ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్ స్టర్ హతం అనే మాట ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి 180 సార్లు వినిపించింది. విచిత్రంగా మాజీ ఎంపీ కూడా అయిన డాన్ అతిక్ ఆష్రఫ్ ఆయన సోదరుడ్ని మాత్రం పోలీసులు చంపలేదు. కానీ పోలీసులు ప్రణాళిక ప్రకారం హత్య చేయించారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇది యూపీలో కొత్తగా ప్రారంభమైన సంస్కృతి అనుకోవచ్చు. పోలీసులు ఎన్ కౌంటర్ చేశారా లేకపోతే ఇతర క్రిమినల్స్‌తో చంపించారా అన్న విషయం పక్కన పెడితే ఇలా మనుషుల ప్రాణాల్ని తీయడం సమంజసమేనా అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇలా చంపుకుంటూ ఆ క్రిమినల్స్ కు ప్రభుత్వ పెద్దలకు తేడా ఏముంటుందని ఎక్కువ మంది అభిప్రాయం. చట్టాలతో పని ఏముందని న్యాయవ్యవస్థ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వారి ఆందోళనలోనూ వాస్తవం ఉంది.
యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్‌ల ఎన్‌కౌంటర్‌లు పెరిగాయి. ఈ ఆరేళ్లలో 183 మంది క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ చేశారు. యి. ఈ ఎన్‌కౌంటర్‌లలో చనిపోయిన వాళ్లంతా బడా క్రిమినల్సే. 13 రోజులకో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. 23,069 మంది అరెస్ట్ అయ్యారు. 2017 మార్చి 20 నుంచి 2023 మార్చి 6 మధ్య కాలంలో ఈ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వీటిలో 15 మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 2017లో 28 మంది 2018లో 41 మంది, 2019లో 34 మంది 2020లో 26 మంది 2021లో 26 మంది క్రిమినల్స్ పోలీసుల చేతుల్లో ప్రాణాలొదిలారు. ఇకపైనా ఇదే దూకుడుతో ఉండాలని పోలీసులకు చెప్పారు యోగి ఆదిత్యనాథ్. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త డాన్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. దీంతో మాఫియాను మట్టిలో కలిపేస్తానని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మాఫియా డాన్‌లకు ఈ వార్నింగ్ ఇచ్చారు. అలా వార్నింగ్ ఇచ్చిన 50 రోజుల్లోనే మూడు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి బెదిరింపులు హత్యలు లాంటివి చేస్తే కాల్చి పారేస్తాం అని గన్‌తోనే సమాధానమిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకూ దాదాపు 183 మందిని ఎన్‌కౌంటర్ చేశారు యూపీ పోలీసులు. ఇందులో అన్ని మతాల వాళ్లూ ఉన్నారు. పోలీసులు ఎన్ కౌంటర్ చేయాడనికి నేర చరితనే కారణంగా చూశారు కానీ ఇతర అంశాలు చూడలేదు.
ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు చాలా పెద్ద సమస్య. రాజకీయ పార్టీల నేరగాళ్లతో కుమ్మక్కయి పోయి అధికారంలో ఉన్నప్పుడు వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అధికారం అండతో వారు నేర కార్యకలాపాలు ఇష్టం వచ్చినట్లుగా పెంచుకుంటూ పోయారు. ఎస్పీ బీఎస్పీ లాంటి పార్టీల్లో మాఫియా డాన్లు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇలా యూపీ రాజకీయాల్లో పడుగూ పేకల్లా పేరుకుపోయిన నేరస్తుల్ని ఏరివేయడం చిన్న విషయం కాదు. యోగి ఆదిత్యనాథ్ సాధువు. ఆయన ఇంత కఠినంగా ఉంటారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన మాత్రం తన రాష్ట్రంలో ప్రజలకు శాంతి భద్రతలను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముందుగా హెచ్చరికలు జారీ చేశారు మారిన వాళ్లు మారారు మారని వాళ్లను మార్చేశారు. ఇప్పుడు మాజీ ఎంపీ అతీక్ హత్య వరకూ చాలా జరిగాయి. అతీక్ హత్యను కూడా మరోసారి ఎన్కౌంటర్లు హత్యలు చేయాల్సిన అవసరం లేకుండా గ్యాంగ్ స్టర్ అనే వాడికి భయం పుట్టేలా అందరి ముందు మీడియా కెమెరాల ఎదుట చంపేలా ప్లాన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజం కావొచ్చు కూడా. ఏదైనప్పటికీ అనేక వర్గాల నుంచి విమర్శలు వస్తాయని తెలిసి కూడా ఆదిత్యనాథ్ సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
యూపీలో జరిగిన ఏ ఒక్క ఎన్ కౌంటర్ కానీ రౌడీ షీటర్ల హత్యలు కానీ పూర్తి స్క్రిప్టెడ్ అందులో డౌట్ లేదు. ఆయితే ఇలాంటి ఎన్ కౌంటర్లపై మానవహక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది కానీ సామాన్య ప్రజల నుంచి మాత్రం ఎలాంటి వ్యతిరేకత రావట్లేదు. పైగా ప్రజల నుంచి సపోర్ట్ లభిస్తోంది ఎందుకంటే వారిని భయపెట్టి ప్రశాంత జీవనం లేకుండా చేసే వారిని తమ చుట్టూలేకుండా చేశారనే సంతృప్తి వారికి ఉంటుంది. ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికి స్థానిక ప్రజల ప్రశంసలు మాత్రం పొందుతోంది. అతీక్ హత్య విషయంలోనూ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అది యోగి ప్రభుత్వమే ప్లాన్డ్ గా చేయించిందని పాత నేరస్తులతో ఈ పని చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ నేరస్తులు ప్రజల్లోఅంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వారు చనిపోయినా ఎవరూ సానుభూతి తెలిపే పరిస్థితి లేదు.
