ఎల్ఐసీని అదానీ ముంచేయబోతున్నారా ?

By KTV Telugu On 15 December, 2022
image

ఎల్ఐసీ గొప్పదా ? అదానీ కంపెనీలు గొప్పవా ? మనలో చాలా మంది చాలా ఈజీగా ఎల్‌ఐసీనే గొప్పదని చెబుతారు. ఎందుకంటే ఆ సంస్థకు లక్షల కోట్ల ఆస్తులు, ఆదాయం, లాభాలు ఉన్నాయి. కానీ చాలా కొద్ది మంది మాత్రం అదానీ కంపెనీలే గొప్పవంటారు. ఎందుకంటే షేర్ మార్కెట్‌లో పది రూపాయలు పెడితే వెయ్యి లాభం తెచ్చిస్తోందని లెక్కలు చెబుతారు. కానీ ఎల్‌ఐసీ షేర్లకు అంత లాభం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే నష్టపోయింది. ఇన్ని లాభాలుండి ఇన్ని ఆస్తులు ఉన్న ఎల్ఐసీ షేర్ నష్టపోతోంది. కానీ అసలు కంపెనీ విలువ కంటే ఎన్నో రెట్లు షేర్ మార్కెట్ వాల్యూ ఉన్న అదానీ కంపెనీలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ అదానీ కంపెనీల్లో అత్యధికంగా ఉన్నది ఎల్ఐసీ సొమ్మే. ఇది షేర్ మార్కెట్ మాయాజాలమని అనుకోవాలా ? పెద్దలు ఏదైనా చేయగలరని నిట్టూర్చాలా ? రేపు అదానీ కంపెనీల షేర్ పడిపోతే ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన వారు మట్టికొట్టుకుపోతారని బాధపడాలా ?

గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచ బిలియనీర్లలో ఒకరు. అంబానీని కూడా దాటిపోయారు. రిలయన్స్ సామ్రాజ్యం మన కళ్ల ముందే ఉంది. మన రోజువారీ జీవితంలో రిలయన్స్ వారి సేవలు వస్తువులు వాడుతూనే ఉంటాం. మన జీవితంలోకి చొచ్చుకొచ్చేసింది కాబట్టి రిలయన్స్‌ ఓనరే ముఖేష్ అంబానీకి బిలియనీర్ల కేటగిరిలో చోటు దక్కడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ మరి అదానీ అంబానీని మించి బిలియనీర్ కేటగిరిలోకి ఎలా వెళ్లాడు..? అదే షేర్ మార్కెట్ మాయాజాలం. అదానీ ఇటీవలి కాలంలో ఎడాపెడా పోర్టుల్ని, ఎయిర్ పోర్టుల్ని కొనేస్తున్నారు. అంత డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని చాలా మందికి సందేహం. ఆ డబ్బుల్లో ఎక్కువగా బ్యాంకుల నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా ఎల్ఐసీ నుంచి కూడా వస్తున్నాయి. పోటీ పడి అదానీకి బ్యాంకులు, ఎల్ఐసీ డబ్బులు పంపిణీ చేస్తున్నాయి.

గౌతమ్‌ అదానీ గ్రూప్‌లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే 87,380 కోట్ రూపాయల పెట్టుబడి పెట్టింది. ఏడాది క్రితం ఈ మొత్తం 32,100 కోట్లు మాత్రమే. ఇప్పుడు అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ వాటా మూడింతలైంది. దేశంలో ఉన్న మొత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌ అన్నీ అదానీ కంపెనీల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌కంటే జీవిత బీమా దిగ్గజం పెట్టుబడులు 4.9 రెట్లు అధికం. గ్రూప్‌ విలువను 1 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని తపన పడుతున్న గౌతమ్‌ అదానీకి స్వయానా ప్రభుత్వ రంగ సంస్థే పెట్టుబడుల ద్వారా భారీ మద్దతును అందిస్తున్నది. ట్రేడింగ్‌ కంపెనీగా నడిచే అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ గత ఎనిమిదేళ్ల కాలంలోనే ఎదిగింది. రూప్‌ రేవులు, విమానాశ్రాయాలు, విద్యుత్‌ ప్రాజెక్టుల్ని వరుసపెట్టి టేకోవర్‌ చేస్తూ ఏడు లిస్టెడ్‌ కంపెనీలుగా విస్తరించింది. వాటి షేర్లు పరుగులు పెడుతున్నాయి.

అదానీ షేర్లు పరుగులు పెట్టడానికి ఎల్ఐసీ కూడా ఓ కారణం. ఎందుకంటే ఎల్‌ఐసీ మొత్తం ఏడు అదానీ లిస్టెడ్‌ కంపెనీల్లో ఐదు కంపెనీల షేర్లను పెద్ద ఎత్తున స్టాక్‌ మార్కెట్లో కొంటున్నది. ఈ కొనుగోళ్ల ప్రభావంతో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ కంపెనీలో బీమా సంస్థ వాటా 10 శాతాన్ని మించిపోయింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ రేట్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్‌ షేర్లను విక్రయిస్తుంటే ఎల్‌ఐసీ కొనుగోలు చేస్తున్నది. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు వాటి పోటీ వ్యాపార కంపెనీలతో పోలిస్తే అత్యధిక విలువపై ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు విద్యుదుత్పాక సంస్థ అదానీ గ్రీన్‌ లాభంతో పోలిస్తే షేరు ధర 1,109 రెట్లు ఉంది. అదానీ గ్రూప్‌ షేరు విలువలను వాటి ఫండమెంటల్స్‌ రీత్యా అనూహ్యమైనవని, కొనదగ్గవి కాదని ఫండ్‌ మేనేజర్లు చెబుతూంటారు.

ఎల్ఐసీ ప్రతి త్రైమాసికంలోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ లో తన పెట్టుబడులను పెంచుతోంది. అయితే పాలసీదారుల ప్రయోజనాల దృష్ట్యా ఎల్ఐసీ ఈక్విటీ పెట్టుబడులు పారదర్శకంగా ఉండాలని అయితే అదానీ స్టాక్‌లలో ఈ పెట్టుబడులు ఆ సూత్రానికి విరుద్ధంగా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టులో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అదానీ గ్రూప్ అనేక వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడులు పెట్టడంపై ఒక రిపోర్ట్ అందించింది. ఇది కంపెనీపై రుణాల భారాన్ని పెంచుతోందని అభిప్రాయపడింది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అదానీ గ్రూప్ అప్పుల ఊబిలో కూరుకుపోయి డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని క్రెడిట్‌సైట్స్ అప్పట్లో తన నివేదికలో పేర్కొంది. అదే జరిగితే ముందుగా నష్టపోయేది ఎల్ఐసీనే. అంటే పాలసీలు కట్టిన వాళ్లే.

అదానీ గ్రూప్ సామ్రాజ్యం అంతా ఉత్పత్తి, లాభాల మీద కాకుండా కేవలం షేర్ల మీద పెరుగుతోంది. కానీ ఎల్ఐసీ మాత్రం ఆస్తులు, లాభాల ప్రతిపాదికగా విలువైనది. కానీ ఎల్ఐసీ సొమ్మునే పెట్టుబడిగా తీసుకుంటూ అదానీ పెరిగిపోతోంది. ఎల్ఐసీ మాత్రం తగ్గిపోతోంది.