ప్రపంచంలో భారత్ ను కొన్ని రోజులుగా వార్తల్లో నిలుపుతున్న అంశాలు రెండే ఒకటి అదానీ, రెండు ఖలిస్థాన్. అదానీపై జరగాల్సినంత రచ్చ జరుగుతోంది. ఖలిస్థాన్‌పై ఇంకా ఎక్కువ రచ్చ జరుగుతోంది. అయితే ఇది రాజకీయం కాదు. ఇటీవలి కాలంలో ఖలిస్థాన్ అనే పేరే భారత్‌లో వినిపించడం లేదు. కానీ హఠాత్తుగా ఇప్పుడు సీరియస్ అంశమైపోయింది. దీనికి కారణం అమృత్ పాల్ సింగ్. ఖలిస్తాన్ ఉద్యమ కొత్త నేతగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ ఇప్పుడు ఖలిస్తాన్ మంటను అంటించాడు. ఆయనను పట్టుకోవడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది.
సంవత్సరంన్నర క్రితం దుబాయి లో ట్రక్కు డ్రైవర్ గా పనిచేసిన అమృత్ పాల్ తిరిగి పంజాబ్ వచ్చి ఖలిస్తాన్ నేతగా ప్రకటించుకున్నాడు. . భీంద్రన్ వాలే ఆశయాన్ని అమలు చేయడానికి ప్రాణాలు అయినా అర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అసలు భింద్రన్ వాలే మరణించే సమయానికి ఈ అమృత్ సింగ్ పాల్ పుట్టలేదు. 29 ఏళ్ల యువకుడు అమృత్ సింగ్ పాల్ రాత్రికి రాత్రే ‘వారిస్ పంజాబ్ దే’పేరుతో వేర్పాటువాద సంస్థ కి నాయకుడు అయిపోయాడు. ఈ సంస్థను దీప్ సిద్ధు నడిపేవారు. ఆయన చిన్నపాటి సెలబ్రిటీ. యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఆ ప్రమాదం ఇప్పటికీ మిస్టరీనే. ఇప్పుడు ఆ సంస్థను అమృత్ సింగ్ పాల్ తీసుకుని ఖలిస్థాన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత రకరకాల దాడులు జరుగుతున్నాయి. ఖాలిస్తాన్ వాదం ఇంకా సజీవంగానే ఉంది అని అందరికీ తెలియచేయడానికే దాడులు ప్రారంభించారు.
ఖలిస్థాన్ ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పంజాబ్‌లో సిక్కులకూ నిరంకారీలకు మధ్య విభేదాల సెగలు ఇప్పటివి కావు. సుమారు తొమ్మిది దశాబ్దాల క్రితం నుంచీ నిరంకారీ మిషన్’కు సిక్కుల్లోని మెజారిటీ వర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాల మధ్య వైషమ్యాలు వైరుధ్యాలు ఘర్షణలకు హత్యలకు దారితీయడం దశాబ్దాలుగా కొనసాగుతున్న చరిత్ర. 1978లో ఉభయ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో 13 మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. 1980లో అప్పటి నిరంకారీ పీఠం అధిపతి గురుబచన్ సింగ్‌ను దుండగులు హతమార్చారు. ఆ సమయంలో సిక్కుల ప్రతినిధిగా తెరపైకి వచ్చిన భింద్రన్‌వాలే సొంతంగా సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక ఖలిస్థాన్ పేరిట వేర్పాటు వాదాన్ని ముందుకు తెచ్చాడు. భింద్రన్‌వాలే ప్రభావం మొదట్లో అంతగా లేకున్నా ఆ తర్వాత కొరకరాని కొయ్యిగా మారాడు. ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో తాము వివక్షకు గురవుతున్నామని భావించే సిక్కుల్లో కొన్నివర్గాల వారిని పావులుగా వాడుకొన్న భింద్రన్‌వాలే సిక్కుల స్వయం ప్రతిపత్తి కోసం ఖలిస్థాన్ పేరిట ప్రత్యేక దేశం ఏర్పడాల్సిందేనని నూరిపోశాడు.
