వైన్ షాపు ముందు ఆవును కట్టేసిన ఉమాభారతి

By KTV Telugu On 3 February, 2023
image

మద్యం కాదు….ఆవు పాలు తాగండి అంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి. మద్యపానాన్ని నిషేధించాలని సొంత ప్రభుత్వంపైనే కొంతకాలంగా ఉమా భారతి ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత సంవత్సరం మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలో ఆధ్యాత్మిక నగరం ఓర్చాలో మద్యం దుకాణంపై ఆవు పేడ విసిరి తన నిరసన వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రమైన ఓర్చా నగరంలో ఇలాంటి వ్యాపారం చేయడం నేరమంటూ ఉమా భారతి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు మరోసారి వినూత్నమైన నిరసనతో వార్తల్లోకి ఎక్కారు. నివారీ జిల్లాలో గతంలో తాను దాడి చేసిన వైన్ షాపునే మళ్లీ టార్గెట్ చేసుకున్నారు. ఒక ఆవును తీసుకొచ్చి ఆ వైన్ షాపు ముందు కట్టేశారు.

మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి మద్యం కాదు. ఆవు పాలు తాగండి అని చెప్పేందుకే ఇలా చేశానని వివరించారు. మద్యపానంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని ఉమా భారతి ప్రభుత్వానిని అభ్యర్థించారు. మద్యపానం నిరుపేదలకు ఒక సమస్యగా మారిందని మధ్యప్రదేశ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యపాన నిషేధం కోసం కృషి చేస్తానని ఉమా భారతి తెలిపారు. తన షాపు ముందు ఆవును కట్టేయడంతో ఆ వైన్‌ షాపు యజమాని షాపు మూసేసి వెళ్లిపోయాడు. గతేడాది కూడా ఇదే షాపు ముందు ఉమా భారతి ఆందోళన చేశారు. మద్యపాన నిషేధం కోసం ఆవిడ ఉద్యమించడం బాగానే ఉన్నా ఇలా పదేపదే ఒకే షాపును టార్గెట్‌ చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.