కర్ణాటక తెలుగు ఓటర్లను ప్రభావితం చేయగలిగే తెలుగు హీరో ఎవరు

By KTV Telugu On 6 April, 2023
image

 

మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కాంగ్రెస్ బిజెపిలు పట్టుదలగా ఉన్నాయి. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదని రెండు పార్టీల నాయకత్వాలూ కూడా పంతంగా ఉన్నాయి. ఇప్పటికే కన్నడ నాట కీలకమైన లింగాయత్ ఒక్కళిగ సామాజికవర్గాలను ఎలా ఆకట్టుకోవాలో వ్యూహరచనలు చేసుకున్న పార్టీలు ఇపుడు కర్నాటకలో ఉన్న తెలుగు ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలా అని ఆలోచనలు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణా రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటోన్న కర్నాటక రాష్ట్రంలో తెలుగు వారు పెద్ద సంఖ్యలోనే నివసిస్తున్నారు. కోలారు జిల్లాలో అయితే 76 శాతం మంది ప్రజలు తెలుగు వారే కావడం విశేషం. బెంగళూరు గ్రామీణలో 65 శాతం రాయచూరులో 64 శాతం ఉమ్మడి బళ్లారిలో 63 శాతం మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. అంటే ఈ జిల్లాల్లో తెలుగువారిదే పూర్తి ఆధిపత్యం. బెంగళూరు నగరం కొప్పళ చిక్క బళ్లాపుర జిల్లాల్లో అయితే 43 నుండి 49 శాతం మంది తెలుగు వారే ఉంటున్నారు. మొత్తం మీద 40 నియోజకవర్గాల్లో అయితే 40శాతానికి పైగా తెలుగు ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. వ్యవసాయం ఐటీ ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు కర్నాటకు వలస పోయారు. దశాబ్ధాలుగా వారు అక్కడే స్థిరపడిపోయారు. వారి ఆధిపత్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వాల్లోనూ వారికి ప్రాధాన్యత దక్కుతోంది. అక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్లు ఎన్నికల బరిలోనూ దిగుతున్నారు. అయితే పార్టీల పరంగా తెలుగు ప్రజల ఓటర్లను ప్రభావితం చేయడానికి ఏం చేయాలా అని కాంగ్రెస్ బిజెపిలు రెండూ కూడా ఆలోచనలు చేస్తున్నాయి. గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా ఉండే సినీ నటుల చేత కర్నాటక లో ప్రచారం చేయించేది.

మెగాస్టార్ చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చిరంజీవి విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే రాజకీయాలకు చాలా కాలం క్రితమే గుడ్ బై చెప్పిన చిరంజీవి ఇపుడు ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేవు. ఇక చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో కర్నాటక ఎన్నికల ప్రచారంలో మెరిసారు. తనదైన స్టైల్ లో ఉద్వేగ పూరిత ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. 2013లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు ఏపీలో టిడిపి-బిజెపిలతో జట్టు కట్టారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో కర్నాటకలో బిజెపి తరపున లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను నరేంద్ర మోదీ కోరారు. దాంతో పవన్ బిజెపి తరపున కర్నాటకలో ప్రచారం చేశారు. 2018లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదు. ఆ సమయంలో ఆయన టిడిపితో తెగతెంపులు చేసుకుని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టుకట్టారు. ఆ ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. నాలుగేళ్లుగా బిజెపి-జనసేనలు పొత్తులోనే ఉన్నాయి. ఇపుడు మరోసారి కర్నాటకలో బిజెపి తరపున ప్రచారంలో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్ కు బిజెపి అధినేతల నుండి పిలుపు వచ్చిందని సమాచారం. ఉదయ్ పూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ ను ఢిల్లీ లోని బిజెపి అగ్రనేతలు పిలవడంతోనే పవన్ ఢిల్లీ వచ్చారు. బిజెపి అగ్రనేతలు ఒక్కొక్కరినీ కలుస్తున్నారు. కర్నాటకలో బిజెపికి ఎదురుగాలి వీస్తోన్న తరుణంలో కర్నాటకలోకి తెలుగు ప్రజలను తమవైపు ఆకర్షించుకోవాలంటే పవన్ కళ్యాణ్ వంటి జనాకర్షణ శక్తి కలిగిన వారు ప్రచారం చేయాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది.

