బింద్రన్‌వాలే. స్వర్ణదేవాలయం. ఎవరూ మర్చిపోలేదిప్పటికీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు కారణమైంది ఆ వేర్పాటువాదమే. స్వర్ణదేవాలయంపై ఆపరేషన్ బ్లూస్టార్ చేయించినందుకు ప్రతీకారంగా ఇందిరాగాంధీ హత్య జరిగింది. అంగరక్షకులే ఇందిరాగాంధీని కాల్చిచంపారు. ఆ తర్వాత జరిగిన సిక్కుల ఊచకోత ఇప్పటికీ మనదేశానికి మాయనిమచ్చగానే ఉంది. పాకిస్తాన్‌లా ఖలిస్తాన్ ఏర్పాటుకోసం అప్పట్లో బుసలుకొట్టిన వేర్పాటువాదాన్ని కఠినంగా అణచివేసింది ఇందిరాగాంధీ. దేశభద్రతకే ముప్పుగా మారిన బింద్రన్‌వాలేని ఆ ఆపరేషన్‌లో తుదముట్టించింది. తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాదం తగ్గుముఖం పట్టినా పూర్తిగా తెరమరుగైతే కాలేదు.
పంజాబ్‌లో మళ్లీ వేర్పాటువాదం విజృంభిస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అమృత్‌సర్ ఘటన అలాంటి హెచ్చరికలే చేస్తోంది. అమృత్‌సర్‌లోని అజ్నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడి ఓ సమూహం ఆగ్రహంతోనో అసహనంతోనే చేసింది కాదు. అదో యుద్ధంలా కనిపించింది. తుపాకులు, కత్తులు, క్రలతో ఠాణాపై దాడిచేశారు అమృత్‌పాల్‌సింగ్ మద్దతుదారులు. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తూఫాన్‌ను అరెస్ట్ చేయడమే ఈ దాడికి కారణం. దాడికి దిగినవారికి పోలీసులు లొంగిపోయి అరెస్ట్‌చేసిన వ్యక్తిని విడుదల చేయాల్సి వచ్చింది.
అమృతపాల్ సింగ్ ఖలీస్తాన్ మద్దతుదారు. అచ్చం బింద్రన్‌వాలా అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నాడు. ఖలిస్తానీ గ్రూపు వార్సి పంజాబ్ దేకు అమృత్‌పాల్ సింగ్ చీఫ్‌గా ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో సింగర్ దీపూ సింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాక వార్సి పంజాబ్‌దే గ్రూపును అమృత్‌పాల్ నడిపిస్తున్నారు. అమృత్‌పాల్ వేషధారణ కూడా అచ్చం బింద్రన్‌వాలేని గుర్తుచేసేలా ఉంటుంది. తన ప్రైవేట్ ఆర్మీ ఫౌజువాన్‌తో ఈమధ్య స్వర్ణదేవాలయాన్ని సందర్శించాడు. సామాజిక రుగ్మతలు, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతానంటూనే ప్రత్యేక సిక్కు దేశం కావాలన్న లక్ష్యంతో అందరినీ ఏకంచేస్తున్నాడు అమృత్‌పాల్‌సింగ్.
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాని కూడా అమృత్‌పాల్‌సింగ్ బెదిరించాడు. ఇందిరాగాంధీ తరహాలోనే చంపేస్తానని హెచ్చరించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సాయుధ అంగరక్షకులతో నిర్భయంగా తిరుగుతున్నాడు. ఏడాది క్రితందాకా ఇతనో అనామకుడు. ఇప్పుడు అతివాదంతో వ్యవహరించే కొందరు సిక్కులకు మరో బింద్రన్‌వాలే. వయసు 29 ఏళ్లే. కానీ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగిన తీరుచూశాక కేంద్రం కూడా అప్రమత్తమైంది. పంజాబ్‌లో ఆప్ సర్కారు ఉందని కేంద్రంలోని బీజేపీ రాజకీయం చేయడానికి లేదు. ఎందుకంటే ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం. దాన్ని రాష్ట్ర వ్యవహారంగా తేలిగ్గా తీసుకుంటే బింద్రన్‌వాలే నాటి పరిణామాలు పునరావృతమైతే అదుపుచేయడం కష్టం.