భజరంగ్ దళ్‌పై నిషేధం అనే హామీని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మేనిఫెస్టోలో పెట్టింది. ఇలా ఆ పార్టీ పెట్టడం ఆలస్యం భారతీయ జనతా పార్టీ అందుకుంది. అంతకు మించిన చాన్స్ లేదన్నట్లగా వాడుకున్నారు. హనుమాన్ చాలీసా పఠించారు. ఆంజనేయుడి వేషాలతో ప్రచారసభలను ముంచెత్తారు. ఇంకా చెప్పుకోవాలంటే మొత్తం భజరంగభళి చుట్టూ నడిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు. మరికొంత పెంచే ప్రయత్నమే చేసింది. దీని వల్ల కాంగ్రెస్ కు నష్టమేనని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ నష్టమో కాదో ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. ఆ ఫలితాలతోనే దేశ రాజకీయాల్ని మార్పు చేయాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే భజరంగ్ దళ్ వివాదాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు ఇంటికి పాలు తెచ్చిస్తామని కూడా హామీలిచ్చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా హామీల వాన కురిపిస్తూనే వివాదాస్పద నిర్ణయమొకటి ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే సంస్థలను నిషేధిస్తామని చెబుతూ ఉదాహరణలుగా పిఎఫ్‌ఐ, బజరంగ్‌దళ్ సంస్ధలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఉటంకించింది. ఇది వివాదాస్పద నిర్ణయమే. ఇది బీజేపీకి అస్త్రంలా మారుతుందని తెలియనంత అమాయకులు కాంగ్రెస్‌లో లేరు కానీ పెట్టారు వారు ఊహించిన రెస్పాన్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నిషేధించాలని కుట్ర పన్నిందని బజరంగ్‌దళ్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసనలకు దిగుతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఏదైనా ఒక సంస్థను అలాంటి కారణాలతో నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కాని కర్నాటకలో అధికారంలోకి వస్తే అలాంటి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఏ ఉద్దేశంతో మేనిఫెస్టోలో చేర్చారో అర్థం కాని విషయమే. కానీ మెల్లగా జరుగుతున్న పరిణామాలను చూస్తే బీజేపీ నాలిక్కరుచుకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అసెంబ్లి ఎన్నికల స్ధాయిలో విడుదలైన మేనిఫెస్టో జాతీయ స్ధాయిలో వివాదాస్పదం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ప్రయత్నం చేసింది. ఆ ట్రాప్‌లో బీజేపీ పడిందన్న అభిప్రాయం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టి, మైనారిటీలకు మెజారిటీ ప్రజలకు మధ్య చిచ్చు పెట్టే శక్తులపై గాని సంస్థðలపై చర్యలు తీసుకోవాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతమైన జీవనాన్నే కోరుకుంటారు. చాలా సందర్భాల్లో భజరంగ్ దళ్ వ్యవహారం వివాదాస్పదమయింది. అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన ప్రశాంతతను ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకో వాలన్నది బీజేపీ లక్ష్యం. ఏడదిగా ఆ లక్ష్యంతోనే పాచికలు కదిపింది. హిజాబ్ వివాదం, ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి మత సంబంధిత అంశాలను ఎన్నికల అస్త్రాలుగా చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆ వ్యూహం సరైన ఫలితం ఇచ్చేలా లేదని గ్రహించిన కమలనాధులు అభివృద్ధి అస్థ్రాన్ని అందుకున్నారు. కేంద్రం నుంచి వేలకోట్లు కుమ్మరించారు. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే సహా ఎన్నో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అమిత్‌షా, మోడీ పదేపదే కర్నాటకలో పర్యటించారు. అటు కాంగ్రెస్‌కూడా ఉచిత హామీలను ఇచ్చింది. మరుగున పడిపోయిందనుకున్న వేళ కాంగ్రెస్ చెప్పిన బజరంగ్ దళ్ నిషేధం మాటతో మళ్లి మతమే అస్త్రంగా మారింది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఫలితం రావడం ఖాయమన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. అదే జరిగితే ప్రజలు భజరంగ్ దళ్‌పై నిషేధాన్ని స్వాగతించినట్లే అవుతుంది. ఆ సంస్థ నిర్వాకాలపై దేశవ్యాప్త వ్యతిరేకత పెంచడం ద్వారా మత ఉద్రేకాలు రెచ్చగొట్టే వ్యవహాహాలను అణిచి వేస్తామని దేశంలో మళ్లీ లౌకిక వాదం తీసుకు వస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చే దిశగా ఈ భజరంగ్ దళ్ వివాదంతో వ్యూహం పన్నిందన్న డౌట్ ఇప్పుడు బీజేపీ నేతలకు వస్తోంది. మత పరమైన అంశంపై దూకుడాగా స్పందించడం వల్ల బీజేపీకి హిందూ వర్గాల్లోనూ వ్యతిరేకత వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడంపై మెజార్టీ హిందువులు సంతృప్తి చెందరు. రాజకీయం చేయాల్సిన చోట చేయకుండా దేవుళ్లను వాడుకుంటోందని బీజేపీపై వ్యతిరేకత పెంచగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ మారిపోతుంది. కర్ణాటక ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అదే ప్లాన్ వేసిందని బీజేపీకి ఇప్పుడు డౌట్ వస్తోంది.
రాజకీయాల్లో ఏదీ ఆవేశంతో చేయకూడదు. అన్నీ ఆలోచనతోనే చేయాలి. కాంగ్రెస్ పార్టీ భజరంగ్ దళ్‌ను ఎందుకు ఎన్నికల్లోకి తెచ్చిందో బీజేపీ పెద్దలు కొన్న గంటల పాటు సమీక్ష చేసుకుని ఉంటే కర్ణాటకలో అభివృద్ధి ప్రచారం నుంచి దృష్టి మరల్చేవారు కాదేమో. కానీ ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ప్రజలు ఓట్లేస్తున్నరు. జాతకాలు బయటపడిన తర్వాత కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం చేసిందా బీజేపీ తొందరపడిందా అన్నది తేలిపోతుంది.