టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్. సాంకేతికంగా గుర్తింపు రాకపోయినా తమది జాతీయపార్టీ అన్న విషయాన్ని గులాబీనేతలు మర్చిపోకూడదు. జాతీయరాజకీయం అంటే జాతీయదృక్పథం ఉండాలి. ఇంకా ప్రాంతీయతత్వాలు, ఓ రాష్ట్ర ప్రయోజనాల గురించే పరిమితం కాకూడదు. తండ్రి జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పుతానంటుంటే కొడుకేమో రాష్ట్రాల మధ్య కేటాయింపుల గురించి ఇంకా భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు రాష్ట్రం తర్వాతే దేశం అన్నట్లుంది కేటీఆర్ కామెంట్స్ చూస్తుంటే.
బీఆర్ఎస్ జాతీయపార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగురాష్ట్రాల్లో పోటీచేయాలి. చెప్పుకోదగ్గ ఓట్లు సాధించాలి. మరో తెలుగురాష్ట్రం ఏపీపై కేసీఆర్ గురిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశావంటి రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీకి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ రాష్ట్రాల సమస్యలు, అవసరాలు బీఆర్ఎస్ ఎజెండాగా మారిపోవాలి. కానీ ఏపీకి కేంద్రంనుంచి అనుకూల ప్రకటనొకటి వచ్చినా కేసీఆర్ తనయుడు కేటీఆర్ భరించలేకపోతున్నారు.
తాజాగా కేంద్రం మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టులు కేటాయించింది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కూడా ఇందులో ఉంది. మొదట గుజరాత్ తోపాటు తెలంగాణకు బల్క్ డ్రగ్స్ పార్కులు ప్రకటించారని కేటాయింపుల దగ్గరికొచ్చేసరికి తెలంగాణను ఎత్తేసి ఏపీకి ఇచ్చారని కేటీఆర్ కన్నెర్ర చేస్తున్నారు. గుజరాత్‌కి కేంద్రం పెద్దపీట వేస్తోందని విమర్శిస్తే వేరేగా ఉండేది. కానీ ఏపీకి ఇవ్వడాన్ని హర్షించకపోవడంతో గులాబీపార్టీ జాతీయదృక్పథం మాటలకే పరిమితమవుతోంది.
ఏపీలోకూడా తమను ఆదరిస్తారని బీఆర్ఎస్ నమ్మకంతో ఉంది. ఆ నమ్మకం వాస్తవరూపం దాల్చాలంటే ఏపీని ఆడిపోసుకోవడం పూర్తిగా మానేయాలి. వైఎస్ షర్మిలను ఏపీకి వెళ్లి రాజకీయం చేసుకోమనటం సంకుచిత ఆలోచనే. రెండురాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ పట్టువిడుపులు ప్రదర్శిస్తే సమస్యలన్నీ కొలిక్కివస్తాయనే భావనతో ఆంధ్రప్రదేశ్ ఉంది. పార్టీ పేరులో తెలంగాణని తీసేశాక ప్రాంతీయ ప్రయోజనాల గురించే మాట్లాడితే ప్రజలు విశ్వసించరు.