వచ్చే ఎన్నికల్లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండాయేనా

By KTV Telugu On 16 May, 2023
image

కర్నాటక ఎన్నికల విజయంతో ఇక రానున్న కాలమంతా కాంగ్రెస్ దేనా. వచ్చే ఎన్నికల్లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండాయేనా. కాంగ్రెస్ వ్యూహకర్తలయితే అటువంటి ధీమాతోనే ఉన్నారు. అయితే అటువంటి ఆలోచనలు ఏ మాత్రం మంచివి కావంటున్నారు రాజకీయ పండితులు. ఓ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో విజయాలు సాధించే పరిస్థితే ఉండదంటున్నారు వారు. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో స్థానిక అంశాలే కీలక పాత్ర పోషిస్తాయని అవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయని అంటున్నారు. వీటికీ 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకూ సంబంధం ఉండదని వారు సూచిస్తున్నారు. ఇక వచ్చే అన్ని ఎన్నికల్లోనూ తమదే విజయమన్న ధీమాతో ఉన్నారు వారు.

కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద విజయం సాధించి చాలా కాలమైంది. ఆ మధ్య హిమాచల ప్రదేశ్ లో విజయం సాధించినా అది పెద్ద చెప్పుకోదగ్గ విజయం అయితే కాదు. కేవలం రెండు మూడు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో అయినా అధికారంలోకి రావాలంటే ఈ ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటాలి. ఆ నేపథ్యంలో వచ్చిన కర్నాటక ఎన్నికలకు అందుకే హస్తం పార్టీకి కీలకం అయ్యాయి. ఆ ఎన్నికల పరీక్షలో కాంగ్రెస్ మంచి మార్కులే సంపాదించుకుని పరువు కాపాడుకుంది. అంతే కాదు భవిష్య ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా మూటగట్టుకుంది.ఈ విజయం కాంగ్రెస్ ఆత్మస్థైర్యం లెవెల్స్ ని అమాంతం పెంచేసింది. కొండనైనా పిండిచేసేయగలం అన్న ధీమానీ ఇచ్చింది. పార్టీ శ్రేణులు ఎంతగా ఊగిపోతున్నాయంటే 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏ ఎన్నిక వచ్చినా సరే విజయం మాదే అన్నంత నమ్మకంగా కనిపిస్తున్నారు హస్తం నేతలు.

ఒక వేళ కర్నాటకలో కాంగ్రెస్ ఓడిపోయి బిజెపి గెలిచి ఉంటే దాని ప్రభావం ఆపార్టీ నైతిక స్థైర్యంపై దారుణంగా ఉండేది. ఎన్నిక అంటేనే భయపడిపోయేంతగా ఉండేది. ఒక్క విజయం చాలా చాలా అవసరం అని తపిస్తోన్న వేళ వచ్చిన అరుదైన అద్భుతమైన విజయం ఇది. ఈ విజయంలో కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహాలూ వర్కవుట్ అయ్యాయి. స్థానిక నాయకత్వం కష్టమూ ఫలించింది. అందరూ కలిసి పార్టీ విజయం కోసం అహోరాత్రులూ పడ్డ శ్రమ అధికారాన్ని ఇచ్చింది. ఇక ఇదే ఊపుతో ఈ ఏడాది చివర్లో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ సత్తా చాటేస్తామని కాంగ్రెస్ అనుకుంటోంది. అయితే కాంగ్రెస్  కార్యకర్తల సంబరాలు నాయకత్వం ధీమా నిశితంగా గమనిస్తోన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్క కర్నాటకలో గెలిచినంత మాత్రాన మొత్తం ప్రపంచాన్ని జయించేశామని అనుకుంటున్నారా అని సెటైర్ వేసింది. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికలపై ఏ విధంగానూ ఉండబోదని కమలనాథులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎగరబోయేది కాషాయం జెండాయేనని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ గెలుపును కాంగ్రెస్ అడ్డుకునే ప్రసక్తే ఉండదని వారంటున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం ఇదే మాట చెబుతున్నారు. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలను పట్టుకుని కాంగ్రెస్ పార్టీ మరీ అంతగా ధీమా పెంచేసుకోవలసి అవసరం లేదని వారంటున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ సాధించింది కచ్చితంగా ఘన విజయమే. అయితే అది కర్నాటకకు పరిమితమైన అంశాలపై ఆధారపడి వచ్చిన ఫలితమది అని రాజకీయ పండితులు అంటున్నారు. ఆ విజయాన్ని చూసి కాంగ్రెస్ నాయకత్వం ఆనందిస్తే తప్పు లేదు కానీ అదే ఫలితం అన్ని ఎన్నికల్లోనూ వస్తుందని నమ్మకం పెట్టుకుని కూర్చుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
కర్నాటకలో నాలుగేళ్ల బిజెపి పాలన పట్ల ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. బిజెపి పాలనలోని అవినీతి పట్ల మండిపోయి ఉన్నారు.

