అప్పులు.. అప్పులు.. అప్పులు ఇటీవలి కాలంలో ప్రభుత్వాల స్థాయిలో ఎక్కువగా వినిపిస్తున్నమాట. రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం అంటోంది. కానీ కేంద్రం మాటేమిటని రాష్ట్రాలు అంటున్నాయి. మొత్తంగా మేము పరిమితిలోనే అప్పులు చేశామని అటు రాష్ట్రాలు కానీ ఇటు కేంద్రం కానీ చెప్పడం లేదు. ప్రభుత్వాలు ఏవైనా ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నాయన్నది నిజం. కానీ ఇది మీతి మీరితే ఏమవుతుందో మొన్న శ్రీలంక ఇప్పుడు పాకిస్థాన్ కళ్ల ముందే కనిపిస్తున్నాయి. రాజకీయం అధికారం తప్ప ఏదీ ప్రాధాన్యతగా తీసుకోని రాజకీయ పార్టీలు దేశాన్ని రుణ ట్రాప్‌లోకి నెట్టేస్తున్నాయా కనీస బాధ్యతగా కూడా ఆలోచించడం లేదా.
2021-22లో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.14,86,618 కోట్లు. తాజాగా సమర్పించిన బడ్జెట్‌లో ఈ ఏడాది రూ.16.85 లక్షల కోట్ల అప్పు చేస్తామని తెలిపిది. దీంతో పదేళ్లలో చేసిన అప్పు రూ.112 లక్షల కోట్లకు చేరుతుంది. ఈ మొత్తం కాకుండా కేంద్రం గ్యారంటీలు ఇచ్చిన మరో ఐదు లక్షల కోట్ల అప్పు అదనం. మోదీ పాలనలోని మొదటి సంవత్సరం 2014-15లో రూ.5.73 లక్షల కోట్ల అప్పు చేస్తే 2021-22 నాటికి ఏటా చేసే అప్పు మూడు రెట్లు పెరిగింది. నాడు ఏటా రూ.4.02 లక్షల కోట్ల వడ్డీలు కడితే 2021-22 నాటికి వడ్డీ భారం రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ఏకంగా దానికి మూడు రెట్ల వడ్డీ కట్టనున్నట్టు కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలిపింది.
ఇక రాష్ట్రాల అప్పుల సంగతి చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అధికారం నిలబెట్టుకోవడం కోసం సంక్షేమం పేరుతో ప్రజలకు అప్పులుచేసి పంపిణీ చేస్తున్నారు. ఫలితంగా రుణభారం పెరిగిపోతోంది. తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు రూ.4.33 లక్షల కోట్లకు చేరాయి. ఏపీ ప్రభుత్వ అప్పు అయితే ఏకంగా పది లక్షల కోట్లకు చేరిందన్న వార్తలొస్తున్నాయి. 2021-22లో అత్యధిక అప్పులున్న పెద్ద రాష్ట్రాల జాబితాలో పంజాబ్ మొదటిస్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలు పూర్తిగా రుణ ట్రాప్‌లో పడిపోయాయని కేంద్రం ఆర్బీఐ తరచూ ఆందోళన వ్యకతం చేస్తూ ఉంటాయి. ఒక్క తెలంగాణ 2021-22లో ఏకంగా రూ.27 వేల కోట్ల వడ్డీ కట్టింది. అంటే చేస్తున్న అప్పుల్లో సగానికిపైగా వడ్డీలు కట్టడానికేనన్నమాట.
కేంద్రమైనా రాష్ట్రమైనా అప్పులు చేయాలంటే ఎఫ్ఆర్‌బీఎం నిబంధనలు పాటించాలి. కానీ ప్రభుత్వాలు అప్పుల కోసం ఎన్నో అడ్డగోలు మార్గాలను వెదుక్కుంటున్నాయి. కేంద్రం కూడా అదే పని చేస్తూండటంతో రాష్ట్రాలను నిలదీయలేకపోతోంది. ఫలితంగా ఆదాయం కన్నా అప్పులు ఎక్కుగా ఉన్న రాష్ట్రాలు పెరిగిపోతున్నాయి. పంజాబ్‌లో జీఎస్డీపీతో పోల్చితే ఏకంగా 48.4 శాతం అప్పులు ఉన్నాయి. రాజస్థాన్‌లో 38.3 శా ఉత్తరప్రదేశ్‌లో 34.5 శాతం ఉన్నాయి. ఇంత శాతం ఉండటం ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఓ ఇరవై లక్షలు అప్పు తీసుకుని ఇల్లు కొనడం అప్పే ఇరవై లక్షలు తీసుకుని భారీగా వేడుక చేసుకోవడం కూడా అప్పే. కానీ ఇల్లు కొనడం వేరు వేడుక చేసుకోవడం వేరు. ఇల్లు అమ్మితే ఆ అప్పు తీరిపోతుంది. ఇంకా విలువ పెరగవచ్చు. కానీ వేడుక చేసుకుంటే మొత్తం కరిగిపోతుంది. అప్పు చేసినప్పుడు ప్రభుత్వాలు ఈ ప్రాథమిక సూత్రం పాటించాలి. కానీ పాటించడం లేదు. అప్పులు చేసి పథకాల పేరుతో పంచుతున్నారు. దీంతో అదంతా అనుత్పాదక వ్యయం అవుతోంది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయం పెరగడం లేదు. అప్పుల భారం పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్రాలు దేశం అప్పుల ఊబిలోకి దిగిపోతున్నాయి.
అప్పులు చేసి అటు అభివృద్ధి చేయలేక ఇటు వడ్డీల భారం మోయలేక దినదిన గండంగా పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. రాజకీయం చేయవచ్చు కానీ రాష్ట్ర, దేశ భవిష్యత్ ను తాకట్టు పెట్టేసి చేయకూడదు. ఈ విషయంలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఆలోచించాలి. కళ్ల ముందు కనిపిస్తున్న శ్రీలంక, పాకిస్థాన్ వంటి వాటిని చూసి అయినా నేర్చుకోవాలి. అదే వారు చేయగలిగే దేశ సేవ. జైహింద్.. జై భారత్ అనే నినాదాలు చేయడమే దేశభక్తి కాదు దేశాన్ని కాపాడటం తో పాటు రిస్క్‌లోకి నెట్టి వేయకుండా చూడటం కూడా దేశభక్తే. మరి ప్రభుత్వాలు ఆలోచిస్తాయా.