ప్రజలు మద్దతుగా ఉంటున్నారని ఇలా తప్పు చేసినప్రతి ఒక్కరికీ ఇన్ స్టంట్ శిక్షలు విధిస్తూ పోతే ఇక చట్టం న్యాయం ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు అనే ప్రశ్న వస్తోంది. హైదరాబాద్‌లో దిశ ఘటన జరిగినప్పుడు నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడమో తక్షణం ఉరి తీయడమో లేకపోతే మరొకటో చేయాలని డిమాండ్ చేశారు దీని కోసం పోలీసుల్ని చట్టాలు ఉల్లంఘించమని కూడా సలహాలు ఇచ్చారు యూపీలోనూ అదే జరుగుతోంది. ఇదెంత ప్రమాదకరమైన సలహానో ఎవరూ ఊహించడం లేదు. ఈ పరిస్థితినే పోలీసులు రేపు అమాయకుల్ని వధించడానికి వేధించడానికి వాడుకునే ప్రమాదం ఉంది. రాజకీయ నాయుకుల రాజకీయ ప్రత్యర్థుల్ని హతమార్చడానికి వాడుకోరనే గ్యారంటీలేదు. కుక్కను చంపేముందు పిచ్చిది అనే ముద్ర వేసినట్లుగా ఇలా టార్గెటెడ్ నేతల్ని చంపే ముందు నేరస్తుడనే ముద్ర వేసి పని పూర్తి చేస్తారు రాజకీయం ఇప్పుడు అంతా నేరగాళ్ల మయం. ఇప్పుడు ఆ రాజకీయం నుంచి నేరగాళ్లను వేరు చేస్తానని సుప్రీంకోర్టు కంకణం కట్టుకుంటే ఆ వ్యవస్థ ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే కొన్ని అంశాల్లో వ్యతిరేక తీర్పులు చెప్పినందుకే న్యాయవ్యవస్థ విశ్వసనీయతపైనే గురి పెట్టిన ఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి ఇక పోలీసులు ఎంత. అధికారంలో ఉన్న వారు అనుగ్రహిస్తేనే పోస్టింగ్‌లు మరి వారు చెప్పినట్లు చేయకుండా ఉంటారా తమకు పోస్టింగ్‌లు ఇచ్చే వారి పిల్లలు నేరాలు చేస్తే కేసులు పెట్టగలరా అంటే అన్ని వ్యవస్థలు పూర్తిగా నేరగాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయన్నమాట. ఇంత కన్నా పతనం ఇంకెక్కడా ఉండదు. ప్రస్తుతం ఇదే ప్రమాదం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏదైనా చట్ట ప్రకారమే జరగాలి. చట్టబద్దంగానే నిందితులకు శిక్ష విధించాల్సి ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఈ పని పూర్తి చేయాలి. దాని ద్వారా మరోసారి ఇలాంటి నేరం చేయాలంటే భయం కలిగేలా చేయాలి దానికి చట్టం న్యాయమే సరైన మార్గం.
మన దేశంలో చట్టాలు కఠినంగా ఉన్నాయి. కానీ అమలు చేయడమే కష్టంగా మారింది. చట్టాలు అమలు చేసే వ్యవస్థల్ని స్వేచ్చగా పని చేసే అవకాశం ఇస్తే శాంతిభద్రతలకు ఢోకా ఉండదు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షకు గురవుతారనే భయం ఉంటే నేరాలూ ఉండవు. కానీ వ్యవస్థల్నీ రాజకీయం కుళ్లించేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఎన్ కౌంటర్ల ద్వారా ఆ సమస్యను మరింత పెంచుతున్నారు కానీ పరిష్కారం చూపడం లేదు. అన్నింటికీ పరిష్కారం సత్వర శిక్షలు బాధితులకు న్యాయం అందేలా వ్యవస్థలన్నింటికీ స్వేచ్చ ఇవ్వడమే. కానీ అది మన దేశంలో సాధ్యమేనా.