ఖర్గే పిచ్చి వ్యాఖ్యలు.. బీజేపీ కుప్పిగంతులు.

By KTV Telugu On 20 December, 2022
image

కొంతమంది తొందరపాటులో నోరుజారతారు. ఏదో అనబోయి ఇంకేదో అంటారు. కొందరు మాత్రం పక్కాగా అనాలనుకుంది అనేస్తారు. కావాలనే అన్నానని మొండికేస్తారు. అలాంటి మొండిఘటాల్లోకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కూడా వస్తారు. గాంధీల కుటుంబంనుంచి కాంగ్రెస్‌ అధ్యక్షపగ్గాలు తీసుకున్న ఖర్గే తన ముద్రకోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీని గట్టెక్కించడం గెలుపు గుర్రం ఎక్కించడం వంటివి పెద్ద లక్ష్యాలు. కానీ పరుషపదాలు వాడేయొచ్చు గిల్లికజ్జాలు పెట్టుకోవచ్చు. ఖర్గే ఇప్పుడదే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. స్వాతంత్య్ర పోరాటంలో ఎవరి పాత్ర ఎంతనే చర్చ మొదలుపెడితే అంతం అనేదే ఉండదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు చెప్పుకోవచ్చు. కానీ బీజేపీమీద దుమ్మెత్తిపోసే క్రమంలో ఖర్గే మాటతూలారు. రాజస్థాన్‌ అల్వార్‌లో జరిగిన భారత్‌ జోడో ర్యాలీలో దేశం కోసం కాంగ్రెస్‌ ఎంతో చేసిందని చెప్పారు. ఎందరో నేతలు ప్రాణత్యాగాలు చేసినా, బీజేపీ కనీసం దేశంకోసం ఓ కుక్కని కూడా కోల్పోలేదని పరుషంగా మాట్లాడారు.

అయినా దేశభక్తులమని చెప్పుకుంటారని ప్రశ్నించినవారిపై దేశద్రోహులనే ముద్రవేస్తారనేది ఖర్గే ఆరోపణ. విమర్శలు చేయొచ్చుకానీ శునకం అనే మాటే బీజేపీకి బీపీ పెంచింది. మల్లికార్జునఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సారీ చెప్పే ప్రసక్తే లేదని మల్లికార్జునఖర్గే మొండికేశారు. దీంతో సభాపర్వానికి అంతరాయం కలిగింది. సభ బయటచేసిన వ్యాఖ్యలపై సభలో క్షమాపణకు రచ్చచేయడం బీజేపీ సభ్యులకు కూడా తగదు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ దన్‌ఖడ్‌ కూడా అందుకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నడిచే తీరుతో ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. దేశరక్షణకు సంబంధించిన వ్యవహారాలను చర్చించేందుకు కేంద్రం ఇష్టపడటం లేదు. చైనా దూకుడుపై సభలో సమగ్రమైన చర్చే జరగలేదు. కానీ ఖర్గే ఏదో వాగాడని అక్కడెవడో తుమ్మాడని చట్టసభల్లో అల్లరిచేస్తే జనం హర్షించరు.