కేజ్రీవాల్ కు అండగా కేసీఆర్

By KTV Telugu On 29 May, 2023
image

విపక్షాలు విడి విడిగా ఉంటే బలమైన కేంద్రంతో పోరాడే పరిస్థితి ఉండదు. అదు అందరూ చేతులు కలిపితే గడ్డిపోచలు కలిసి గజాన్ని బంధించినట్లు కేంద్రం మెడలు వంచవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢిల్లీలో తమ ప్రభుత్వం అధికారాలను హరించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటానికి వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్నారు కేజ్రీవాల్. ఆ క్రమంలో భాగంగా బి.ఆర్.ఎస్. అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీయార్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని ముప్పు తిప్పలు పెడుతోంది కేంద్రంలోని బిజెపి. ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేసేందుకు బిజెపి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. గతంలోనే ఢిల్లీ ప్రభుత్వంపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ పెత్తనాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ప్రభుత్వ అధికారులను బదలీ చేసే అధికారం కూడా తమకి లేకుండా లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బిజెపియే పాలన సాగిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి సర్వాధికారాలూ ఉంటాయని స్పష్టం చేసింది. లెఫ్ట్ నెంట్ గవర్నర్ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీన్ని ఢిల్లీ ప్రజల విజయంగా అభివర్ణించారు కేజ్రీవాల్. అయితే ఆ ఆనందం మూడురోజులు కూడా లేదు. అంతలోనే కేంద్ర ప్రభుత్వం ఆప్ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా ఆర్డినెన్స్ రూపొందించేసింది. ఇలా చేయడం సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అని మండి పడుతున్నారు కేజ్రీవాల్. ఈ  ఆర్డినెన్స్ ను పార్లమెంటులో వ్యతిరేకించాలని బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కేజ్రీవాల్ పిలుపు నిస్తున్నారు. తన పోరాటానికి అండగా నిలవాలంటూ వివిధ పార్టీల నేతలను కోరుతున్నారు. మద్దతు పెంచుకుంటూ పోతున్నారు. ఆ మధ్య  విపక్షాల ఐక్యతా యత్నాల్లో భాగంగా ఢిల్లీ వెళ్లిన నితిష్ కుమార్ ను కూడా కేజ్రీవాల్ ఇదే కోరారు. కేజ్రీవాల్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని నితిష్ కుమార్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా కేజ్రీవాల్ మద్దతు కోరారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు.

బిజెపితో నిత్యం సమరం చేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ లు సైతం కేజ్రీవాల్ కు మద్దతు గా ఉన్నారు. తెలంగాణాలోని బి.ఆర్.ఎస్. మద్దతు కోసం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ కూడా వచ్చి కేసీయార్ తో భేటీ అయ్యారు. కేంద్రంలోని బిజెపి అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణంతో దేశాన్ని నాశనం చేస్తోందని బిజెపియేతర ప్రభుత్వాలనుకాల్చుకు తింటోందని ఈ సందర్భంగా కేసీయార్ మండి పడ్డారు.  సామాజిక ఉద్యమాలతో ప్రజల గుండెల్లో నిలిచి  ఢిల్లీలో కాంగ్రెస్,  బిజెపిలను చిత్తు చిత్తుగా ఓడించారంటూ కేజ్రీవాల్ ను కొనియాడిన కేసీయార్ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆప్ కు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. లోక్ సభలో బిజెపికి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే రాజ్యసభలో మాత్రం విపక్షాలదే పై చేయి. అందుకే రాజ్యసభలో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాల్సిందిగా విపక్షాలను కోరుతున్నారు కేజ్రీవాల్. సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దానికి విరుద్దంగా ఆర్డినెన్స్  తీసుకురావడం దుర్మార్గం అంటున్నారు కేజ్రీవాల్. అసలు కేజ్రీవాల్ పై బిజెపికి ఎందుకింత కసి. ఆమ్ ఆద్మీ పార్టీపై కక్షతోనే బిజెపి ఆర్డినెన్స్ తెచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది నిజమో కాదో చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అసలు కేజ్రీవాల్ ని చూస్తే  బిజెపికి  భయమా అసూయా కోపమా అసహ్యమా ఇవి తెలుసుకోవాలంటే అసలు కేజ్రీవాల్ పై బిజెపి అక్కసుకు కారణం తెలుసుకోవాలి.

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అంటే రెండు జాతీయ పార్టీలకూ కోపమే. ఎందుకంటే వరుస ఎన్నికల్లో తమని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు కేజ్రీవాల్. ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపిలకు అడ్రస్ లేకుండా చేశారు. అక్కడితో ఆగకుండా అలా పంజాబ్ కు విస్తరించి అక్కడ కూడా కాంగ్రెస్, బిజెపిలను వెనక్కి నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతటితో ఆగేదే లేదని చెప్పి గుజరాత్ వైపూ చూస్తున్నారు. కొద్ది నెలల క్రితమే సూరత్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి కాంగ్రెస్-బిజెపిలకు షాకిచ్చారు. ఇలా వటుడింతై అంతై అన్నట్లు కేజ్రీవాల్ వట వృక్షంలో ఎదిగిపోవడం రాజకీయంగా తమని నిలువునా ముంచుతుందని కాంగ్రెస్ పార్టీ వణుకుతోంది.శత్రువుకి శత్రువు మిత్రుడన్న సామెత చందాన ఆప్ విషయంలో కాంగ్రెస్-బిజెపిలు ఒక్కలాగే ఆలోచనలు చేస్తున్నాయి. ఆప్ ఎదుగుదలను అడ్డుకుని తీరాలని ఈ రెండు పార్టీలూ పట్టుదలగా ఉన్నాయి. లేదంటే కొన్ని రాష్ట్రాల్లో బిజెపికి కొన్ని చోట్ల కాంగ్రెస్ కి ఆమ్ ఆద్మీ పార్టీయేకొరకరాని కొయ్యలా కనిపిస్తోంది.