కర్నాటకలో జూనియర్ ఎన్టీయార్ కు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీయార్ కూడా 2009 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో బిజెపి అగ్రనేతలు జూనియర్ ఎన్టీయార్ తో భేటీ కావడం అప్పట్లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అది రాజకీయ భేటీ కాదని అప్పట్లోనే ప్రచారం జరిగినా బిజెపి నేతలు జూనియర్ తో ఏం మాట్లాడారన్నది మాత్రం బయటకు రాలేదు. మరి జూనియర్ ఎన్టీయార్ కు కూడా ఏమన్నా గేలం వేస్తారా ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఒప్పుకుంటారా అన్నవి తేలాల్సి ఉంది. నిజానికి కర్నాటకలో ఉండే తెలుగు వారిలో సినిమాలకు సంబంధం లేని రాజకీయ నాయకుడొకరికి స్టార్ స్టేటస్సే ఉందంటారు. కర్నాటకలో పెద్ద సంఖ్యలో అనుచరులను కలిగి ఉన్న ఆ నాయకుడే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులోనే ఉంటూ వ్యాపారాలు చేసిన జగన్ మోహన్ రెడ్డికి కర్నాటకలో చాలా పెద్ద క్యాడరే ఉందంటారు. అయితే బిజెపి తరపున నేరుగా జగన్ మోహర్ రెడ్డి కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితులు ఉండవంటున్నారు రాజకీయ పండితులు. కాకపోతే బిజెపి అగ్రనేతలు మరీ బలంగా కోరితే మాత్రం జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా తన అనుచరులచేత బిజెపికి అనుకూలంగా ప్రచారం చేయించే అవకాశాలు ఉండచ్చని అంటున్నారు.

ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కర్నాటకలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు మద్దతుగా టిడిపి అక్కడ ప్రచారం చేసింది కూడా. మరి ఈ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుకే నో అంటోన్న బిజెపి ఎన్నికల ప్రచారం కోసం బాబు సాయాన్ని కోరుతుందా అన్నది ప్రశ్నార్ధకమే. మొత్తం మీద 60కి పైగా నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ బిజెపిలు ఎవరిని రంగంలోకి దింపాలా అని ఆలోచనలు చేస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ మసకబారడంతో ఆ పార్టీ తరపున కర్నాటకలో ప్రచారం చేయడానికి సినీ నటులు కూడా ఎవరూ ముందుకు రాకపోవచ్చు. బిజెపి అయితే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీని అభిమానించే సెలెబ్రిటీలు ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. సినీ దర్శకుడు రాజమౌళి తండ్రికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చిన బిజెపి రాజమౌళి ద్వారా జూనియర్ ఎన్టీయార్ రామ్ చరణ్ లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. కాకపోతే జూనియర్ స్వతహాగానే రాజకీయాల పట్ల అనాసక్తితో ఉండగా రామ్ చరణ్ ప్రచారానికి తండ్రి చిరంజీవి కూడా నో చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుత స్టార్లను పక్కన పెట్టి పాత తరం నటీ నటుల్లో జనాకర్షక శక్తి ఉన్న వారి కోసం జాతీయ పార్టీలు రెండూ అన్వేషణ మొదలు పెట్టాయంటున్నారు. గతంలో బిజెపి లో కొనసాగిన సినీ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివకృష్ణ ఆ మధ్య బిజెపి సభలో మెరిసిన జయప్రద ,మోహన్ బాబు వంటి వారికోసం బిజెపి ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయంటున్నారు. బిజెపి ఎమ్మెల్యేగా పనిచేసిన కోట శ్రీనివాసరావు ఎలానూ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు.