అన్నీ నావే అంతా నేనే అంటున్నారు బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప తుచ్ఛమైన పదవులకోసం కాదు సుమా అని చాలా మోడెస్ట్ గా క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రా తెలంగాణా కర్నాటక అన్నీ తన సొంత ప్రాంతాలే అని వెరైటీ పంచ్ ఇచ్చారు. అన్ని చోట్లా బిజెపిని గెలిపించుకుంటానని కూడా అన్నారు. ఈ మధ్యనే ఢిల్లీలో బిజెపి అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన జరగనిచ్చే ప్రసక్తి లేదని చివరి నిముషం వరకు అందరినీ మభ్యపెడుతూ వచ్చి కేంద్రంలోని కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా ఏపీని విభజించుకునేందుకు సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత ఇప్పుడో చిన్న బ్రేక్ అని మాయమయ్యారు. ఆతర్వాత 2019 ఎన్నికల ముందో ఎపుడో ప్రత్యక్షమై కాంగ్రెస్ లో చేరారు. అక్కడ ఎవరూ పట్టించుకోలేదో అనుకున్న పదవులు గౌరవం దక్కలేదో తెలీదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉక్కపోత పెరిగిపోయి మౌనంగా ఉండిపోయారు. చాలా గ్యాప్ తర్వాత బిజెపిలో ఎంట్రీ ఇచ్చారు.
సినీ నటులు తమ సినిమా రిలీజ్ కు ముందు మీడియాతో మాట్లాడేటపుడు ఈ సినిమా నాకు కచ్చితంగా వెరైటీ మూవీ అవుతుంది పెద్ద హిట్ అవుతుంది అంటారు. రిలీజ్ తర్వాత సినిమా కనిపించడు నటీ నటులు కనిపించరు అదే విధంగా రాజకీయ నాయకులు ఏ పార్టీలో చేరినా ముందుగా చెప్పే రొటీన్ డైలాగ్ నాకు పదవులు ముఖ్యం కాదు పెజాసేవకోసమే పార్టీలో చేరాను అంటారు.
సరే అందరిలానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా బాగా ప్రజాసేవ చేయాలని అనిపించే బిజెపిలో చేరిఉంటారు. ఇపుడు ఆయన తెలంగాణాలో బిజెపి విజయం కోసం పనిచేస్తారా లేక ఏపీలో పార్టీ బలోపేతం కోసం పాటు పడతారా అన్న అనుమానాలు వస్తాయి. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరిన సమక్షంలో మీడియా ఇదే ప్రశ్న వేస్తే బిజెపి అగ్రనేత ప్రహ్లాద్ జోషీ ఏమన్నారంటే ఆయన ఏపీ తెలంగాణా రాష్ట్రాలు రెండింట్లోనూ బిజెపి విజయానికి కష్టపడతారు అని జవాబిచ్చారు.
జోషీ నిజంగా దాన్ని నమ్మి చెప్పి ఉంటే అంతకు మించిన అమాయకత్వం మరోటి ఉండదంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెబితే చాలు తెలంగాణా వాదులు మండి పడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రిహోదాలో కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభలో తెలంగాణా ప్రాంతాన్ని కించ పరిచేలా వ్యాఖ్యానించారు. అంతే కాదు మీకు ఒక్క పైసా కూడా ఇవ్వనంటూ హెచ్చరించారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డిని బిజెపిలో చేర్చుకున్న వెంటనే తెలంగాణాలోని బి.ఆర్.ఎస్. నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాను వ్యతిరేకించే వారిని మాత్రమే బిజెపి తమ పార్టీలో చేర్చుకుంటుందని బి.ఆర్.ఎస్. మంత్రులు ధ్వజమెత్తారు. పార్టీలో చేరిన తర్వాత మొదటి సారి విజయవాడ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం కన్నా ఇప్పటి బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోందన్నారు. తాను హైదరాబాద్ లో పుట్టి అక్కడే పెరిగి పెద్దయ్యాను కాబట్టి హైదరాబాద్ తన సొంత ఊరికింద లెక్క అన్నారు. చిత్తూరు జిల్లాలోని వాయిల్పాడు నియోజకవర్గం నుండి ఎన్నికల్లో గెలిచాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా నాసొంత రాష్ట్రమే అన్నారు.
బెంగళూరు నగరంలో నాకు సొంత ఇల్లు ఉంది కాబట్టి కర్నాటక కూడా నా సొంత రాష్ట్రమే అవుతుంది అని లాజిక్ లాగారు కిరణ్ కుమార్ రెడ్డి. అందుకే ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. కర్నాటకలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఉధృతమైంది. అక్కడి తెలుగు ప్రజల ప్రాంతాల్లో పార్టీ ప్రచారానికి కిరణ్ కుమార్ రెడ్డి ఎటువంటి వ్యూహరచన చేశారో దాని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే మే పదమూడు వరకు ఆగాలి. కిరణ్ కుమార్ రెడ్డి ప్లాన్ చేసిన ప్రాంతాల్లో బిజెపి సాధించే విజయాలను బట్టి పార్టీ అధిష్ఠానం కిరణ్ కుమార్ రెడ్డికి మార్కులు కేటాయిస్తుంది.
ఇక కర్నాటక ఎన్నికల తర్వాత జరగబోయేది తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణా ఎన్నికల్లో బిజెపి తరపున కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ పండగ చేసుకుంటుంది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తే ఆయనపై కోపంగా ఉన్న తెలంగాణా ప్రజలు బిజెపి వైపు కూడా చూడరు. బి.ఆర్.ఎస్. పాలన పట్ల విసిగి వేసారి ఉన్న జనం అపుడు కచ్చితంగా తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటారు. ఇక 2024 లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 2014 ఎన్నికల్లోనే తన సొంత నియోజక వర్గంలో తన సొంత పార్టీ తరపున బరిలో నిలబడ్డ తన సొంత సోదరుని గెలిపించుకోలేకపోయిన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం క్యాడర్ లేని బిజెపిని ఎక్కడి నుండి గెలిపిస్తారని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు. ఆంధ్ర తెలంగాణా కర్నాటక అన్నీ నావే అంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. బహుశా రేపు కాంగ్రెస్ జై సమైక్యాంధ్ర బిజెపి పార్టీలు మూడూ నావే అంటారేమో అని పొలిటికల్ సైంటిస్టులు సెటైర్లు వేస్తున్నారు.