ప‌ర్సెంటేజీల‌నుంచి పెరుగుదాకా.. బీజేపీ గోవిందా

By KTV Telugu On 31 March, 2023
image

కేంద్రంలో హ్యాట్రిక్ కొట్ట‌టంతో పాటు ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డాల‌న్న‌ది క‌మ‌లంపార్టీ ప్ర‌ధాన టార్గెట్‌. సింగిల్ పార్టీగా క‌ర్నాట‌క‌లో మెజారిటీ స్థానాలు రాక‌పోయినా తిమ్మిన‌బ‌మ్మిని చేసి పోయిన్సారి బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. కాంగ్రెస్‌ జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించి కాషాయ‌జెండా ఎగ‌రేసినా జ‌నంలో మాత్రం బ‌లం పెంచుకోలేక‌పోయింది. య‌డ్యూర‌ప్ప‌ని మార్చి బ‌స్వ‌రాజ్ బొమ్మైని కూర్చోబెట్టినా బొమ్మ మాత్రం మార‌లేదు. ప‌ర్సంటేజీల ప్ర‌భుత్వంగా అవినీతి ఆరోప‌ణ‌ల్లో కూరుకుపోయింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కంటే హిజాబ్‌ హ‌లాల్ వంటి భావోద్వేగ అంశాల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని క‌ర్నాట‌క‌ ప్ర‌జ‌లు స్వాగ‌తించ‌లేక‌పోయారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎన్ని పిల్లి మొగ్గ‌లేసినా మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం జ‌ర‌గ‌ని ప‌నంటున్నాయి కొన్నిస‌ర్వేలు.

క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ని ఈసీ ప్ర‌క‌టించింది. రెండేనెల‌ల స‌మ‌యం ఉంది. గెలుపోట‌ముల‌ను శాసించే రెండు ప్ర‌ధాన కులాల‌కు రిజ‌ర్వేష‌న్ ఇచ్చినా బీజేపీ ఎత్తులు మాత్రం పారేలా లేవు. సీఓటర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలు ఏకపక్షంగా ఉండ‌టంతో బీజేపీ కంగుతింది. కాంగ్రెస్ క‌ర్నాట‌క‌లో స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుందంటోంది సీ ఓట‌ర్ స‌ర్వే. బీజేపీ ప్రభుత్వంపై 57 శాతం మంది వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు స‌ర్వే తేల్చింది. సీఎంగా బొమ్మై పనితీరు పేలవంగా ఉందని సర్వేలో పాల్గొన్న 47శాతం మంది అభిప్రాయపడ్డారు. 26.8 శాతం మంది మాత్ర‌మే ఆయ‌న పాల‌న‌కు మార్కులేశారు.

క‌ర్నాట‌క‌లోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో సీ ఓట‌ర్ స‌ర్వే ప్ర‌కారం కాంగ్రెస్‌కు 115-127 సీట్లు వ‌స్తాయి. బీజేపీ కేవ‌లం 68-80 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంది. జేడీఎస్‌కు 23-35 సీట్ల‌తో కింగ్ మేక‌ర్ కావ‌చ్చంటోంది సీఓటర్ సర్వే. బీజేపీ ప్రభుత్వంలో అవినీతితో పాటు నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని సీ ఓట‌రు స‌ర్వేలో వెల్ల‌డైంది. క‌ర్నాట‌క సీఎంగా ఎవ‌రు ఉండాల‌ని కోరుకుంటున్నారంటే 39.1శాతం మంది సిద్ధరామయ్యకు మ‌ద్ద‌తిచ్చారు. బస్వ‌రాజ్‌ బొమ్మైకి 31.1 శాతం మంది సానుకూలంగా స్పందించారు. కుమారస్వామికి 21.4 శాతం మంది ఓటేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే చ‌క్రం తిప్పాల‌నుకుంటున్న క‌ర్నాట‌క పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌కు కేవలం 3.2 శాతం మంది మాత్ర‌మే మ‌ద్ద‌తుగా నిలిచారు.