ప్రధాని మోదీ ఓ విషనాగు.. మల్లికార్జున ఖర్గే

By KTV Telugu On 29 April, 2023
image

కన్నడ ఎన్నికల ప్రచారం రసకందాయంగా సాగుతోంది. రోజులు గడుస్తోన్న కొద్దీ ఎన్నికల వేడి సెగలు కక్కేస్తోంది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ విద్వేషాలు వెళ్లగక్కేస్తున్నారు. ఓటర్లకు గేలం వేసేందుకు వారిని తమ వైపు తిప్పుకునేందుకు రెండు జాతీయ పార్టీలూ దేనికీ వెనుకాడ్డం లేదు. ఈ క్రమంలో ఉచితానుచితాలు కూడా మర్చిపోయి హుందాతనాన్ని పక్కన పెట్టేసి నోరెట్టుకుని పడిపోతున్నారు. నలుగురూ ఏవగించుకుంటున్నారన్న స్పృహ కూడా ఉండడం లేదని రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే నోరు జారారు. ఖర్గేనే దూకుడుగా మాట్లాడేసరికి అంతా ఆశ్చర్యపోయారు. యువ నేతలు హుషారుగా కేరింతలు కొట్టారు. బిజెపి నేతలు అయితే ఖర్గేపై నిప్పులు చెరిగారు. విమర్శలు పెరుగుతున్నాయని గ్రహించిన ఖర్గే అబ్బే నా ఉద్దేశం అది కాదు. నేను మోదీని ఉద్దేశించి ఆ మాట అనలేదు బిజెపిని దృష్టిలో పెట్టుకునే అలా అన్నాను అన్నారు. అయినా క్షమాపణ కోరుతున్నా అని చెప్పేశారు.

ఇంతకీ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని ఏమన్నారంటే ప్రధాని నరేంద్ర మోదీ ఒక విషనాగు లాంటి వారు అన్నారు. నాగు పాము విషాన్ని ఒక్క చుక్కని మింగినా అమాంతం ప్రాణాలు పోతాయని అన్నారు. మల్లి కార్జున ఖర్గే ఇలా అనేసరికి బిజెపి వర్గాలు మండి పడ్డాయి. నోటికి ఎంతొస్తే అంతా అనేయడమేనా హద్దూ అదుపూ ఉండద్దా అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ బిజెపి ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ దీనికి కౌంటర్ ఇచ్చారు. అసలు సోనియా గాంధీయే విషకన్య అని పాటిల్ విమర్శించారు. బిజెపి నేతల నుంచే కాదు ఇతర వర్గాల నుంచి కూడా ఖర్గే వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. కుర్రాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏదో ఆవేశంలో చేశారులే అని సద్దుకోవచ్చు కానీ ఎనిమిది పదులు దాటిన రాజకీయ కురువృద్ధుడు మల్లికార్జున ఖర్గేయే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసే మల్లి కార్జున ఖర్గే ఓసారి నాలిక్కర్చుకుని సారీ చెప్పేశారు. ఖర్గే చేసిన మంచి పని ఏంటంటే వెంటనే తప్పును సరిదిద్దుకుని క్షమాపణలు కోరడం. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్ప అన్నట్లు ఖర్గే చేసిన తప్పు నుండి బయట పడ్డారు. పాప నిష్కృతి అయిపోయింది.

2019 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ సభలో దొంగల ఇంటిపేర్లు మోదీ అనే ఎందుకు ఉంటాయో అని వివాదస్పద వ్యాఖ్య చేసి కేసులో ఇరుక్కున్నారు. దానిపైనే నాలుగేళ్ల తర్వాత ఈ మధ్యనే సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా ప్రకటించింది. ఆ తీర్పుతోనే రాహుల్ లోక్ సభ సభ్యత్వంపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. నిన్న కాక మొన్ననే రాహుల్ గాంధీ తన అధికార నివాసాన్ని కూడా ఉద్వేగ భరితంగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇపుడు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లీ మోదీనే కించపరిచే వ్యాఖ్య చేశారు. అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే ఎలాగ అని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్-బిజెపిలు ఒకరిపై ఒకరు ఇలా విషం చిమ్ముకోవడం రాజకీయాల్లో పడిపోతోన్న విలువలకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకరిపై ఒకరికి ఇంత కసి ఉండడానికి కారణాలు లేకపోలేదు. కర్నాటక ఎన్నికలను రెండు జాతీయ పార్టీలూ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన అవసరం రెండు పార్టీలకూ సమానంగా ఉంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటితే ఈ ఏడాదిలో జరగనున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆ ఊపు పనికొస్తుంది. అందుకే కాంగ్రెస్ బిజెపి నాయకత్వాలు కర్నాటకలో సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

సర్వేలేమో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉందని చెబుతున్నాయి. అంత మాత్రాన కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పడం లేదు. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందనే సర్వేలు చెబుతున్నాయి. కాకపోతే నెల రోజుల వ్యవధిలో జరిపిన రెండు సర్వేల్లో బిజెపి 3 శాతం ఓట్లు కోల్పోగా కాంగ్రెస్ మూడు శాతం ఓట్లు పెంచుకోగలిగింది. ఇంకా తటస్థంగా ఉన్న ఓటర్లు ఎన్నికల నాటికి తమవైపే మొగ్గు చూపుతారని కాంగ్రెస్ చాలా ధీమాగా ఉంది. బిజెపి దేన్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. ఎంత చిన్న ఎన్నిక అయినా దాన్ని పెద్ద యుద్ధంగానే భావిస్తారు కమలనాధులు. కర్నాటలో బిజెపి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ఫార్టీ పెర్సెంట్ కమిషన్ ఇవ్వాలంటూ ప్రచారం జరగడం బిజెపి ఇమేజ్ ని దెబ్బతీశాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కొందరు సీనియర్లకు కూడా బిజెపి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. అయితే అంత మాత్రాన బిజెపి ఇమేజ్ పెరగదు కదా అంటున్నారు రాజకీయ పండితులు. బిజెపిపై ఉన్న వ్యతిరేకతనే తన బలంగా భావిస్తోంది కాంగ్రెస్. బిజెపిలో టికెట్లు రాని వాళ్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. నిన్నటి దాకా ఆ నేతలను అవినీతి పరులని తిట్టిపోసిన కాంగ్రెస్ ఇపుడు వారిని కళ్లకు అద్దుకుని తమ పార్టీలో చేర్చుకుంది.

బిజెపి లానే కాంగ్రెస్ కూడా వాషింగ్ పౌడర్ నిర్మా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిందంటున్నారు పొలిటికల్ సెటైరిస్టులు. ఇంత కసి ఉంది కాబట్టే  మాటలతో విరుచుకు పడిపోతున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా మాటలు విసిరేయడం వెనక విజయం ఎంత అవసరమో చెప్పకనే చెబుతున్నారు. అయితే ఇటువంటి వ్యాఖ్యలు పార్టీలపై ఏవగింపు కలిగిస్తాయే తప్ప ఓట్లు రాల్చవని తెలుసుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లో అత్యంత కీలకమైనది ప్రచార ఘట్టమే. అది ఎంత సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తే విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని అంటారు. వందేళ్లు పైబడిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలూ కొత్త కాదు ప్రచారాలూ కొత్త కాదు. బిజెపి కాస్త లేట్ గా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఉండచ్చు కానీ ఆలోచనలు మాత్రం లేటెస్ట్ గానే ఉంటాయి. ఎన్నికల్లో ప్రతీ ఘట్టాన్నీ సైంటిఫిక్ గా ఒక పథకం ప్రకారం పక్కా వ్యూహంతో అమలు చేసుకుంటూ పోతారు కమలనాథులు. పరిస్థితులు తమకి అనుకూలంగా లేవని బిజెపికి తెలుసు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని కూడా తెలుసు. అంత మాత్రాన బిజెపి డీలా పడిపోవడం లేదు. పార్టీ ప్రచారాన్ని ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 29న రంగంలోకి దిగుతున్నారు. ఇంచుమించు వారం రోజుల పాటు మోదీ కర్నాటకలోనే ఉండి విస్తృతంగా ప్రచారం చేస్తారు. భారీ ర్యాలీల్లో పాల్గొంటారు.

మోదీ ప్రచారంతోనే పార్టీపట్ల ఉన్న వ్యతిరేకత మాయమైపోతుందని కమలనాధులు నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున ఇప్పటికే కన్నడ సినీ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కిచ్చాకు కన్నడ నాట అన్ని వర్గాల్లోనూ తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. యూత్ అయితే  కిచ్చా కోసం చొక్కాలు చింపేసుకుంటారు. కిచ్చాతో పాటు మరో కన్నడ అగ్రనటుడు దర్శన్ కూడా ప్రచార బరిలో దూకబోతున్నారు. ఇద్దరి సభలకూ జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అంచనాలు ఉన్నాయి. అయితే వచ్చిన వారంతా ఓట్లు వేస్తారా లేదా అన్నదే ప్రశ్న అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే సినిమా నటులకు జనాకర్షణ అద్భుతంగా ఉంటుంది కానీ వారి సభలకు వెళ్లే వారంతా వాళ్లకి ఓటు వేసిన దాఖలాలు లేవంటున్నారు రాజకీయ పండితులు.
కాంగ్రెస్ బిజెపిలు పోటా పోటీగా ప్రచారం చేసుకుపోతున్నాయి. తమకి పూర్తి మెజారిటీ రాకుండా అతి పెద్ద పార్టీగా అవతరిస్తే జేడీఎస్ మద్దతు కూడగట్టుకోవాలని కాంగ్రెస్ కు తెలుసు. అందుకే జేడీఎస్ పై ఎలాంటి విమర్శలూ చేయడం లేదు కాంగ్రెస్ నేతలు. కేవలం బిజెపి పైనే దాడులు చేస్తున్నారు. దీన్ని గమనించిన బిజెపి తన ప్రచారంలో  కాంగ్రెస్ -జేడీఎస్ లను ఏకి పారేస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వాటిని గెలిపిస్తే కర్నాటక వెనకబడిపోతుందని బిజెపి ప్రచారం చేస్తోంది. తమ కోటా సీట్లు తమకి వస్తే చాలునని జేడీఎస్ భావిస్తోంది. 35 నుండి 40 స్థానాలు గెలవగలిగితే ప్రభుత్వంలో ఎవరుండాలనేది నిర్ణయించేది తామేనని జేడీఎస్ ధీమాగా ఉంది.