కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎదురీదుతోంది. ఆ విషయం భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తమ చేతలతో నిరూపించుకుంటున్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తానే కర్ణాటక సీఎం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. గల్లీ లీడర్ మాదిరిగా రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. నిజానికి కర్ణాటకలో మోదీ క్రేజ్ అంతగా ఉందని ఎవరూ అనుకోరు. హిందీ రాష్ట్రాలు, గుజరాత్‌లలో అయితే ఆయన హవా నడుస్తుందేమో దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన మ్యాజిక్ చేస్తారని ఎవరూ అనుకోరు. ఎందుకంటే గత ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మాములుగా అయితే ఓడిపోతుంది అన్న క్లారిటీ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోదీ అక్కడ పెద్దగా ప్రచారం చేయరు. కానీ కర్ణాటకలో మాత్రం దానికి భిన్నంగా ప్రచారం చేస్తున్నారు. అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం కర్ణాటకలో ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడమే కాదు.. దక్షిణాదిన బీజేపీ పూర్తిగా కనుమరుగు అవుతుంది. అందుకే ఆయన తానే సీఎం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఓడిపోయిన తర్వాత ఈ ఓటమికీ ఆయన బాధ్యత తీసుకుంటారా గెలిస్తే ఎలాగూ ఆయనకే వీరతాళ్లు వేస్తారు. అందులో సందేహం లేదు. ఒక వేళ గెలిస్తే ఎవరికి క్రెడిట్.
కర్ణాటకలో బీజేపీకి చాన్స్ లేదని దాదాపుగా సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ సారి కాంగ్రెస్సే వస్తుందని చాలా కాలంగా కర్ణాటకలో ఓ బలమైన ప్రచారం ఉంది. అది అంతకంతకూ బలపడింది. అది సర్వేల్లో స్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో ప్రజలు ఏకపక్ష తీర్పులను ఇస్తున్నారు. ఓ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే పూర్తి స్థాయిలో వారికే మద్దతు తెలుపుతున్నారు. హంగ్ లాంటి వాటికి చాన్సివ్వడం లేదు. కర్ణాటకలో కూడా ఈ సారి హంగ్ వచ్చే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందని అత్యధిక సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా మీడియా మాత్రం చివరి క్షణంలో ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు వెల్లడిస్తున్నారు కానీ అవి అంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. పరిస్థితి బీజేపీకి కూడా అర్థమైపోయింది. పరిపాలన అత్యంత దారుణంగా ఉందని అదే అంశంపై ఎన్నికలకు వెళ్లలేమని తేలిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో భజరంగ్ దళ్ నిషేధం అనే అంశాన్ని ఎత్తుకుని భజన ప్రారంభించారు. హనుమాన్ చాలీసాలు చదివేస్తున్నారు.
భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అంతే భారతీయ జనతా పార్టీకి అంతకు మించిన ఆయుధం లేదన్నట్లుగా ఒక్క సారిగా జూలు విదుల్చుకుంది. అన్ని విషయాలు పక్కన పెట్టేసింది. భజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తారా అని యుద్ధం చేస్తున్నట్లుగా ఎన్నికల్లో ప్రకటనలు ప్రారంభించారు. నిజానికి భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చెప్పడానికి కాంగ్రెస్ కు చాలా కారణాలు ఉన్నాయి. భజరంగ్ దళ్ పేరుతో దాడులు అరాచకాలను అల్లరి మూకలు చేపడుతోంది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. హిజాబ్ వివాదం సమయంలో, ఇతర సమయంలో వారి తీరు వివాదాస్పదం అయింది. అయితే భజరంగ్ దళ్ న నిషేధించడం ఆరెస్సెస్ ను నిషేధించడం అన్నట్లుగా బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. మరో ఉగ్రవాద సంస్థతో ముడిపెట్టి హిందూ సంస్థను అవమానించారని అంటున్నారు. దీన్నే సెంటిమెంట్ గా మార్చేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ప్రచారంలోకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా దిగారు. బీజేపీకి ఇలాంటి వివాదాలతో రాజకీయం చేసి ఓట్లు దండుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కర్ణాటకలో పొలిటికల్ డ్రామా ప్రారంభమయింది. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ బొమ్మై ప్రభుత్వం మళ్లీ రావాలా వద్దా అన్నదానిపైనే ఓటింగ్ జరుగుతుంది. ఎజెండాను ఇప్పుడు మార్చలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీజేపీ పరిపాలన గురించి ఎక్కడా చర్చకు రాకుండా చేసేందుకు మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా మోదీ నామస్మరణే వినిపిస్తోంది. ఆయన రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. బీజేపీ చేసే ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రచారం గురించి చెప్పాల్సిన పని లేదు. టీమ్ మోదీ ఇప్పుడు కర్ణాటకలో అతి పెద్ద రోడ్ షోకు ప్లాన్ చేస్తోంది. శనివారం బెంగళూరు నగరంలోని 17 నియోజకవర్గాల ఓటర్లను ఆకర్షిస్తూ 37 కిలోమీటర్ల రోడ్ షోను ప్రధాని నిర్వహించబోతున్నారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నిర్వహించిన 50 కిలోమీటర్ల రోడ్ షో తర్వాత ఇదే అతి పెద్దది కావచ్చు. ప్రచారానికి రావడం మొదలు పెట్టినప్పటి నుంచి కర్ణాటకలో బీజేపీ అంటే మోదీ పేరు వినిపించేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం మోదీ ఇంత సమయం కేటాయిస్తున్నారంటేనే బీజేపీ కర్ణాటకలో ఎంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందో చెప్పవచ్చని అంటున్నారు.
బీజేపీలో గెలుపుకు ఎప్పుడూ ఓనర్ మోదీనే. ఓటమికి మాత్రం చాలా మంది ఉంటారు. అయితే ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో పలితం ఏదైనా మోదీనే భరించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారాన్ని ఓటింగ్ తీరును మోదీ కేంద్రంగా మార్చేందుకు ఆయన ప్రయత్నం చేయడమే కారణం. ఎన్నికల్లో ఓడిపోతే దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుంది. మోదీ కూడా ఏమీ చేయలేని స్థితికి బీజేపీ చేరిపోయిందన్న భావన వస్తుంది. అలాంటి ఓ సారి ప్రారంభమైతే ఇక నిలుపుకోవడం కష్టం అవుతుంది.