చేజారిన హిమాచ‌ల్‌.. బీజేపీ ఏం చేయ‌బోతోంది?

By KTV Telugu On 10 December, 2022
image

న‌డ్డాపై వేటు త‌ప్ప‌దా? అనురాగ్ కూడా ఔటేనా?

గుజ‌రాత్ గెలుపు మోడీషా ఖాతాలో. గుజ‌రాతే కాదు దేశంలో ఎక్క‌డ క‌మ‌ల‌వికాసం జ‌రిగినా ఆక్రెడిట్ వాళ్లిద్ద‌రికే. ఎందుకంటే మోడ్ర‌న్ బీజేపీకి మోదీ, అమిత్‌షాలే సర్వం. మ‌రి ఎక్క‌డైనా ఓడిపోతే కార‌కులెవ‌రు? ఏ పార్టీలోనైనా దానికోసం బ‌క‌రాలుంటారు. బ‌లైపోతుంటారు. బీజేపీలో ఇప్పుడ‌దే జ‌ర‌గ‌బోతోంది. గుజ‌రాత్‌లో ఏడోసారి తిరుగులేని విజ‌యం ద‌క్కినా త‌మ పార్టీ అధికారంలో ఉన్న మ‌రోరాష్ట్రం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ చేజారిపోవ‌డాన్ని బీజేపీ జీర్ణించుకోలేక‌పోతోంది. హిమాచ‌ల్‌లో ఓట‌మిపై బీజేపీలో పోస్ట్‌మార్టం మొద‌లైంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటమి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తలకు చుట్టుకునేలా ఉంది. మాజీ సీఎం ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ను ప‌క్క‌న‌పెట్టి పార్టీ పరాజయానికి కారణమయ్యార‌ని జేపీ న‌డ్డాపై మోడీషా గుర్రుమంటున్నారు. ధూమ‌ల్‌ అసంతృప్తి పార్టీ కొంపముంచింద‌ని భావిస్తున్నారు. దీంతో జేపీ న‌డ్డా కుర్చీ క‌దులుతోంది. ఎలాగూ 2023 జ‌న‌వ‌రి 20తో న‌డ్డా మూడేళ్ల ప‌దవీకాలం ముగుస్తుంది. మ‌రోఛాన్స్ ఆయ‌న‌కే ఇచ్చి 2024 ఎన్నిక‌ల‌కు సిద్ధంకావాల‌ని బీజేపీ మొద‌ట అనుకుంది. అయితే హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ప‌రాజ‌యంతో లెక్క‌మారిపోయింది. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ఓట‌మితో జేపీ న‌డ్డాకి కౌంట్‌డౌన్ మొద‌లైంది.

హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కి బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే ఆలోచ‌న‌లో మోడీషా ఉన్నారు. ఖ‌ట్ట‌ర్ మోదీకి అత్యంత స‌న్నిహితుడు. ఆ కార‌ణంతోనే ఎనిమిదేళ్లుగా ఆయ‌న సీఎంగా కొన‌సాగుతున్నారు. అయితే ఖ‌ట్ట‌ర్‌తోనే ఎన్నిక‌ల‌కు వెళ్తే హ‌ర్యానాలో ఈసారి న‌ష్టం త‌ప్ప‌ద‌నుకుంటోంది బీజేపీ. అందుకే ఖ‌ట్ట‌ర్‌ని సీఎం బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పిస్తూ అదే స‌మ‌యంలో పార్టీ అధ్య‌క్షపీఠంలో కూర్చోబెట్టాల‌నుకుంటున్నారు. కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ ధూమల్‌ కుమారుడు అనురాగ్‌ ఠాకూర్ కూడా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ఓట‌మికి మూల్యం చెల్లించాల్సి వ‌చ్చేలా ఉంది. అనురాగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హమీర్‌పూర్ ఎంపీ సీటు ప‌రిధిలోని 17 అసెంబ్లీ సీట్ల‌లో బీజేపీ నాలుగేచోట్ల గెలిచింది. దీంతో అనురాగ్‌ఠాకూర్ భ‌విష్య‌త్తుకూడా మోడీషా చేతుల్లో ఉంది.