ఎన్నికలు సమీపించే వరకు పార్టీకి వీర విధేయులం అంటారు. అధినాయకత్వం చెప్పిందే తమకి వేదం అంటారు. పార్టీ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అంటారు. అదే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే మాత్రం నాయకత్వంపైనే ఉరిమురిమి పడతారు. తిరుగుబాటు జెండా ఎగరేసి శాపనార్దాలూ పెట్టేస్తారు. అదే రాజకీయంలో ఉన్న మజా అంటారు రాజకీయ విశ్లేషకులు. కర్నాటకలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. మూడుపార్టీలూ ఎవరికి తోచిన రూటులో వారు దూసుకుపోతున్నారు. అధికారం తమదేనని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. పార్టీలు నేతల విన్యాసాలు చూసి ఓటర్లు నవ్వుకుంటున్నారు. ఎన్నికల ఘట్టంలో అన్నింటికన్నా కీలకమైనది నామినేషన్ల ఘట్టం. దానికి ముందు ఉండేది అభ్యర్ధుల జాబితాల విడుదల. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అందరికన్నా ముందంజలో ఉంది. బిజెపి జేడీఎస్ ల కన్నా ముందుగానే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసేసింది.
బొమ్మయ్ పాలనలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆత్మరక్షణలో పడిపోయిన బిజెపి అభ్యర్ధల ఎంపిక విషయంలో సుదీర్ఘ కసరత్తే చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారికి టికెట్లు ఇస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. పోనీ వారిని పక్కన పెడదాం అంటే వారు తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తారన్న భయం. ఏం చేయాలో పాలుపోని అయోమయం. అందుకే అభ్యర్ధుల జాబితా విషయంలో ఇంచుమించు కుస్తీలే చేసినంత పని అయ్యింది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. ఎలక్షన్లో పోటీచేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 20 చివరి తేదీ. అయితే ఇప్పటివరకు ఏ పార్టీ 224 స్థానాలకు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ 212 స్థానాలకు కాంగ్రెస్ 166 సీట్లకు, జేడీఎస్ 93 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారుచేశాయి. రెండు జాబితాల విడుదల తర్వాత బీజేపీలో అసమ్మతి చర్చనీయాంశంగా మారింది. టికెట్ దక్కకపోవడంతో.. సీనియర్లతోపాటు పలువురు సిట్టింగులు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అటు కాంగ్రెస్‌లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. దీంతో మూడో జాబితా ఆలస్యమవుతూ వస్తోంది. అవినీతి ఆరోపణలు, అసంతృప్తిని తగ్గించుకునేందుకు కర్ణాటక చేపట్టిన ప్రక్షాళన.. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తింది. టికెట్లు ఆశించి భంగపడిన సీనియర్లు రాజీనామాల పర్వానికి దిగడం కాషాయానికి తలనొప్పిగా మారింది. రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యతను మాజీ సీఎం యడియూరప్పకు అప్పగించింది బీజేపీ హైకమాండ్. 189 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో 52మంది కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిన బీజేపీ.. బుధవారం విడుదల చేసిన రెండో జాబితాలోనూ ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చింది. ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప సహా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది కర్ణాటక బీజేపీ. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్కుకు రెండో జాబితాలోనూ చోటు దక్కలేదు. అయితే షెట్టర్ కు టికెట్ ఇవ్వాల్సిందిగా యడ్యూరప్ప కూడా సిఫారసు చేసినట్లు సమాచారం. కర్నాటక లో పార్టీల బలా బలాలు విజయావకాశాలపై తాజాగా వెల్లడైన సర్వేల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని తేలింది. సీ వోటర్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తుందని తేల్చారు. మరో సర్వేలో మాత్రం కాంగ్రెస్ కు 95 నుండి 105 స్థానాలు మాత్రమే వస్తాయని తేలింది. బిజెపికి 92 నుండి 95 స్థానాలు జేడీఎస్ కు 25 నుండి 30 స్థానాలు వస్తాయని తేల్చారు. ఇదే విధంగా హంగ్ పరిస్థితి వస్తే మాత్రం జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ గా అవతరించే అవకాశాలు ఉంటాయి. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113. సర్వేల్లో ఏ పార్టీకీ 113 స్థానాలు వచ్చే పరిస్థితి కనపడ్డం లేదు.
అయితే ఈ సర్వేల్లోనే మరో ట్విస్ట్ ఉంది. నాలుగు శాతం ఓటర్లు ఏ పార్టీకి వేస్తామో చెప్పలేదు. వారు తటస్థ ఓటర్లు. ఎన్నికల్లో వారు ఎవరికి ఓటు వేస్తారన్న దానిపైనే ఫలితాలు అధార పడి ఉంటాయి. కాంగ్రెస్ నాయకత్వం అయితే తటస్థ ఓటర్లు కచ్చితంగా తమవైపే మొగ్గు చూపుతారని నమ్ముతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం అవుతుంది. అయితే సర్వేల్లో చెప్పిందే జరుగుతుందని కూడా చెప్పలేం.
గతంలో సర్వేలకు పూర్తి భిన్నంగా ఫలితాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2016లో బిహార్ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని ఓ సర్వే ఘంటాపథంగా చెప్పింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ జేడీయూ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అదే విధంగా కర్నాటకలోనూ ఏమైనా జరగచ్చంటున్నారు రాజకీయ పండితులు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడవుతాయి.