అదానీ దెబ్బ‌కు ఎల్ఐసి ఖ‌ల్లాస్‌

By KTV Telugu On 27 February, 2023
image

వ్యాపార‌సామ్రాజ్యం న‌మ్మ‌కంతో ఎద‌గాలి అభూత‌క‌ల్ప‌న‌ల‌తో కాదు. అంకెలగారడీతో ప్ర‌పంచ కుబేరుడిగా ఎదిగిన గౌత‌మ్ అదానీ సామ్రాజ్యం పేక‌మేడ‌లా కూలిపోతోంది. దారుణాతిదారుణంగా షేర్లు ప‌త‌న‌మ‌వుతున్నాయి. అదానీ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడితే లాభాలొస్తాయ‌ని ఆశ‌ప‌డ్డ సామాన్య మ‌దుప‌రులు, పెద్ద పెద్ద సంస్థ‌లు భారీ న‌ష్టాల్ని మూట‌గ‌ట్టుకుంటున్నాయి.

అదానీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎల్‌ఐసీని ముంచేస్తోంది. ఆయా సంస్థల షేర్లలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ పెట్టిన పెట్టుబడులూ దారుణంగా తరిగిపోతున్నాయి. ఈక్విటీల్లో 30వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టంది ఎల్ఐసి. త‌మ విలువ అంతే ఉంద‌ని ఎల్ఐసి మొద‌ట బుకాయించినా దాదాపు 5వేల కోట్ల‌కు పైనే న‌ష్ట‌పోయింది. అదానీ గ్రూప్‌లోకి ఈమ‌ధ్యే వచ్చిన అంబుజా సిమెంట్స్‌ ఏసీసీల్లోని ఎల్‌ఐసీ పెట్టుబడుల నష్టాలతో పోలిస్తే ఇది ఎక్కువ‌.

గౌత‌మ్ అదానీ అక్ర‌మ‌ సామ్రాజ్యానికి రాళ్లెత్తిందీ గోడలు లేపిందీ అన్న వినోద్ అదానీనే. బ్లూమ్‌బర్గ్ ప్ర‌చురంచిన సంచ‌ల‌న క‌థ‌నం అదానీ అన్న నిర్వాకాల‌ను వెలుగులోకి తెచ్చింది. వినోద్‌తోపాటు ఆయన భార్య రంజన్‌బెన్‌కూ ఈ అక్ర‌మాల‌తో సంబంధం ఉంద‌ని బ్లూమ్‌బర్గ్ బ‌య‌ట‌పెట్టింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ల నుంచి అదానీ గ్రూప్‌నకు నిధులను సేకరించడంలో వినోద్ అదానీ కీల‌క పాత్ర పోషించాడు. రుణాలను సేకరించడంలోనూ అన్న పాత్రే కీల‌క‌మ‌ని బ్లూమ్‌బ‌ర్గ్ ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టింది. మారిషస్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, దుబాయ్‌లో న‌మోదైన ఏడు అన్‌లిస్టెడ్‌ కంపెనీల‌తో అదానీ గ్రూప్‌నకు సంబంధాలున్నాయి. ఈ ఏడు సంస్థల అంతిమ లబ్ధిదారులుగా గౌతమ్‌ అదానీ బదులు వినోద్‌, రంజన్‌బెన్‌ ఉన్నారు.

వినోద్‌కు తమ కంపెనీ ఆర్థిక లావాదేవీల‌తో సంబంధం లేద‌ని అదానీ గ్రూప్ చేసిన ప్ర‌క‌ట‌న ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని నిరూపించింది బ్లూమ్‌బ‌ర్గ్‌. సైప్రస్‌, యూఏఈ, సింగపూర్‌, మారిషస్‌, కరేబియన్‌ దీవుల్లోనూ అదానీ బ్ర‌ద‌ర్‌కు షెల్ కంపెనీలు ఉన్నాయి. హిండెన్‌బర్గ్ ఆరోప‌ణ‌ల‌ను బ‌ల‌ప‌రుస్తూ బ్లూమ్‌బర్గ్ మ‌రిన్ని ఆధారాలు బ‌య‌ట‌పెట్ట‌టంతో అదానీ బ‌తుకు బ‌స్టాండ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే నెల‌రోజుల్లో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంనుంచి 30వ స్థానానికి వ‌చ్చేశాడు ది గ్రేట్ అదానీ.