ఏమైపోయావ్ నోటూ రూ.2000 క‌నిపించ‌దేం

By KTV Telugu On 22 March, 2023
image

ఒక‌ప్పుడు ఏటీఎంలో కార్డు పెట్ట‌గానే గులాబీరంగు నోటు చేతికొచ్చేది. కానీ ఇప్పుడు ఎన్ని వేలు డ్రాచేసినా 2వేల నోటు మాత్రం ఎక్క‌డా త‌గ‌ల‌డంలేదు. ఒక్క‌సారిగా మంత్రం వేసిన‌ట్లు మార్కెట్‌లో మాయ‌మైపోయాయి పెద్ద‌నోట్లు. ఎక్క‌డో చోట ఏదో రూపంలో చ‌లామ‌ణిలో ఉండాల్సిన నోట్లు ఏమై పోయాయ‌న్న‌ది పెద్ద ప‌జిల్‌. వెయ్యి రూపాయ‌ల నోట్లు ర‌ద్దుచేసి దానికి రెట్టింపు విలువున్న నోటును తెర‌పైకి తేవ‌డంపైనే విమ‌ర్శ‌లొచ్చాయి. ఇప్పుడా నోట్లు చ‌లామ‌ణిలో లేక‌పోవ‌టంతో బ‌డాబాబుల డంప్‌ల్లో దాక్కున్నాయ‌న్న అనుమానాలొస్తున్నాయి.

బ్యాంకులు 2వేల నోట్ల‌ను ఏటీఎంల‌లో పెట్ట‌క చాలా రోజులైంది. దీంతో ప్ర‌జ‌ల్లో ఉన్న అనుమానాల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు పెట్ట‌టం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్ట‌మంటున్నారు కేంద్ర ఆర్థిక‌మంత్రి 2వేల నోట్ల‌పై బ్యాంకుల‌కు కేంద్ర‌ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని పార్ల‌మెంట్‌లో నిర్మలా సీతారామన్ ప్ర‌క‌టించారు. ఆర్బీఐ నివేదికల ప్రకారం 2017 మార్చి చివరి నాటికి రూ.500, రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.9.512 లక్షల కోట్లు. 2022 మార్చి చివరి నాటికి వీటి విలువ‌ రూ.27.057 లక్షల కోట్లు. మ‌రి ఇంత న‌గ‌దు చ‌లామ‌ణి అవుతున్నా 2వేల నోట్లు ఎక్క‌డ‌న్న ప్ర‌శ్న‌కు మాత్రం కేంద్రంనుంచి స్ప‌ష్ట‌మైన స‌మాధానం లేదు.

రిజ‌ర్వుబ్యాంక్ కొత్త‌గా రూ.2వేల నోట్ల‌ను ముద్రించ‌డం లేదు. కొన్నేళ్లుగా ఒక్క రూ.2000 నోటును కూడా ప్రింట్ చేయలేదు. 2019లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ ఆపేసినట్టు ఆర్‌బీఐ స్వ‌యంగా తెలిపింది. ఏటీఎంలలో పెద్ద నోట్లు రాక‌పోవ‌డానికి ఇదే ప్ర‌ధాన కార‌ణంగా భావిస్తున్నారు. కొత్త నోట్ల ముద్ర‌ణ లేక‌పోవ‌చ్చుగానీ అప్ప‌టికే భారీగా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు ఏమయ్యాయన్నదే ప్ర‌శ్న‌. బ్లాక్‌ మ‌నీని బ‌య‌టికి తీసేందుకు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. తర్వాత 2016 నవంబరు 8న కొత్తగా రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టింది. వాటిని నిదానంగా చ‌లామ‌ణి నుంచి తొల‌గిస్తామ‌ని చెప్పింది. అందులోభాగంగానే బ్యాంకులు కూడా ఆ నోట్ల‌ను తెర‌మ‌రుగు చేస్తున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.