గత ఎన్నికల్లో బిజెపికి పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా జేడీఎస్-కాంగ్రెస్ ల నుండి ఎమ్మెల్యేలకు గేలం వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న కోపమూ కన్నడ ఓటర్లలో ఉండిపోయింది. ఈ కారణాలే ప్రస్తత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయని వారు అంచనా వేస్తున్నారు. ఇవే పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో ఉండవని వారంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఆధారం చేసుకుని 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంటే మాత్రం అది భ్రమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్నాటకలో సాధించిన విజయంతో మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణాలో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లోనూ విజయం ఖాయమని కాంగ్రెస్ నేతలు హుషారుగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణా, మణిపూర్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆ తర్వాత 2024లో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఏపీ ఎన్నికలు అటు కాంగ్రెస్ కీ ఇటు బిజెపికి అంత కీలకం కావు. ఎందుకంటే ఏపీలో ఆ రెండు పార్టీలకూ ఉనికే లేదు. తెలంగాణాపై మాత్రం కాంగ్రెస్ బిజెపిలు రెండూ ఆశలు పెట్టుకున్నాయి. బిజెపికి తెలంగాణా చాలా కీలకం. ఎందుకంటే 2024లో ఉత్తరాది ప్రాంతంలో ఎంపీ సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని కమలనాథులు భావిస్తున్నారు. వాటిని దక్షిణాదిలో కొంత మేరకైనా భర్తీ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే కర్నాటక, తెలంగాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు బిజెపి వ్యూహకర్తలు. మధ్య ప్రదేశ్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే తనని ముఖ్యమంత్రి చేయకపోవడమే కాకుండా తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అలిగిన జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బిజెపిలో చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రస్తుతం అక్కడ బిజెపి పాలన పట్ల వ్యతిరేకత ఉంది. అది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశాలున్నాయి.

గత ఎన్నికల్లో రాజస్థాన్ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత పార్టీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ వర్గాల మధ్య నిత్యం యుద్ధం జరుగుతోంది. ఈ పోరాటమే కాంగ్రెస్ ప్రతిష్ఠను మంటగలుపుతోంది. ఇది వచ్చే ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా పరిణమించే అవకాశాలుండచ్చని అంచనా వేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మెయితీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై నాగా, కుకీ తెగల గిరిజనులు మండి పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ అంశం కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. అయితే కర్నాటక లోనూ సిద్ధరామయ్య-డి.కె.శివకుమార్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అటువంటి నేతల మధ్య సయోధ్య కుదిర్చి ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ మంచి ఫలితాలు రాబట్టగలిగింది. అదే ఫార్ములాను ఎంపీ, రాజస్థాన్, తెలంగాణా రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం 2024లో సార్వత్రిక ఎన్నికలు రెండు పార్టీలకూ చాలా కీలకం. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని బిజెపి పంతంగా ఉంది. బిజెపిని నిలువరించి పదేళ్లుగా దూరంగా ఉన్న అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అయితే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎంపీ స్థానాల్లో పోటీ చేసే పరిస్థితిలో లేదు. బిజెపి మాత్రం కాంగ్రెస్ పోటీ చేయలేని రాష్ట్రాల్లోనూ బరిలో దిగుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్-బిజెపిల్లో ఎవరిని ఎంచుకుంటారన్నది ఇప్పుడే చెప్పలేం. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే లోక్ సభ ఎన్నికల్లో వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. అసెంబ్లీలో ఓ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో మరో పార్టీకి ఓటు వేసే ఉదంతాలు చాలానే ఉన్నాయి.

కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో రాజకీయాలు నడుపుతోన్న బిజెపికి కర్నాటకలో బ్రేక్ పడిందని చెప్పాలి. అయితే ఆ బ్రేక్ కన్నడకే పరిమితం అవుతుందా లేక మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుందా అన్నది రానున్న కాలమే తేల్చాలి. ఏ ఎన్నికల్లో అయినా సరే పాలక పక్షం ఓటమికి చాలా కారణాలుంటాయి. కర్నాటకలోనూ బిజెపి ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ కు కలిసొచ్చాయి. ఒక విధంగా ఇది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో సాధించిన విజయమే తప్ప సొంత ప్రతిష్ఠతో సాధించిన విజయం కానే కాదంటున్నారు రాజకీయ పండితులు. ఆ వాస్తవాన్ని కాంగ్రెస్ నాయకత్వం మర్చిపోకూడదని వారు హితవు పలుకుతున్నారు.