కెనడా దురహంకారం..భారత్ ఉక్కు సంకల్పం

By KTV Telugu On 23 September, 2023
image

కెనడా దురహంకారం..భారత్ ఉక్కు సంకల్పం

భారత్- కెనడాల మధ్య  అగ్గి రాజుకుంది. కెనడా  ఒకింత  అతి చేస్తోంది. భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడాకు ప్రపంచ దేశాల నుండి మద్దతు రావడం లేదు. అందరూ కూడా భారత్ వైపే ఉన్నారు. ఇది కెనడాను మరింత అసహానినికి గురి చేస్తోంది .కాకపోతే కెనడాలో  ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీసిన ప్రధాని ట్రుడో తమ దేశంలో ఓ ఖలిస్తానీ ఉగ్రవాది హత్య కేసును భారత్ పైకి నెట్టేస్తున్నారు. ఇదే రెండు దేశాల మధ్య దూరాన్ని మరింతగా పెంచింది.

కెనడా. అమెరికా సరిహద్దు దేశం. ఎడ్యుకేషన్‌ నుంచి ఉద్యోగాల దాకా అమెరికా వీసాల కోణంలో సమస్యలు తలెత్తినప్పు డల్లా…కెనడా పేరు గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. అగ్రరాజ్యంలో చదువుకునే, జాబ్‌ చేసే అవకాశం మిస్‌ అయినా…కెనడా ఉందిలే అన్న భరోసా అనేకమందికి కనిపిస్తుంది. ఇంత పాజిటివ్‌ వేవ్స్‌ మధ్య తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న కెనడా…
భారత్‌ వేర్పాటవాద శక్తుల విషయంలో మాత్రం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు జై కొట్టిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో…ఖలిస్తాన్‌ డిమాండ్‌ వినిపించే ఉగ్రమూకలను సంతృప్తి పర్చడానికి భారత్‌తో కయ్యానికి సై అనేస్తున్నాడు. నిజానికి భారత్‌-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దశాబ్దాలుగా సక్రమంగా లేవు. ఈ పరిస్థితిని ట్రూడో మరింత దిగజార్చడానికి తహతహలాడుతున్నాడు.

ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ను మొన్న జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఉదంతంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అక్కడి పార్లమెంటులో ఆరోపించారు. అంతేకాక ఈ విషయంలో భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక అధికారిని ఆ దేశం బహిష్కరించింది. దీనికి ప్రతిచర్యగా మన దేశం కూడా ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌లో పనిచేస్తున్న సీనియర్‌ దౌత్యవేత్తను దేశం విడిచివెళ్లాలని ఆదేశించింది. పనిలో పనిగా ఇరు దేశాలూ తమ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. భారత్‌ వెళ్లే కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తే, కెనడా సందర్శించే భారత్‌ పౌరులపై ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం ఉన్నదని…మన దేశం హెచ్చరించింది. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకోవటం వంటి ఉదంతాలు మనకు పాకిస్తాన్, చైనాలతోనే ఎక్కువ. అయితే కెనడా ప్రధాని తీరుతో ఇప్పుడు దౌత్యపరమైన అంశాల్లో భారత్‌ వర్సెస్‌ కెనడా ఎపిసోడ్‌ స్టార్ట్‌ అయింది.

ఒక్క కెనడాయే కాదు… బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో కూడా ఖలిస్తానీ ఉద్యమకారుల పోకడలు ఆందోళనకరంగానే ఉంటున్నాయి. భారత కార్యాలయాలపై, దేవాలయాలపై దాడులు, మన పౌరులను గాయపరచటం వంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నా యి. హింసాత్మక ఘటనలకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని మన దేశం కోరుతున్నా అక్కడి ప్రభుత్వాల స్పందన అంతంతమాత్రం. ఉద్యమకారులపై చర్యలు తీసు కోవటం మాట అటుంచి ఏకంగా మన ప్రభుత్వంపైనే కెనడా నిందారోపణ లకు దిగింది. మరోవైపు ఈ ఎపిసోడ్‌లో కెనడాకి అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించడం లేదు. అమెరికా, బ్రిటన్‌తో సహా ఎవరూ కెనడాకి సపోర్ట్‌ చేయడం లేదు.

మొదటినుంచీ కెనడా అంతర్గత రాజకీయాలు భారత్‌…కెనడా సంబంధాలను శాసిస్తున్నాయి. కెనడాలో భారతీయుల సంఖ్య దాదాపు 14 లక్షలు. ఇది కెనడా జనాభాలో 3.7 శాతం. అందులో సగం మంది సిక్కులు. కొన్ని నియోజకవర్గాల్లో సిక్కు ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం, వారిపై ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం ఉండటం… కెనడా రాజకీయాల్లో వారి ప్రాబల్యాన్ని పెంచింది. అందుకే కావొచ్చు…పంజాబ్‌లో 90వ దశకంలోనే అంతరించిన ఖలిస్తానీ ఉద్యమం ఇంకా అక్కడ సజీవంగా మనుగడలో ఉంది.

2021 ఎన్నికల్లో ట్రూడో నాయకత్వంలోని లిబరల్‌ పార్టీ మెజారిటీ సాధించలేక సిక్కు నేత జగ్మీత్‌సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమాక్రటిక్‌ పార్టీ  మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచీ ఖలిస్తాన్‌ ఉద్యమకారుల విషయంలో ట్రూడో ప్రభు త్వం మరింత మెతక వైఖరితో వ్యవహరిస్తోంది. జస్టిన్‌ ట్రూడో మాత్రమే కాదు. ఆయన తండ్రి పియరే ట్రూడో హయాంలో కూడా ఖలిస్తాన్‌ అనుకూల వైఖరితోనే వ్యవహరించారు.