ఉద్యోగుల‌కు ఆశ ఉండాలి అత్యాశ కాదు.. త‌ల నరికినా డీఏలు అల‌వెన్సులు ఇవ్వ‌ను

By KTV Telugu On 8 March, 2023
image

ఉద్యోగులు, ప్ర‌భుత్వం మ‌ధ్య ఎప్పుడూ సుహృద్భావ వాతావ‌ర‌ణం ఉండాలి. ప్ర‌భుత్వ పాల‌న‌ని ప‌ట్టాలెక్కించాల్సింది ఉద్యోగులే. వారు అసంతృప్తితో ఉన్నా స‌హాయ నిరాక‌ర‌ణ చేసినా పాల‌న గాడి త‌ప్పుతుంది. అదే స‌మ‌యంలో ఉద్యోగుల‌కు నియ‌మావ‌ళి ఒక‌టి ఉంటుంది. స‌ర్వీస్ రూల్స్‌ని ధిక్క‌రించ‌కూడ‌దు. త‌మ ప‌రిధి మించి వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరుకుంటున్నారు. ప్ర‌భుత్వాలు దిగిరాక‌పోతే ఎంత‌దూర‌మైనా వెళ్తామ‌ని హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. ఏపీలో త‌ర‌చూ ఉద్యోగులు స‌మ్మెకు సిద్ధ‌మ‌న్న సంకేతాలిస్తున్నారు. మొన్న క‌ర్నాట‌క‌లోనూ ప్ర‌భుత్వం మెడ‌పై క‌త్తిపెట్టి ఎన్నిక‌ల వేళ ఉద్యోగులు త‌మ డిమాండ్ నెరవేర్చుకున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌లోనూ ఇప్పుడిదే జ‌రుగుతోంది. బెంగాల్ ఉద్యోగులు డీఏ పెంపుకోసం కొన్ని నెల‌లుగా పోరాడుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ పెంచ‌టంతో త‌మ‌కు కూడా పెంచాల‌న్న‌ది ప‌శ్చిమెంగాల్ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డిమాండ్‌. కానీ సీఎం సీట్లో ఉన్న‌ది ఫైర్‌బ్రాండ్ దీదీ. ఆమెని మెప్పించి ఒప్పించాలేగానీ ఇస్తావా చ‌స్తావా అంటే చచ్చినా ఇవ్వ‌న‌నే అంటుంది. వాస్త‌వానికి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టినుంచీ ఉద్యోగుల‌తో మ‌మ‌తాబెన‌ర్జీకి మంచి సంబంధాలే ఉన్నాయి. చ‌ర్చ‌ల‌కు రావాలంటే నేరుగా త‌న‌ద‌గ్గ‌రికే రావాల‌నే గ‌తంలోనే ఉద్యోగుల‌కు ఆఫ‌ర్ ఇచ్చారు బెంగాల్ ముఖ్య‌మంత్రి. దీంతో ఇప్ప‌టిదాకా ఉద్యోగ‌వ‌ర్గం దీదీతోనే ఉంది.

డీఏ పెంపుకోసం ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగ‌టంతో ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం అస‌హ‌నంతో ఉన్నారు. ఆమె ఎంత‌దూరం వెళ్లారంటే తన తల నరికినా సరే డీఏని మాత్రం పెంచేది లేదని తెగేసి చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న డీఏని పెంచేందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నిధుల‌కొర‌త ఉంది. ఇప్పుడు కేంద్రంతో స‌మానంగా డీఏ పెంచాల‌న్న డిమాండ్ స‌రైంది కాద‌న్న‌ది మ‌మ‌తాబెన‌ర్జీ వాద‌న‌. ఇటీవ‌లి బ‌డ్జెట్‌లో ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం అదనంగా మూడు శాతం డీఏ పెంపుని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నుంచి ఇది అమలవుతుంది. కానీ ఈ డీఏతో సంతృప్తిప‌డ‌ని ఉద్యోగులు నిర‌స‌న‌కు దిగారు. మ‌మ‌తా త‌న త‌ల‌నే న‌రుక్కోమ‌ని అన్నాక ఆమె మెడ‌పై క‌త్తిపెట్టినా పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు.