ఐటీ రెయిడ్స్‌.. బీబీసీ డాక్యుమెంట‌రీకి కౌంటరేనా

By KTV Telugu On 15 February, 2023
image

ఎప్పుడో ఇర‌వైఏళ్ల‌నాటి పుండు. మానిపోయింద‌నుకున్న టైంలో మ‌ళ్లీ కెలికింది బీబీసీ. గుజ‌రాత్ మార‌ణ‌కాండ వెనుక అప్ప‌ట్లో సీఎంగా ఉన్న ప్ర‌ధాని మోడీ ప్ర‌మేయంపై ఓ డాక్యుమెంట‌రీని ప్ర‌సారంచేసింది. బీబీసీ నిర్ణ‌యం వెనుక దురుద్దేశం ఉండొచ్చు. వెనుక ఏ శ‌క్తులో దాన్ని ప్రేరేపించి ఉండొచ్చు. 2002నాటి దారుణ‌ఘ‌ట‌న‌ల వెనుక నిజాలు వెలుగుతీయాల‌నుకోవ‌డం స‌మాధుల్ని త‌వ్వే ప్ర‌య‌త్న‌మే కావ‌చ్చు. కానీ ఆ డాక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసిన బీబీసీపై ఆదాయ‌పుప‌న్నుశాఖ దాడులు మాత్రం దానికి రియాక్ష‌న్‌లాగే క‌నిపిస్తున్నాయి.

దేశంలో కొంత‌కాలంగా త‌మ‌దారికిరానివారిపై ద‌ర్యాప్తుసంస్థ‌ల‌ను కేంద్రం ఉసిగొల్పుతోంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌కు త‌గ్గ‌ట్లే ఐటీ, ఈడీ దాడులు ఉంటున్నాయి. ఇప్పుడు బీబీసీపై ఐటీ రెయిడ్స్ రొటీన్ ప్రాసెస్‌లో భాగ‌మేన‌ని చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌డంలేదు. గోద్రా మార‌ణ‌కాండ వెనుక మోడీ ప్ర‌మేయం ఉందంటూ వివాదాస్ప‌ద డాక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసింది బీబీసీ. దేశంలోని ద‌ర్యాప్తుసంస్థ‌లు చివ‌రికి అత్యున్న‌త‌న్యాయ‌స్థానం కూడా క్లీన్ చిట్ ఇచ్చాక గుజ‌రాత్ మార‌ణ‌కాండ‌ని బీబీసీ త‌వ్వి తీయ‌డాన్ని కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం జీర్ణించుకోలేక‌పోతోంది.

గుజ‌రాత్ అల్లర్లపై న్యాయస్థానాలే ప్ర‌ధానికి క్లీన్‌చిట్ ఇచ్చాక బీబీసీ బుర‌ద‌చ‌ల్ల‌డంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బీబీసీ డాక్యుమెంట‌రీ లింకుల్ని కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. బ్రిట‌న్ కూడా ఈ ప‌రిణామాల‌పై స్పందించినా మీడియా స్వేచ్ఛ‌ను గౌర‌విస్తామంటూ బీబీసీ డాక్యుమెంట‌రీకి ప‌రోక్షంగా మ‌ద్ద‌తివ్వ‌డంతో కేంద్రానికి మ‌రింత కాలింది. ఇదే స‌మ‌యంలో ఐటీ బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాల‌యాల్లో సోదాలు నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. విప‌క్షాలు పాత్రికేయ సంఘాలు ఐటీ దాడుల్ని త‌ప్పుప‌డుతున్నాయి.

బీబీసీ ఆదాయ‌పు పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతోనే ఐటీ స‌ర్వే చేసిందంటోంది కేంద్రం. విచారణకు సహకరిస్తున్నామని సాధ్యమైనంత త్వరగా ఇది పరిష్కారమవుతుందని బీబీసీ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. ఐటీ సోదాలపై బ్రిట‌న్‌ప్ర‌భుత్వం కూడా స్పందించింది. ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఐటీ స‌ర్వేను ఖండించ‌టంతో కేంద్రం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. మీడియాను బెదిరించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ప్ర‌భుత్వానికి సూచించింది. కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌, రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లాంటి విదేశీ సంస్థలూ బీబీసీపై ఐటీ దాడుల్ని తప్పుబట్టాయి. గ‌తంలో నోటీసుల‌కు స్పందించక‌పోవ‌డం వ‌ల్లే ఐటీ రంగంలోకి దిగింద‌ని కేంద్ర చెబుతున్న‌ది నిజ‌మే కావ‌చ్చు. కానీ టైమ్ రాంగ్‌. అందుకే ఇంత రాద్ధాంతం.