సార్వత్రిక ఎన్నికలు వందరోజులు కూడా లేని తరుణంలో కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమిలో నైరాశ్యం అలుముకుంటే..బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రాముణ్ని తలుచుకుని హుషారుగా ఉంది వచ్చేఎన్నికల్లో రాముడే తమకి హ్యాట్రిక్ విజయం ప్రసాదిస్తాడని అయోధ్య లో రామమందిరం నిర్మించి పెట్టినందుకు రాముడు బిజెపి రుణం తీర్చుకుంటాడని కమల నాథులు ధీమాగా ఉన్నారు. దీనికి భిన్నంగా ఇండియా కూటమిలోకాంగ్రెస్ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ ఇప్పటికే మమతా బెనర్జీ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీలు వచ్చే ఎన్నికల్లో బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చేశాయి. ఇది ఇండియా కూటమికి కోలుకోలేని షాకే అంటున్నారు రాజకీయ పండితులు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర వివిధ రాష్ట్రాల మీదుగా సాగుతోంది. అయితే బెంగాల్ లో యాత్ర అడుగుపెట్టినపుడు బెంగాల్ లో ఇండియా కూటమి భాగస్వామి పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మమతా బెనర్జీ చాలా కోపంగా ఉన్నారు. మిత్ర పక్షాలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె మండిపడుతున్నారు.
అంతే కాదు 42 లోక్ సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు మాత్రమే ఇస్తామని మమతా బెనర్జీ అంటున్నారట. కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం పది స్థానాలు ఇవ్వాలని కోరుతోంది. అయితే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు వరుసగా నాలుగు…రెండు మాత్రమే. ఆ బలాన్ని దృష్టిలో పెట్టుకునేకాంగ్రెస్ కు రెండు సీట్లే ఎక్కువని మమతా బెనర్జీ భావిస్తున్నట్లుందంటున్నారు.
మమతా బెనర్జీ ఇలా సీరియస్ అయిన మర్నాడే ఆమ్ఆద్మీ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు.పంజాబ్ లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని ఆయన తేల్చిపారేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందన్నారు. ఈ రెండు ప్రకటనల తర్వాత కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. ప్రత్యేకించి మమతా బెనర్జీ అల్టిమేటం కాంగ్రెస్ లో కంగారు పుట్టించింది. ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ చాలా కీలక భాగస్వామి అన్న కాంగ్రెస్ నాయకత్వం మమతా బెనర్జీ తమకి అత్యంత విలువైన మిత్రులు అన్నారు. మమతా ను కూల్ చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఈ రెండు తలనొప్పులతోనే కాంగ్రెస్ పార్టీ చికాకు పడుతూ ఉంటే ఇవి చాలవన్నట్లు మరో ప్రచారం కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. ఇండియా కూటమికి కన్వీనర్ గా ఉంటారనుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ త్వరలోనే ఇండియా కూటమికి గుడ్ బై చెబుతారని ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. ఆయన తిరిగి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలున్నాయంటున్నారు.నితిష్ కుమార్ కూడా ఇండియా కూటమిని వీడితే అది కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బే. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రాలేకపోతే ఆ పార్టీ మనుగడ చాలాకష్టం. మరో అయిదేళ్ల పాటు పార్టీని బతికించుకోవడం నాయకత్వానికి సాధ్యం కాకపోవచ్చునంటున్నారు
2020లో ఎన్డీయేలో అడుగు పెట్టిన నితిష్ కుమార్ రెండేళ్లు కాగానే ఎన్డీయేకి గుడ్ బై చెప్పి ఆర్జేడీ తో జత కట్టారు. ఎన్డీయేలో చేరినపుడు సిఎంగా ఉన్న ఆయన ఆర్జేడీతో జట్టు కట్టిన తర్వాత కూడా సిఎంగానే ఉన్నారు. ఆ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేని గద్దె దింపాలన్న కాంగ్రెస్ ,ఇతర విపక్షాల పిలుపు మేరకు ఇండియా కూటమిలో చేరారు. కొద్ది నెలల పాటు యాక్టివ్ గా పనిచేశారు కూడా. కానీ తాజాగా ఆయన ఇండియా కూటమితో ముందుకు సాగితేరాజకీయంగా లాభం ఉండదని భావించినట్లు తెలుస్తోంది. ఏ ఎన్నిక అయినా సరే గెలిచే అవకాశాలు ఉన్న వారితోనే చేతులు కలపడం నితిష్ ప్రత్యేకత. దీన్ని ఆయన మార్క్ చాణక్యంగా కొందరు పొగిడితే..ఆయన అవకాశ వాద రాజకీయానికి ఇవే నిదర్శనాలని ప్రత్యర్ధులు అంటారు.
తాజాగా మరోసారి ఎన్డీయే కూటమిలో చేరాలని నితిష్ ఆలోచన చేస్తూ ఉండడానికి కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలరాముని విగ్రహానికి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయడంతోనే యావద్దేశం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయింది. బిజెపి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందునుంచి ఇంటింటికీ అక్షింతలు పంచి పెడుతూ రామమందిరాన్ని చూడాలని ఆహ్వానిస్తూ వచ్చింది.మూడు దశాబ్ధాల క్రితం రామజన్మభూమిలో రామమందిరనిర్మాణం చేస్తామన్న హామీతో రాజకీయాల్లో ఎదిగిన బిజెపి మొత్తానికి రామమందిరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసింది. ఈ విజయంతో మెజారిటీ హిందువులు రామ భక్తులు వచ్చే ఎన్నికల్లో బిజెపినే గెలిపిస్తారని కమలనాథులు చాలా ధీమాగా ఉన్నారు. నితిష్ కూడా దీన్నే నమ్ముతున్నారు. అందుకే ఆయన బిజెపి ని మరోసారి ప్రేమిద్దామని డిసైడ్ అయినట్లు పాట్నా కాకులు అదే పనిగా కూస్తున్నాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…