కాంగ్రెస్ సారధ్యంలో విపక్ష కూటమి తమపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు వివరణ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సగానికి పైగా రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఏళ్ల క్రితమే అవిశ్వాసం ప్రకటించారని అన్నారు. ఒక్కో రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ ఎలా తుడిచిపెట్టుకుపోయిందో గుర్తు చేశారు. దేశ ప్రజలు అవిశ్వాసం ప్రకటించడం వల్లనే తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ప్రతిపక్షంలో కూర్చుందని వివరించారు. విపక్షాలు దురహంకారంతోనే అవిశ్వాసం పెట్టాయన్నారు మోదీ. దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడమే విపక్షాల అజెండా అన్నారు. మోదీ చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ రాష్ట్రాల నుండి మాయమైపోయి చాలా ఏళ్లు అవుతోంది. దరిదాపుల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనపడ్డం లేదంటున్నారు రాజకీయ పండితులు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఏకఛత్రాధి పత్యానికి 1977 వరకు ఎదురే లేకుండా పోయింది.దానికి పదేళ్ల క్రితం నుంచే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వాల ఏకపక్ష వైఖరే దానికి కారణమంటారు విశ్లేషకులు. ఆ కారణంగానే ఒక్కో రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అవుతూ వచ్చింది. ఒకసారి ఓడిపోయి ఆ తర్వాత తిరగి అధికారంలోకి రావడం కాదు..కొన్ని రాష్ట్రాల్లో వరుస ఎన్నికల్లో ఓడిపోతూ తన అస్తిత్వాన్నే కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీని మును ముందుగా తమ రాష్ట్రం నుండి తరిమేసిన వాటిలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది.1967 లోనే ద్రవిడ పార్టీలు తమిళనాడులో అధికారంలోకి వచ్చాయి. ఇక ఆ తర్వాత ఆ ద్రవిడ పార్టీ నుండి బయటకు వచ్చిన నాయకుడే మరో ద్రవిడ పార్టీ పెట్టారు. ఇక అప్పట్నుంచీ రెండు ద్రవిడ పార్టీలూ అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. ఓ సారి అన్నాడిఎంకే అధికారంలోకి వస్తే.. ఆ తర్వాతి ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి వస్తోంది. అర్ధశతాబ్ధి దాటినా తమిళనాడులో తిరిగి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయింది.
తమిళనాడు ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించిన పదేళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రజలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.1977 ఎన్నికల్లో అధికారాన్ని సిపిఎం పార్టీకి కోల్పోయింది కాంగ్రెస్. అంతే ఇక అప్పట్నుంచీ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ లో సత్తా చాటిందే లేదు. అధికారంలోకి వచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారంటే కాంగ్రెస్ ఎంతటి దయనీయ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. చిత్రం ఏంటంటే 1977లో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు 29ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం వహించాయి.
బెంగాల్ ను చేజార్చుకున్న ఏడేళ్ల తర్వాత సిక్కింలో కాంగ్రెస్ కథ ముగిసింది.1984 నుంచి సిక్కింలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. సిక్కిం కోల్పోయిన ఆరేళ్ల తర్వాత అంటే 1990లో బిహార్ లో కాంగ్రెస్ పాలనకు తెరపడింది. బిహార్ లో అధికారం కోల్పోయి 33 ఏళ్లు పూర్తయినా కాంగ్రెస్ అక్కడ పుంజుకోలేకపోయింది. ఇక భవిష్యత్తులో కోలుకుంటుందన్న నమ్మకమూ ఎవరిలోనూలేదు. మరో మూడేల్లకు త్రిపుర.. ఆ తర్వాత రెండేళ్లకే గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాయమైంది. 1995 తో గుజరాత్ లోనూ 2000 తో ఒడిషాలోనూ కాంగ్రెస్ దుకాణం సద్దేసింది
2014లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకోపియంది. తెలంగాణాలో నామ మాత్రపు స్థానాలతో సరిపుచ్చుకుంది. 2018లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు అక్కడి ప్రజలు. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో సారి ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కనీయలేదు. కాంగ్రెస్ కు ఏపీలో ఇక భవిష్యత్తు లేదని తేలడంతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఇతర పార్టీలకు తరలిపోయారు. మొత్తం మీద దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇలానే తుడిచిపెట్టుకుపోతోంది.