కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఏడాది డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లొచ్చని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటన రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆమెకు ఈ అనుమానం ఎందుకు వచ్చిoదంటే.. ప్రచారం కోసం ఇప్పటికే బీజేపీ హెలికాప్టర్లన్నీ బుక్ చేసుకుందట. మమతా బెనర్జీ చెప్పిన కారణం అదే కావొచ్చు కానీ.. ఈసీ చేపట్టిన సన్నాహాలు.. రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇస్తున్న తాయిలాలు వంటివి చూస్తే.. మోదీ , షాలు కూడా డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్లాలని ఫిక్సయ్యారా అన్న సందేహాలకు బలం చేకూరుతుంది.
ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా అనూహ్యంగా ఎత్తుగడలు వేసి .. ఎన్నికలకు వెళ్లిపోవాలనేది అన్ని అధికార రాజకీయ పార్టీలు ఉపయోగించే వ్యూహం. బీజేపీ కూడా అదే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభను రద్దుచేసి డిసెంబర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ముందుస్తుకు వెళ్తున్నదన్నదానికి గట్టి సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయని, ఊహించిన దానికి భిన్నంగా అక్కడి తీర్పు రావడంతో ఆ ప్రభావం ఎక్కడి వరకు వెళ్తుందోనని బీజేపీలో టెన్షన్ మొదలైందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకే కేంద్రం ముందుస్తు ఆలోచన చేస్తున్నదని, కర్ణాటల ఫలితాల ఎఫెక్ట్ డిసెంబర్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడితే కమలం పార్టీకి నష్టం జరుగుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం దాని ఎఫెక్ట్ ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్టు విశ్లేషణలు ఇప్పటికే వినిపించాయి.
అక్టోబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిపికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మీజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 2024లో జరగాల్సి ఉన్నది.పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు వస్తాయని మళ్లీ విస్త్రతమైన చర్చ ప్రారంభమయింది. బీజేపీని ప్రక్షాళన చేయడం, కేంద్ర మంత్రి వర్గ విస్తరణను చేయనుండటం మాత్రమే ఎన్డీఏను కూడా బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కొత్త పార్టీలను చేర్చుకుంటున్నారు. అందుకే మందస్తుకు మోదీ కూడా రెడీ అయ్యారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో ప్రారంభమయ్యాయి. డిసెండర్‌లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఒక్క రాజస్థాన్ లో మాత్రమే బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చిన తర్వాత మూడు నెలల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ మార్చిమొదటి వారంలోనే ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే.. సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన బీజేపీ వర్గాల్లో ఉంది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత మోదీ అజేయుడు కాదన్న అభిప్రాయాన్ని విపక్ష పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతే… మోదీ మానియా అనేది అసలు లేదన్న అభిప్రాయం అంతటా వ్యాపిస్తుంది.
మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌తో బీజేపీ ముఖాముఖి పోరాడుతోంది. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంది. కానీ అక్కడ ఇటీవల పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ముఖాముఖి పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇప్పటికే కర్ణాటక ఇచ్చిన ఊపు ఉంది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కూడా బలం పెంచుకుంటున్నాయి. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ సంప్రదాయంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ పుంజుకుని.. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా.. అండగా నిలిస్తే.. బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. పైగా ఇటీవల ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా మారుతున్నాయి. ఈ కూటమిపై బీజేపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారని వారి ప్రకటనలను బట్టి అర్థమవుతుంది. నిజానకి ఈ కూటమి ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. నేతలంటూ ఎవరూ లేరు. నితీష్ కుమార్ నాయకత్వం వహించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు కుదురుకోకుండానే… ఎన్నికలకు వెళ్తే మంతచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా డిల్లీలో ప్రచారం జరుగుతోంది.
ప్రతిపక్ష కూటమి ఏకం కావడం అంత తేలిక కాదు. రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ఓ క్లిష్టమైన ప్రక్రియ… వాటి గోలలో అవి ఉండగానే ఎన్నికల ప్రక్రియను ముగించాలన్న అలోచనను బీజేపీ అమలు చేస్తోందన్న వాదన ప్రారంభమయింది.
బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను అంచనా వేసుకుని.. సిద్ధాంతాల ప్రాతిపదికగా అందరూ ఒకే వేదికపైకి రావడానికి కొంత సమయం పడుతుంది. పట్నా, బెంగళూరలో సమావేశాలు జరిగాయి. ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి పూర్తి స్థాయిలో సమన్వయం సాధించక ముందే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీ చేస్తున్నట్లు సమాచారం. అలా చేయడం వల్ల ఎవరికి వారు పోటీ చేసి.. ఓట్లు చీలిపోయి.. లాభం పొందుతామని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నిధుల సమస్య పట్టి పీడిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేసులోకి వచ్చినట్లు అనిపిస్తే.. ఆ పార్టీకి విరాళాలు వస్తాయి. ఇది బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టే అంశమే. అందుకే.. ఎన్నికల ఖర్చులు తగ్గించడానికి జమిలీ ఎన్నికలకు వెళ్తున్నామని.. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్నామని బీజేపీ చెప్పుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒక సారి జరిగితే బీజేపీకి అడ్వాంటేజ్ లభిస్తుంది. రాష్ట్రాల్లో ఉన్న వ్యతిరేకత.. మోదీ హవాతో కలిసిపోతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే బీజేపీకి కలసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజల్లో మోడీ పట్ల ఆదరణ ఉందని, జమిలి ఎన్నికలు జరిగితే అటు లోకసభ, ఇటు అసెంబ్లీ సీట్లు బీజేపీకే పడతాయని అనుకుంటున్నారు. మోడీ ప్రభావం ఎక్కువగా ఉంటే పోతాయనుకునే అసెంబ్లీ ఎన్నికల్లోన కూడా విజయం సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.
బీజేపీ డిసెంబర్ లో ఎన్నికల ఆలోచనలు చేస్తుందనడానికి మరో కారణం ప్రజలకు తాయిలాల ప్రకటన. సామాన్య ప్రజల్లో కేంద్రంపై ఆగ్రహం ఉంది. దానికి కారణం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల. అందుకే ఇప్పటికిప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్ బండను రెండు వందల వరకూ తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రేపోమాపో తగ్గించబోతున్నారు. ఇప్పటికే పది లక్షల ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. అన్ని లోక్ సభ నియోజకవర్గాలకూ రిటర్నింగ్ ఆఫీసర్లను గుర్తించడం కూడా చేసింది. ప్రస్తుతం ఓటరు జాబితాలను సవరిస్తున్నారు. అన్నీ డిసెంబర్ ఎన్నికల కోసమే అన్నట్లుగా ఈసీ కూడా వేగంగా పనులు చక్కబెడుతోంది.
జీ 20 సదస్సును కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సమావేశం అయిపోయిన తర్వాత.. డిసెంబర్ ఎన్నికల కోసం ప్రత్యక్ష నిర్ణయాలుతీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఏదైతే అయి అయిందనుకుని ఆగిపోతే మాత్రం … ఏప్రిల్ లోనే ఎన్నికలు జరుగుతాయి.
మూడో సారి అధికారాన్ని పొందడం ఎంత క్లిష్టమైన విషయమో.. మోదీ, అమిత్ షాలకు తెలియనిది కాదు.కానీ గుజరాత్ వారు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ అదే చేస్తున్నారని అనుకోవచ్చు. ఏ నిర్ణయం తీసుకుంటారనేది.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…