సువిశాల భారతానికి వరుసగా రెండుసార్లు ప్రధాని అయిన నరేంద్రమోడీ ఏం చదువుకున్నారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రశ్నకు జవాబులేదు. కేజ్రీవాల్‌లాంటి వాళ్లు అడుగుతారు బీజేపీ నేతలు ఏదో చెబుతారు కానీ ఆ డిగ్రీ మీద వివాదం మాత్రం ఆగలేదు సందేహాలు తీరలేదు. ఐఆర్ఎస్ ఉద్యోగంచేసి రాజకీయాల్లోకి వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి అన్నిటికంటే పెద్ద సమస్య మోడీ డిగ్రీనే. చదువుకోని ప్రధాని అంటూ తరచూ వేలెత్తిచూపించే కేజ్రీవాల్‌కి కూడా ఇప్పటికీ ఆయనేం చదివారన్నదానిపై క్లారిటీ రాలేదు.
తన డిప్యూటీ సీఎం సిసోడియాని జైల్లో వేసినప్పటినుంచీ కేజ్రీవాల్ మాటల్లో పదును పెరిగింది. ప్రధానిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. చదువుకోని ప్రధానితోనే సమస్యలు వస్తున్నాయని తరచూ వేలెత్తిచూపిస్తున్నారు. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ కేసులో గుజరాత్ హైకోర్టు చివరికి తీర్పు ఇచ్చింది. ప్రధాని డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం బహిర్గతం చేయాల్సిన అవసరంలేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది. గుజరాత్ యూనివర్సిటీతో పాటు ఢిల్లీ యూనివర్సిటీలు మోడీకి ఇచ్చిన డిగ్రీ పీజీ సర్టిఫికెట్లను సమర్పించాలని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది.
మోడీ డిగ్రీ సర్టిఫికెట్లు బయటపెట్టాలని డిమాండ్‌చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి కోర్టు 25వేల జరిమానా విధించింది. విద్యార్హత చెప్పమంటే జరిమానా వేస్తారా అని కేజ్రీవాల్ అసహనం ప్రదర్శించారు. సీఐసీ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. పీఎం మోడీ వాదన ప్రకారం ఆయన 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. ఈ కేసులో యూనివర్సిటీ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విద్యార్హత గురించి దాచిపెట్టడానికేమీ లేదన్నారు. అయితే వర్సిటీమీద ఒత్తిడి చేయడం సరికాదని వాదించారు.
మోడీ రెండోసారి ప్రధాని అయినప్పటినుంచీ ఆయన డిగ్రీపై రాజకీయ దుమారం రేగుతోంది. కేజ్రీవాల్ ఆరోపణలతో రంగంలోకి దిగిన అమిత్‌షా ప్రధాని విద్యార్హతలను తెలిపే బీఏ ఎంఏ సర్టిఫికెట్లని బయటపెట్టారు. అయితే ఆ సర్టిఫికెట్లు ఫేక్ అని, ఆ సంవత్సరంలో డిగ్రీ సర్టిఫికెట్లు ఆ తరహాలో విడుదల చేయలేదని ఆమ్ ఆద్మీ మళ్లీ వివాదాన్ని రాజేసింది. సర్టిఫికేట్లలో పేర్ల తేడాని కూడా ఆప్ ఎత్తిచూపించింది. ఇప్పటిదాకా మాటలకే పరిమితమైన వివాదం చివరికి కేజ్రీవాల్‌కి ఫైనేసేదాకా వచ్చింది. ఏం చదువుకుంటే నాకెందుకని కేజ్రీవాల్ వదిలేస్తారో సబ్జెక్ట్ తేలేదాకా ఫైట్ చేస్తారో చూడాలి.