భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ఖచ్చితంగా కుల సమీకరణాలు. అదే కర్ణాటకలో అయితే మఠాల సమీకరణాలు కూడా. ఈ మఠాలు ఎవరికి మద్దతు పలుకుతాయో వారికే ఎక్కువగా విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా లింగాయత మఠాలు కర్ణాటకలో 1,200కు పైగా ఉన్నాయి. మైసూరులోని సుత్తూరు మఠం 12వ దశాబ్దంలోని బసవేశ్వరుడి సమకాలీనంలో తుమకూరులోని సిద్దగంగ మఠం 15వ దశాబ్దంలో గదగ్ లోని తోంటదార్య మఠం 16వ దశాబ్దంలో స్థాపించారు. ఈ మూడు మఠాలధిపతుల అంతిమ నిర్ణయంతోనే లింగాయత ఓట్లు ఏ పార్టీకి పడతాయో తెలుస్తుంది. అందులో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ మఠాలన్నీ రాజకీయ నేతలతో కిక్కిరిసిపోతూంటాయి. ఈసారి కూడా అంతే.
బెంగళూరు గత కొన్ని వారాలుగా ప్రముఖ రాజకీయ నాయకులు కర్ణాటకలోని ప్రతి మూలలో ఉన్న మఠాలలను సందర్శిస్తున్నారు. మఠాలు సాంప్రదాయకంగా సామాజిక మతపరమైన అంశాల్లో మాత్రే బయట కనిపిస్తాయి. కానీ 1980ల నుండి రాజకీయాల్లో ఈ సంస్థల ప్రమేయం పెరుగిపోయింది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా డికె శివ కుమార్ జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ ఆయన కుమారుడు కుమారస్వామి ఒక్కళిగ సామాజిక వర్గానికి చెందిన వారు. బీజేపీలో సీనియర్ నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి లింగాయత్ సామాజిక వర్గ నాయకుడు యెడియూరప్పకూ పీసీసీ అధ్యక్షుడు శివ కుమార్‌కీ మఠాధిపతులలో మంచి పలుకుబడి ఉంది. మఠాధిపతులు ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకోవడం కర్నాటకలోనే ఉంది. అంతేకాకుండా వారు ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నందున ఆ సంస్థల్లో పని చేసే వారందరి మద్దతు ఆయా పార్టీలకు లభిస్తుంది. సామాజిక వర్గాల పరంగా ఒక్కళిగల మద్దతు జనతాదళ్ (ఎస్) కి ఉంది.రాష్ట్రంలో రాజకీయాలను శాసించే మఠాధిపతుల ప్రాబల్యం పలుకుబడి రాష్ట్రంలో ప్రధానంగా చెలామణి అవుతూండేది. ఇటీవల మరణించిన శివ గంగ పీఠాధిపతి ఆశీస్సులతో జనతాదళ్ (ఎస్) ఎన్నిక ల్లో విజయాలను సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయన అనుచరులు ఎటువైపు ఉన్నారో స్పష్టత రావాల్సి ఉంది.
కర్నాటకలో సామాజికవర్గాల ప్రభావమే కాకుండా ధనప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్ధి కోట్లలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలా ఖర్చు చేయగలిగిన వారికే ఈ రెండు పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే జనతాదళ్(ఎస్) అంత ఎక్కువగా ఖర్చు చేసే పరిస్థితి లేదు. కర్ణాటక రాజకీయ నేతలు డబ్బుకి లెక్క లేకుండా అభ్యర్ధులు ఖర్చు చేయడంలో పోటాపోటీగా వ్యవహరిస్తుంటారు. అందుకే గెలుపొందిన తర్వాత అంతకు అంత సంపాదించడానికి అడ్డదారులు తొక్కు తుంటారు మంత్రుల స్థాయిలో రాజకీయ నాయకులే పంచాయతీరాజ్ ఇరిగేషన్ శాఖల కాంట్రాక్టర్ల నుంచి ఒక్కొక్క పనికి 25 శాతం కమిషన్‌ను తీసుకుంటుంటారు. కమిషన్ ఇవ్వకపోతే బిల్లులు ఆపించేస్తారు. దీంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడులకు లోనైన ఇద్దరు కాంట్రాక్టర్లు ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్నారు. బీజేపీ శాసనసభ్యుడు ఒకరు ఇటీవల వేలాది రూపాయిల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ మాత్రం పట్టించుకోలేదు.
అయితే అధికార పార్టీ పట్టించుకోకపోయినా ఈ సారి కర్ణాటక ఓటర్లలో అవినీతి కూడా కీలకంగా మారింది. ప్రజలు దీనిపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అలాగే అవినీతి మాదిరిగానే పార్టీ ఫిరాయింపులు కర్నాటకలో సర్వసాధారణం. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు చివరివరకూ అదే పార్టీలో కొనసాగకపోవడం కర్నాటకలో సర్వసాధారణం. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ఫిరాయింపుదారులు ఎంతో మంది ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమం కర్నాటకలోనే బీజేపీ ప్రారంభించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జేస్తోంది. ఇది మరీ మితీ మీరిపోయిందన్న అభిప్రాయం ఓటర్లలో ఉంది. ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు.