బీజేపీకి అంత ఈజీ కాదు !

By KTV Telugu On 23 April, 2024
image

KTV TELUGU :-

మూడోసారి విజయం బీజేపీకి అంత సులువు కాదు. బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నట్లుగా.. సర్వేలలో వస్తున్నట్లుగా అంత ఈజీగా పరిస్థితులు లేవు, ఈ విషయాన్ని దేశంలో నెంబర్ వన్ సెఫాలజిస్టులుగా ఉన్న యాక్సిస్ మైండ్ ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తానే విశ్లేషించారు. రాష్ట్రాల వారీగా చూస్తే బీజేపీలోనూ కంగారు ఎక్కువగానే ఉందని అర్థమవుతుంది.

లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలన్న కమలనాథుల కల నెరవేరాలంటే యూపీ, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలను స్వీప్ చేయాలి.  అధికారంలోకి రావాలంటే అవసరమైన 270 స్థానాలకు ఈ రాష్ట్రాలే కీలకం కానున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యూపీలోని 80 స్థానాల్లో గెలుపోటములు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.  ఈ సారి యూపీలో గట్టిపోటీని ఎదుర్కోబోతున్నది.  అందుకే బీజేపీ ఆర్‌ఎల్‌డీని కలుపుకున్నది. గడిచిన మూడు నెలల కాలంలో వివిధ పార్టీల నుంచి 14 మంది ఎంపీలు, ఐదుగురు మాజీ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. చేరారు అనేకంటే చేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. కొంతమంది పార్టీలో చేరకముందే టికెట్‌ ఇచ్చింది

2019లో   గుజరాత్‌లో 26 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీకి ఈసారి కాంగ్రెస్‌-ఆప్‌ల కలయిక పెద్ద సవాల్‌గా మారింది.  గుజరాత్‌లోని 26 సీట్లలో కాంగ్రెస్‌ 24, ఆప్‌ 2 చోట్ల పోటీ చేస్తున్నది. గుజరాత్‌లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై కాంగ్రెస్‌-ఆప్‌లు దృష్టి పెట్టాయి. అక్కడ ఒకటి, రెండు తగ్గినా బీజేపీకి నష్టమే. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి క్లీన్‌స్వీప్‌ చేసింది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాజె ఎక్కువగా కనిపించడం లేదు. కాంగ్రెస్ కీలక నేతలు మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌తో పాటు సచిన్‌ పైలట్‌లు కాంగ్రెస్‌ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. బీజేపీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దేశవ్యాప్తంగా చిన్న పార్టీలను కలుపుకుని వెళ్తున్నట్టే కాంగ్రెస్‌ అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. దీంతో బీజేపీ గత ఎన్నికల్లో గెలిచిన చోట్ల ఇప్పుడు ఎదురీదాల్సి వస్తున్నది.

2019 ఎన్నికల్లో బీజేపీ 12 రాష్ట్రాల్లో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. బీహార్, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ. చత్తీస్‌గఢ్‌, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌. ఈ 12 రాష్ట్రాల్లో 320 సీట్లు ఉంటే.. అందులో 278 సీట్లు బీజేపీ హస్తగతం చేసుకుంది.  బీజేపీకి 303 సీట్లు దక్కాయి. అయితే అప్పుడు పుల్వామా అటాక్, విపక్షాలు వీక్‌గా ఉండటం.. విడివిడిగా పోటీ చేయడంలాంటి పరిణామాల కారణంగా.. ఇది సాధ్యమైంది. కానీ 2024 వచ్చే సరికి సీన్ మారిపోయింది. విపక్షాలన్ని కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. పుల్వామా లాంటి సీన్ ఇప్పుడు మిస్సవ్వుతుంది. కేవలం మోడీ ఫ్యాక్టర్‌ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది.   ఈ సారి బీజేపీ గతంలో వచ్చిన సీట్లు సాధించడమే కష్టంగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బిహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిషా. ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఇప్పుడు బీజేపీకి ఎదురు గాలులు వీస్తున్నాయి. అయితే ఈ ఆరు రాష్ట్రాల్లో 193 సీట్లు ఉన్నాయి. 2019లో ఈ ఆరు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. మిగతా ఐదు రాష్ట్రాల్లో కూడా ఎదురు గాలి వీస్తుంది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఏ మిత్ర పక్షాలైన జనతాదళ్‌ యునైటెడ్‌, ఏకనాథ్‌షిండే శివసేన, అజిత్‌ పవార్‌ ఎన్సీపీతో పాటు ఎన్డీఏలోని ఇతర చిన్న, చితక పార్టీలకు కేటాయించిన సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతం లో పోటీ చేసే సీట్ల సంఖ్యనే 350కి మించదు. అంటే పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవాల్సిన పరిస్థితి బీజేపీది. అది సాధ్యం కాకపోవచ్చు.  కానీ అధికారానికి దూరమవుతుందని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి