1,350 కిలోమీటర్ల పొడవు. సుమారు లక్ష కోట్ల ఖర్చు. 8 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి స్పెషల్ లైన్‌తో పాటు 12 లైన్లకు విస్తరించేలా సువిశాల రహదారి. ఆందుకే ఆ ఎక్స్‌ప్రెస్ హైవే అందరినీ అంతగా ఆకట్టుకుంటోంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఓ మైలురాయిగా నిలవబోతోంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే దేశాభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించబోతోంది. ప్రయాణసమయం సగానికి సగం తగ్గబోతోంది. ఫిబ్రవరి 12న ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే లోని దౌసా-సోహ్నా భాగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రయాణానికి ఆరుగంటలు పడుతోంది. ఇప్పుడు 4గంటల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు.
ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల గుండా సాగే ఎక్స్‌ప్రెస్‌వేకు అయిన ఖర్చు ఓ రాష్ట్ర బడ్జెట్‌కి సరిసమానంగా ఉంది. ఢిల్లీ డీఎన్డీ ఫ్లైవే, హర్యానా సోహ్నీలనుంచి మొదలయ్యే ఈ హైవేపై మహారాష్ట్రదాకా నిరాటంకంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వే డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుంది. ముంబై-ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గుతుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. దేశంలోని రెండు అతిపెద్ద ఆర్థిక కేంద్రాలను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అనుసంధానిస్తుంది. నాలుగేళ్లక్రితం 2019 మార్చి 9న ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేకు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరు కీలక రాష్ట్రాలకు ఈ హైవేతో మేలు జరుగుతుంది. దూరప్రాంతాల ప్రయాణంలో వ్యయప్రయాసలు తగ్గుతాయి. హర్యానా (129 కి.మీ), రాజస్థాన్ (373 కి.మీ.), మధ్యప్రదేశ్ (244 కి.మీ), గుజరాత్ (426 కి.మీ), మహారాష్ట్ర (171 కి.మీ) రాష్ట్రాల గుండా వెళ్లే ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి 15వేల హెక్టార్లకు పైగా భూముల్ని తీసుకున్నారు.
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుని 52 ప్యాకేజీల్లో చేపట్టారు. నిర్మాణానికి, నిర్వహణకోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 27శాతం దాకా వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ హైవే ఉపయోగపడుతుంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై 93 ప్రదేశాలలో హోటళ్లు, ఫుడ్ స్టోర్లు, రిటైల్ షాపులు, ఏటీఎంలు, ఇంధన స్టేషన్ల వంటి సౌకర్యాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలేమయినా జరిగితే తక్షణ వైద్యసాయానికి ప్రతి 100 కిలోమీటర్ల దగ్గర ట్రామా సెంటర్లతో పాటు అత్యవసర పరిస్థితులకోసం హెలిప్యాడ్లు ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకత.
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేని పర్యావరణహితంగా ఉండేలా డిజైన్ చేశారు. దేశరాజధాని నగరంలో కాలుష్య సమస్యను తగ్గించటంతో పాటు ఈ హైవే దాదాపు 20 లక్షల చెట్లతో పచ్చగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో ప్రతి 500 మీటర్లకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రక్రియతో ఈ చెట్లను పరిరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ద్వారా ప్రతీవాహనానికి దాదాపు 32 లీటర్ల ఇంధనాన్ని ఈ హైవే ఆదా చేస్తుంది. ఎక్స్‌ప్రెస్‌వేలో వేగంగా వెళ్లే సదుపాయంతో పాటు రద్దీ లేకపోవటంతో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌ప్రెస్‌వేకు రెండువైపులా 1.5 మీటర్ల ఎత్తున గోడలు, ఫెన్సింగ్‌లు ఉంటాయి.
ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో వచ్చే ఐదు సహజ వన్యప్రాణుల క్రాసింగ్‌ల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. అక్కడ సొరంగమార్గాలతో వన్యప్రాణులకు, ప్రకృతి సంపదకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 8లైన్లతో ఇంత పెద్ద సొరంగాలు దేశంలోనే మొదటిసారిగా ఈ హైవేపై ఏర్పాటయ్యాయి. అభివృద్ధికోసం ప్రకృతిని ధ్వంసం చేస్తుంటారు. కానీ ఈ హైవేపై చెట్లు, జంతుజాలానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించబోతోంది. ప్రయాణ సౌలభ్యంతో ఈ దారి పొడవునా ఉన్న చారిత్రక ప్రదేశాలకు పర్యాటకులు పెరగబోతున్నారు. ఎక్స్‌ప్రెస్ వే ప్రయాణంతో జైపూర్, అజ్మీర్, ఉదయపూర్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, డామన్, ముంబై, ఢిల్లీ నగరాలను చుట్టేయొచ్చు. రియల్ ఎస్టేట్ బాగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. టౌన్‌షిప్‌లు, హౌసింగ్ ప్రాజెక్ట్‌లు, కమర్షియల్ ప్రాపర్టీస్‌కు ఈ హైవే బాటలు వేస్తోంది. హర్యానాలో సోహ్నా కొత్త రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారబోతోంది. ఎక్స్‌ప్రెస్‌వేలో ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌లు టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీని మెరుగుపర్చబోతున్నాయి. ఆనంద్మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గజం కూడా ఈ హైవేని పొగడకుండా ఉండలేకపోయారు. దేశ ఆర్థికవ్యవస్థకు ఎక్స్‌ప్రెస్ వే కీలకమైనదని ప్రశంసించారు. రహదారుల అనుసంధానంతో రవాణా సమయం తగ్గుతుంది. దీంతో దేశ జీడీపీ బాగా పెరుగుతుందన్నారు ఆనంద్మహీంద్రా. నిజమే ఇలా రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరాన్ని భారాన్ని సగానికి సగం తగ్గించగలిగితే ఆర్థికాభివృద్ధి కూడా ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తుంది.