జాతీయ స్థాయిలో విపక్ష కూటమిగా జట్టుకట్టిన ఇండియా కూటమి ఆగస్టు 31న ముంబయ్ లో సమావేశం కానుంది. ఇప్పటికే రెండు దఫాలుగా భేటీ అయిన విపక్ష కూటమి రెండో భేటీలో కూటమి పేరును ఇండియాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ముంబయ్ లో జరగనున్న సమావేశంలో కూటమి లోగోను విడుదల చేస్తారని అంటున్నారు. అదే విధంగా కూటమి తరపున ప్రధాని అభ్యర్ధిని కూడా ముందుగానే ప్రకటించనున్నారు. తాజాగా వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీయే ప్రధాని అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియా కూటమిలో ప్రస్తుతం కాంగ్రస్ సహా 26 పార్టీలు ఉన్నాయి. రానున్న కాలంలో మరికొన్ని పార్టీలు కూటమిలో చేరే అవకాశం ఉందంటున్నారు విపక్ష నేతలు. ప్రత్యేకించి ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషిస్తోన్న ఒక ప్రాంతీయ పార్టీ త్వరలోనే ఇండియా కూటమిలోకి వచ్చేస్తుందని అంటున్నారు. ఆ పార్టీ ఏంటా అని చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయేని ఇంటికి సాగనంపుతామని ఇండియా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముంబయ్ సమావేశానికి అందరూ సమాయత్తం అవుతోన్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఓ బాంబు పేల్చారు. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆమె అనుమానిస్తున్నారు. వచ్చే డిసెంబరులోనే లోక్ సభకు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని మమతా బెనర్జీ అభిప్రాయ పడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రంలోని బిజెపి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోందని అందులో భాగంగానే ఎన్నికల ప్రచారం కోసం దేశంలోని హెలికాప్టర్లు అన్నింటినీ బిజెపీయే ముందస్తుగా బుక్ చేసి పెట్టుకుందని మమతా బెనర్జీ అంటున్నారు.
ముంబయ్ లో జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో ముందస్తు ఎన్నికల అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ముందస్తు ఎన్నికల వార్త నిజమే అయితే డిసెంబరులో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. డిసెంబరులో తెలంగాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి వచ్చే అక్టోబరులో ఎన్నికల నగారా మోగనుందని అంటున్నారు. డిసెంబరులోనే లోక్ సభ ఎన్నికలు కూడా జరపాల్సి వస్తే అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారాతోపాటే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావల్సి ఉంటుంది. అయితే మమతా చెబుతున్నదాంట్లో ఎంత నిజం ఉందన్నది తేలాలి.
ఒక వేళ ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే లోక్ సభకు ఎన్నికలు జరపాలని డిసైడ్ అయితే.. లోక్ సభ ఎన్నికలతో పాటు జరగాల్సి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కూడా డిసెంబరుకు తీసుకు వస్తారా? అన్నది ప్రశ్న. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా నెలల క్రితం నుంచే ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ బిజెపికి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ వస్తున్నారు. దానికోసమే ఆయన వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. మరో వైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పదే పదే తమ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించేటపుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోడానికి అందరూ సిద్దంగా ఉండాలని అంటూ వస్తున్నారు. ఏదో ఒక విశ్వసనీయ సమాచారం లేనిదే టిడిపి,జనసేనలు ఇటువంటి ముందస్తు ప్రకటనలు చేయవు కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇండియా కూటమి నేతలు కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలనే చెబుతున్నాయి. ముంబయ్ లో జరగనున్న సమావేశంలో అలయెన్స్ లోగోతో పాటు కూటమి కన్వీనర్.. సీట్ల సర్దుబాటు గురించిన అంశాలు కూడా కొలిక్కి వస్తాయంటున్నారు. కూటమి మొదటి భేటీతో పోలిస్తే మూడో భేటీ సమయానికి కాంగ్రెస్ పార్టీ పట్ల విపక్షాల్లో నమ్మకం గౌరవం రెండూ కూడా బాగా పెరిగాయంటున్నారు రాజకీయ పండితులు. ఒకప్పుడు కాంగ్రెస్ ను తీసిపారేసిన నేతలు సైతం ఇపుడు కాంగ్రెస్ ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదనే స్థాయికి కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…