2024 ఎన్నికలకు ప్రాణవాయువు దొరికింది

By KTV Telugu On 15 May, 2023
image

కాంగ్రెస్ నాయకత్వం రూపొందించుకున్న ప్రణాళికలు వేసుకున్న వ్యూహాలు విసిరిన పాచికలు వర్కవుట్ అయ్యాయి. 40% కమిషన్ ప్రభుత్వం అంటూ బిజెపి ప్రభుత్వ అవినీతినే టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగింది. ఓటరను తన వైపు తిప్పుకోగలిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రంలో పార్టీ సాధించిన విజయం హైకమాండ్ కు విజయోత్సాహాన్నిచ్చింది. ఇదే ఉత్సాహంతో 2024 ఎన్నికల దిశగా కదం తొక్కడానికి హస్తం పార్టీకి అవసరమైన ప్రాణవాయువు దొరికింది. కర్నాటక ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం వెనుక చాలా కారణాలున్నాయి. దేశంలోనే కాంగ్రెస్ స్థానిక నాయకత్వం అత్యంత బలంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పార్టీకి విధేయులైన నేతల బలం ఉంది. వీటికి తోడు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కూడా ఇదే కావడంతో ఆ సెంటిమెంట్ కూడా అంతర్లీనంగా పనిచేసి ఉంటుంది. బసవరాజ్  బొమ్మయ్ అవినీతినే బ్రహ్మాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ దాన్నుంచి ఎక్కడా డీవియేట్ కాకుండా జాగ్రత్తపడింది.

కన్నడ ఎన్నికల నగారా మోగిన క్షణం నుంచే పార్టీలో భిన్న ధృవాలైన డి.కే.శివకుమార్-సిద్ధరామయ్యల మధ్య ఆధిపత్య పోరు ఉన్నా ఇద్దరి మధ్య సయోధ్య ఉండేలా నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ కూడా పార్టీకి కలిసొచ్చింది. ఇక చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీకి దీటుగా కాంగ్రెస్ ప్రచారం చేయలేకపోయేది. కానీ కర్నాటకలో మాత్రం మోదీకి సవాల్ విసురుతూ ప్రియాంక గాంధీ చేపట్టిన ప్రచారానికి కన్నడ ప్రజలు ఫిదా అయ్యారు. మోదీని ఉద్దేశించి ఆమె వేసిన పంచులు కూడా అదిరాయి. ప్రజల దగ్గరకు వచ్చిన ప్రధాని వారి సమస్యలు అడిగి తెలుసుకోవలసింది పోయి నన్ను 91 సార్లు తిట్టారంటూ ప్రజలకు ఫిర్యాదు చేసుకోవడం ఏంటని ప్రియాకం నిలదీశారు. తన తండ్రి నాయనమ్మలు ప్రజలకోసం ప్రాణత్యాగాలు చేస్తే మోదీ తనని తిట్టారని బాధపడుతూ చాడీలు చెబుతున్నారని ప్రియాంక సెటైర్ వేసింది.

బిజెపి పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న వర్గాలను దగ్గరకు తీసుకోవడంలో కాంగ్రెస్ నాయకత్వం సఫలీకృతమైంది. దాంతో పాటు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పంచ సూత్ర హామీలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ హామీలు బాగా నచ్చడం వల్లనే బజరంగ్ దళ్ నిషేధ హామీపై బిజెపి రచ్చ రచ్చ చేసినా జనం దాన్ని పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో బిజెపి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిందన్న కోపంతో పాటు కాంగ్రెస్ కు ఓ అవకాశం ఇద్దామన్న సానుభూతి కూడా ప్రజల్లో కలిగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రచారంలో కాంగ్రెస్ చాలా యాక్టివ్ గా వ్యవహరించింది. అంతకు మించి సోషల్ మీడియాలో 24 గంటలూ కాంగ్రెస్  సామాజిక మాధ్యమ నిర్వాహకులు చురుగ్గా వ్యవహరించారు. నిజానికి సోషల్ మీడియా వినియోగంలో దేశంలోనే బిజెపి నంబర్ వన్ గా ఉంది. కానీ కర్నాటకలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బిజెపిని అధిగమించగలిగింది. పిసిసి అధ్యక్షుడు డి.కె.శివకుమార్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో ఎంత సిద్ధహస్తుడో మరోసారి చాటుకున్నారు. బిజెపి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ కొత్త వ్యూహాలు రచించుకుంటూ పార్టీని ముందుకు నడిపించారు. జై బజరంగ్ బలి నినాదాన్ని కూడా సమర్ధవంతంగానే తిప్పికొట్టారు.

ఏం హనుమంతుడు బిజెపి వాళ్లకి మాత్రమే దేవుడా మాకూ ఆయనే దేవుడు ఆయన్నే ఆరాధిస్తాం. ఆయనే మమ్మల్ని రక్షిస్తున్నాడు అంటూ హిందూ ఓటర్లు దూరం కాకుండా జాగ్రత్తలు పడ్డారు డి.కె.శివకుమార్. అటు మరో అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్లామర్ కూడా పార్టీకి లబ్ధి చేకూర్చింది. లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంలో సిద్ధరామయ్య పాత్ర కూడా ఉంది. బిజెపి పనిగట్టుకుని దూరం చేసుకున్న ముస్లిం ఓటర్లను ఆకర్షించడంలోనూ కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాలు వర్కవుట్ అయ్యాయి. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరిని ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని నిలువరించడానికి విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ఇపుడు వెయ్యేనుగుల బలం వచ్చినట్లయ్యింది. ఇదే ఊపుతో ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణా, మణిపూర్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ హుషారుగా సమాయత్తం కావడానికి కన్నడ విజయం పనికొస్తుందంటున్నారు రాజకీయ పండితులు.