ఇండియా కూటమి ముంబయ్ లో కీలకభేటీలో ఉన్న తరుణంలో కేంద్రంలోని బిజెపి చాపకింద నీరులా సరికొత్త వ్యూహానికి పదును పెట్టేసింది.ఇండియా కూటమి కుదురుకునే వీలు లేకుండా లోక్ సభ ఎన్నికలను ముందస్తుకు తీసుకురావడానికి బిజెపి ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. దానికోసమే సెప్టెంబరు 18 నుండి 22 వరకు అయిదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొన్ననే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. తర్వాత శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. ఇపుడు అర్జెంట్ గా ప్రత్యేక సమావేశాలు ఎందుకోసం? అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇది కచ్చితంగా బిజెపి సంధించబోయే బ్రహ్మాస్త్రమే అంటున్నారు రాజకీయ పండితులు.
అయిదు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లో దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకోసం బిల్లు తెస్తారని అంటున్నారు. చాలా కాలంగా బిజెపి నాయకత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న నినాదాన్ని వినిపిస్తూనే ఉంది. దాని ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు..లోక్ సభకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఆలోచన. ఇలా చేయడం వల్ల అభివృద్దిపై దృష్టి సారించడానికి వీలుంటుందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. దాని వల్ల ఏదైనా విధాన నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన వర్షాకాల సమావేశాల్లోనే బిజెపి మంత్రులు పార్లమెంటు సాక్షిగానే మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. దానికి రాజ్యాంగ సవరణ అవసరం అవుంతుందని కూడా అన్నారు. అటువంటిది ఇపుడు హఠాత్తుగా జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్నది ప్రశ్న. రాజకీయ వర్గాల్లో ఇపుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. బిజెపి అసలు వ్యూహం ఏంటన్నది అంతు చిక్కడం లేదంటున్నారు రాజకీయ పండితులు.
వచ్చే ఎన్నికల్లో బిజెపి సారధ్యంలోని ఎన్డీయే కూటమిని అధికారంలోకి రానివ్వకూడదని శపథం చేస్తోన్న విపక్ష కూటమి ని నిశితంగా గమనిస్తోన్న బిజెపికి కొంత భయం అయితే మొదలైంది. విపక్ష కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడంతోనే బిజెపిలో కంగారు మొదలైంది. ఆపేరు పెట్టకూడదంటూ బిజెపి నేతలు కోర్టుకు కూడా ఎక్కారు. రోజు రోజుకీ ఇండియా కూటమి బలపడుతోందన్నది నూటికి నూరుపాళ్లూ నిజం. 2024 ఎన్నికల సమయానికి ఈ కూటమి మరింతగా బలం పుంజుకోవడం ఖాయమని భావిస్తోన్న బిజెపి అగ్రనేతలు దీనికి చెక్ చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం.
విపక్ష కూటమిలో మరి కొన్ని పార్టీలు చేరడానికి అవకాశం ఇవ్వకుండా..కూటమి బలం పుంజుకోడానికి సమయం ఇవ్వకుండా ఎన్నికలు ముందస్తుకు తీసుకు వస్తే ఇండియా కూటమి నిలదొక్కుకోడాని ఛాన్సే ఉండదని బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే జమిలి ఎన్నికల బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్,ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024 లో ఆంధ్ర ప్రదేశ్,అరుణాచల ప్రదేశ్, మహారాష్ట్ర , ఒడిషా,హరియాణా, జార్ఖండ్,సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ అన్ని రాష్ట్రాల ఎన్నికలతో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది ప్రత్యేక సమావేశాల్లో తేలే అవకాశాలున్నాయంటున్నారు.
ఇండియా కూటమి కీలక అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునేందుకు ముంబయ్ లో రెండు రోజుల భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సమయంలోనే జమిలి ఎన్నికల ఊహాగానాన్ని ప్రచారంలో పెట్టడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా ? అని ఆలోచనలు చేస్తున్నారు రాజకీయ పండితులు. జమిలి ఎన్నికలు అసలు సాధ్యమా అన్నది మరో ప్రశ్న. రాజ్యాంగ పరంగా..న్యాయ పరంగా దీనికి సవాళ్లు ఉంటాయంటున్నారు నిపుణులు. జమిలి ఎన్నికల బిల్లుతో పాటు చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కూడా ఓకే చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బిజెపి మాస్టర్ ప్లాన్ తో దూసుకుపోతోందని చెప్పక తప్పదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…