ్ రోవర్)
చంద్రుడి దక్షిణ ధృవంపై నిర్ణీత సమయానికే క్షేమంగా ల్యాండ్ అయిన విక్రమ్( చంద్రయాన్ త్రీ ల్యాండ్ రోవర్)
చంద్రయాన్ విజయంతో ఇస్రో సైంటిస్టులను అభినందించిన ప్రధాని మోదీ( నరేంద్ర మోదీ)
చంద్రయాన్ త్రీ విజయంతో భారత్ పై ప్రశంసల వర్షం(ఇస్రో లోగోజ భారత జెండా)
చంద్రయాన్-వన్ తోనే చంద్రుడిపై నీటి జాడల ఆనవాళ్లను కనిపెట్టి నాసాను ఆశ్చర్యపర్చిన ఇస్రో చంద్రయాన్ -2 ప్రయోగంలో చివరి నిముషంలో సాంకేతిక లోపంతో సేఫ్ ల్యాండ్ కాలేక క్రాష్ అయ్యింది. అయితే ఆ వైఫల్యంతో భారత శాస్త్ర వేత్తలు కృంగి పోలేదు. కొద్ది సేపు బాధపడ్డా రెట్టించిన కసితో చంద్రయాన్ త్రీకి అప్పుడే రెడీ అయిపోయారు. చంద్రయాన్ టూ లో ల్యాండ్ రోవర్ క్రాష్ అవ్వడానికి కారణాలేంటో సమీక్షించుకున్న ఇస్రో సైంటిస్టులు ఆ లోపాలను చంద్రయాన్ త్రీలో సరిచేసుకుని పకడ్బందీగా దూసుకుపోయారు.
అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ అయిన రష్యా కొద్ది రోజుల క్రితమే చంద్రుడి దక్షిణ ధృవంపైకి లూనాను పంపింది. అయితే అది చంద్రుడిపై ల్యాండ్ కాకుండా క్రాష్ అయిపోయింది. ఇస్రో పరిశోధనలు ఆరంభించిన కొత్తలో ఇదే రష్యా సాయంతో మనం శాటిలైట్ ను ప్రయోగించాం. అటువంటిది రష్యా విఫలమైన చోట మన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ సూపర్ హిట్ కావడం యావత్ భారత దేశం గర్వంతో ఉప్పొంగే ఘన విజయం. అగ్రరాజ్యం అమెరికా సాధించలేకపోయింది. ఆర్ధిక శక్తిగా ఎదిగిన చైనా వల్ల కాలేకపోయింది. యూరప్ దిగ్గజాలు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వల్ల కాలేదు. ఎవ్వరికీ సాధ్యం కాని అద్భుతాన్ని మన ఇస్రో సునాయసంగా సాధించి సత్తా చాటింది. అంతరిక్షంలో భారత ఖ్యాతిని రెప రెప లాడించింది. చంద్రుడిపై భారత జెండా ఎగురుతోందిపుడు.
విక్రమ్ ల్యాండ్ రోవర్ చంద్రుడిపై ల్యాండ్ కావడానికి ముందు 17 నిముషాల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్ త్రీ కోసం అహోరాత్రులూ శ్రమించిన ఇస్రో సైంటిస్టులు ఇతర సిబ్బంది అనుక్షణం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న ప్రపంచ దేశాల ఆస్ట్రోనాట్లు చాలా ఆసక్తిగా దీన్ని టీవీల్లో తిలకించారు. భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచ మంతా వేన్నోళ్ల కీర్తించింది. దేశంలోనూ కోట్లాది మంది ఇస్రో సాధించిన విజయానికి పులకించిపోయారు. సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు.
దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్ లో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచే చంద్రయాన్ – 3 ల్యాండింగ్ ను వీక్షించి ఆ వెంటనే ఇస్రో సైంటిస్టులను మనసారా అభినందించారు. భారతీయులంతా గర్వించ దగ్గ విజయమని మోదీ కొనియాడారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ మరింత దూకుడుగా ముందుకు పోతుందని మరిన్ని ప్రయోగాయలతో కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తారని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రపంచం మొత్తం ఇపుడు భారత్ వైపు చూస్తోందన్నారు మోదీ.
విక్రమ్ ల్యాండ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. అక్కడి మట్టిలో గడ్డకట్టుకుపోయిన నీటి ఆనవాళ్లు ఉన్నాయా అన్నది చంద్రయాన్ త్రీ కనిపెడుతుంది. 14 రోజుల తర్వాత ఇక విక్రమ్ పనిచేయదు. దానికి కారణం లేకపోలేదు. చంద్రుడిపై 14 రోజులు రాత్రి ఉంటే 14 రోజులు పగలు ఉంటుంది. పగటి పూట మాత్రమే రోవర్ లోని పరికరాలు పనిచేస్తాయి. రాత్రి వేళ దక్షిణ ధృవంపై మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే పగటి పూట ఆరంభమయ్యే సమయానికే విక్రమ్ ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఇక ల్యాండ్ అయిన విక్రమ్ ఇప్పటికే ఫోటోలు తీసి పంపడం మొదలు పెట్టింది. రానున్న రోజుల్లో అంతరిక్షంలో భారత ఆవిష్కరణలు ప్రపంచం మొత్తానికి ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయంటున్నారు సైంటిస్టులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…