బీజేపీని ఓడించడానికి కావాల్సింది బలమైన ప్రత్యర్థి.. బలహీనుల గుంపు కాదు

By KTV Telugu On 22 February, 2023
image

ఎన్నికల్లో గెలిపించాలన్నా ఓడించాలన్నా కావాల్సింది రాసే వేళ్లు అరిచే గొంతులు కాదు. ఈవీఎం మీటలు నొక్కే చేతులు కావాలి. ఆ చిన్న లాజిక్ బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రతీ సారి మిస్ అవుతున్నాయి. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వాన్ని ఓడించేంతగా మలచలేకపోవడం ప్రతిపక్షాల వైఫల్యం. తాము ఏం చేస్తున్నామో బీజేపీ బలంగా చెబుతుంది. కానీ బీజేపీ లోపాలు ఏంటి తాము ఏం చేయగలమో ప్రతిపక్షాలు బలంగా చెప్పలేవు. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ లోనూ అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ బీజేపీని విమర్శిస్తూ ఉంటే ఊర్లలో ఓట్లు రాలవు. బీజేపీ బాగా లేదు. మరి బాగా చేయగలిగే వారు ఎవరు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండదు. అదే బీజేపీ బలం.

మోదీ కంటే సమర్థులైన నేతలు చాలా మంది ఉన్నారని బీజేపీయేతర పార్టీలు చెప్పుకొస్తున్నాయి. అయితే ఇప్పుడా నేతను ఎంచుకోవాల్సిన సమయం దగ్గర పడింది బీజేపీయేతర పార్టీలు ఇప్పటికి ఓ కూటమిగా ఏర్పడలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏలో ఎన్సీపీ డీఎంకే ఆర్జేడీ, జేడీఎస్ లాంటి పార్టీలు మాత్రమే ఉన్నాయి. కానీ కూటమిలో చేరకపోయినప్పటికీ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్న పార్టీలు ఎక్కువే ఉన్నాయి. బీఆర్ఎస్ సమాజ్ వాదీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నాయి. మరి కొన్ని చిన్న పార్టీలు కూడా బీజేపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నాయి. ఈ పార్టీలు కాంగ్రెస్ కూటమిలో చేరుతాయా లేదా అన్నదానిపై క్లారిటీ రావాలంటే ముందుగా ఓ నాయకుడ్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఏదైనా కూటమి ఏర్పడితే సహజంగా ఏ పార్టీ అధినేత ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఆ పార్టీ అధినేత ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారు. కానీ రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం లేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ప్రధానిగా మాయవతి మమతా బెనర్జీ కేసీఆర్ కేజ్రీవాల్ ఇలా చాలా మంది ఉన్నారు. పంజాబ్‌ లో ఆప్ ప్రభంజనంతో అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ్‌ కీ నేత అంటున్నారు. ప్రతిపక్షాల మధ్య ప్రస్తుత ఆధికత్యపోరు దేశశ్రేయస్సుకు మంచిది కాదు. విశాల జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా తమ స్వప్రయోజనాలను వదులుకునేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు. వివిధ ప్రతిపక్షాల మధ్య జగడాలు కాంగ్రెస్‌లో అంతర్గత కొట్లాటలు ప్రజలను నిరాశా నిస్పృహలకు గురి చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించి రాజకీయ లబ్ధిని పొందే సంకల్పం ప్రతిపక్షాలలో కొరవడడం విస్మయం కలిగిస్తోంది. అసలు ప్రతిపక్షాలుగా వాటి విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతోంది. ఫలితంగా బీజేపీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సునాయాసంగా విజయం సాధిస్తోంది.

యూపీఏ హయాంలో అంటే ఏడెనిమిదేళ్ల కిందట గ్యాస్ సిలిండర్ ధర రూ. నాలుగు వందల లోపేఉండేది. ఇప్పుడది రూ. పదకొండు వందలు అయింది. పెట్రోల్ రేటు రూ. యాభైకి పైగా పెరిగింది. నోట్ల రద్దు లాక్ డౌన్ వంటి నిర్ణయాలతో పేదలు కుంగిపోయారు. మధ్య తరగతి జీవులు నిరుపేదలయ్యారు. కానీ అనుకున్నంతగా ఉపాధి కల్పన లేదు. దేశంలో పురోగతి గొప్పగా ఉందని బీజేపీ నేతలూ చెప్పడం లేదు. కానీ ఆ వైఫల్యాల్నీ ప్రశ్నించేవారే లేరు. అంటే ప్రతిపక్షమే లేదు. ప్రభావశీల ప్రతిపక్షం అవసరం ఇప్పుడు మరింతగా పెరిగింది. ఎన్నికల సంఘం, పార్లమెంటు వంటి ప్రజాస్వామిక సంస్థలను నిర్వీర్యం చేయడంలోనూ రాజకీయ ప్రమాణాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడంలోనూ రాజ్యాంగ విలువలను ఉపేక్షించడంలోనూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. కానీ ప్రతిపక్షంపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం కలగడం లేదు. అందుకే ఎన్నికలలో ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి.

ఎంతటి బలవంతమైన సర్పమైన చలి చీమల ధాటికి తట్టుకోలేదని చెబుతూంటారు. అయితే ఒకటో రెండో చలి చీమలు వేస్తే అది సాధ్యం కాదు. అంతా కలిసి వెళ్తేనే సాధ్యం. అది రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది. అంగీకరించినా అంగీకరించకపోయినా ఇప్పుడు బీజేపీ అజేయమైన శక్తిగా మారింది. గెలవాలంటే అందరూ ఏకమవ్వాల్సిందే. అందరూ ఇదే చెబుతారు కానీ రాజకీయ పార్టీలు కలవడానికి సిద్దపడటం లేదు. అక్కడే అసలు సమస్య వస్తోంది.