దేశంలో ఈడీ దాడులు కొత్త కాదు. సీబీఐ కేసులు ఆగలేదు. ఇక ఆదాయపుపన్నుశాఖ ఎప్పుడు ఎవరి మీద కొరడా ఝుళిపిస్తుందో తెలీదు. దేశంలో దర్యాప్తుసంస్థల దుర్వినియోగం జరుగుతోందన్న ఆరోపణల ఈమధ్య ఎక్కువైంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక విపక్షనేతలే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. ఏమీ లేకపోయినా కేసుల్లో ఇరికిస్తున్నారా అంటే లేదు. ఏ చిన్నతప్పు దొరికినా తప్పించుకునే అవకాశం లేకుండా దర్యాప్తుసంస్థలు ఉచ్చు బిగిస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐలకు వీసమెత్తు ఆధారం దొరకలేదని రెండ్నెల్లక్రితం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జబ్బలు చరుచుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడాయన అరెస్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవినుంచి తప్పించారు.
కస్టడీలో అడిగినవే అడిగి విసిగిస్తున్నారని మనీష్ సిసిసోడియా నెత్తీనోరు బాదుకుంటున్నారు. మన జుట్టు వాళ్ల చేతికి దొరక్కుండా చూసుకోవాలి. దొరికాక లాగొద్దంటే వాళ్లెందుకు ఆగుతారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ దర్యాప్తుసంస్థల దూకుడు మరింత పెరిగేలా ఉంది. అందుకే మనీష్ సిసోడియా అరెస్ట్‌పై విపక్షాలు ఒక్కటవుతున్నాయి. ఆయన అరెస్ట్‌ని ఖండిస్తూ ప్రధాని నరేంద్రమోడీకి తొమ్మిదిమంది విపక్ష నేతలు లేఖరాశారు. బిడ్డ ఎప్పుడు అరెస్ట్ అవుతుందోనని టెన్షన్ పడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ అధినేతతో పాటు ఢిల్లీ, పంజాబ్, బెంగాల్ సీఎంలు కేజ్రీవాల్భగవంత్ మాన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్ధవ్ ఠాక్రే, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్ ఈ లేఖలో సంతకాలు చేశారు.
మనీష్ సిసోడియాపై చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నది విపక్షనేతల వాదన. మరి ఏ ఆధారం లేకుండా న్యాయస్థానం దర్యాప్తు సంస్థల వాదనతో ఎలా ఏకీభవిస్తుందో నిందితులకు బెయిల్ కూడా తిరస్కరిస్తుందో చూడాలి. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారంటున్నారు విపక్షనేతలు. బీజేపీ నిరంకుశ పాలనలో భారత్‌లో ప్రజాస్వామ్య విలువలకు ముప్పు ఏర్పడుతోందన్న విషయాన్ని ప్రపంచమంతా చూస్తోందంటున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న నాయకుల్లో ఎక్కువమంది విపక్షపార్టీలవారే. కాషాయకండువా కప్పుకుంటే ఏ కేసూ ఉండదంటూ అస్సాం సీఎం బిశ్వశర్మ ఉదాహరణని విపక్షనేతలు ఆ లేఖలో ప్రస్తావించారు.
విపక్షనేతలపై విరుచుకుపడే దర్యాప్తు సంస్థలు దేశాన్ని మోసంచేసిన పారిశ్రామికవేత్తలను ఎందుకు వదిలేస్తున్నాయన్నది అపోజిషన్ పార్టీల ప్రశ్న. అదానీ-హిండెన్‌బర్గ్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆ సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో గవర్నర్లు పరిధి దాటుతున్న విషయాన్ని కూడా ప్రధానికి రాసిన లేఖలో విపక్షనేతలు ప్రస్తావించారు. రాజ్యాంగ విధులకు విరుద్ధంగా గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి గవర్నర్లు విఘాతం కలిగిస్తున్నందునే దేశ ప్రజలు వారి పాత్రను ప్రశ్నిస్తున్నారన్నారు.
విపక్షనేతల లేఖను మోడీ ఎక్కడ పడేస్తారో అందరికీ తెలుసు. మరోవైపు బీజేపీ పాలనలో దేశప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు కొత్త వేదికను తెస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించారు. మార్చి 11న జంతర్‌మంతర్ దగ్గర ఇన్సాఫ్ వేదికను ప్రారంభిస్తున్నామని ఇందులో న్యాయవాదులు ప్రధాన పాత్ర పోషిస్తారని సిబల్ చెబుతున్నారు. ఇది పూర్తిగా ప్రజావేదికనీ రాజకీయపార్టీ కానేకాదని సిబల్ వివరణ ఇస్తున్నారు. మొత్తానికి హేమంత్ సోరెన్ నుంచి మనీష్ సిసోడియా దాకా దర్యాప్తు సంస్థలు ఎవరినీ వదలకపోవటంతో విపక్షాల గొంతులు కలుస్తున్నాయి.