భింద్రన్‌వాలే నేతృత్వంలో ఉగ్రవాదులు ప్రార్థనా మందిరాలను స్థావరాలుగా చేసుకొని ఖలిస్థాన్ కోసం విధ్వంసక చర్యలను విస్తృతం చేశారు. భింద్రన్‌వాలే ఘాతుకాలతో అట్టుడికిన పంజాబ్‌ను దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో వేలాదిమంది ప్రాణాలు కొల్పోయారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం నుంచి ఉగ్రవాదులను ఖాళీ చేయించేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ సిక్కుల్లో ఆగ్రహజ్వాలలను రగిలించింది. ఆపరేషన్ బ్లూస్టార్’కు నిరసనగా ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 165 మంది హిందువులు నిరంకారీలు భింద్రన్‌వాలేను వ్యతరేకించిన 39 మంది సిక్కులు కూడా ప్రాణాలు కోల్పోయారు. భింద్రన్‌వాలే అనుచరుల ప్రతీకారం ఇంతటితో చల్లారలేదు. ప్రధాని ఇందిరా గాంధీని సిక్కు మతస్థులైన ఆమె సెక్యూరిటీ గార్డులే హత్య చేయడంతో ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో సిక్కులపై మూకుమ్మడి దాడులు జరిగాయి. 1980 నుంచి దశాబ్ద కాలం పాటు ఉగ్రవాద కోరల్లో పంజాబ్ విలవిలలాడింది. ఆ తర్వాత భద్రతాదళాలు శాంతిభద్రతలను దారిలోకి తెచ్చాయి.
భింద్రన్ వాలే మరణం తరువాత రెండో తరం నాయకులలో చాలా మంది కెనడా బ్రిటన్ అమెరికా దేశాలకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు. వీరంతా చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు అమృత్ సింగ్ చేస్తున్న నిర్వాకంతో వాళ్లు ఆయా దేశాల్లో అలజడి రేపుతున్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదులు గతంలో కెనడాకే పరిమితం. ఇప్పుడు అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత్ వ్యతిరేక ప్రదర్శనలను నిర్వహిస్తూ త్రివర్ణ పతాకాలను అవమాన పరుపరుస్తున్నారు. అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కోలో కొద్ది రోజుల క్రితం ఆందోళన జరిపిన ఖలిస్తాన్ మద్దతుదారులు శనివారం నాడు వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయం వద్ద హింసను ప్రేరేపించే రీతిలో ప్రసంగించారు. దౌత్య కార్యాల యంలోకి దూసుకుని వెళ్ళేందుకు ప్రయత్నిం చారు. ఆస్ట్రేలియాలోని ప్రార్థనా మందిరాలను ఖలిస్తాన్ వాదులు తగులబెడుతున్నారు ఖలిస్తాన్ అనేది ఊహాజనితమేననీ అది సాకారమయ్యే అవకాశాలే లేవని సిక్కుల్లో సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నప్పటికీ యువతరాన్ని రెచ్చగొట్టేందుకు కొత్తగా అమృతపాల్ సింగ్ వంటి నాయకులు తయారయ్యారు. అమృతపాల్ సింగ్ పంజాబ్‌లో ఇటీవల ఆందోళనలకు నేతృత్వం వహిస్తూ తన మద్దతు దారులను రెచ్చగొడుతున్నారు. తాను భింద్రన్ వాలా సిద్ధాంతాలకు ప్రభావితుడనైనానని అతడే స్వయంగా చెప్పుకుంటున్నాడు. పెద్దగా చదువు కోకపోయినా ఖలిస్తాన్ నినాదంతో సిక్కులను ఆకర్షించి మళ్ళీ అలనాటి ఉద్య మాన్ని పోలిన ఆందోళన కోసం యువతను అతడు రెచ్చగొడుతున్నాడు.
కారణ ఏదైనా దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. కొత్త కొత్త నాయకులు పుట్టుకు వస్తున్నారు. వీరి ఎదుగదల వెనుక అంతర్గత శక్తులే కాదు బయట శక్తులు కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఎందుకు ప్రభుత్వాలు ఇలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆరిపోయిన మంటల్ని కొత్తగా అంటిస్తూంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటుననాయన్నదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇది పాలకుల చేతకాని తనమే అనుకోవాలి.