క్రికెట్ లో పవర్ ప్లే ఉన్నట్లే రాజకీయాల్లో పవార్ ప్లే అనేది ఒకటుంది. చాణక్యుడు కూడా అసూయ పడేలా వ్యూహరచన చేయడంలో దిట్ట అయిన శరద్ పవార్ మళ్లీ తనకే సాధ్యమైన మ్యాజిక్ చేశారు. మూడు రోజుల క్రితం ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పవార్ పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో మీరే మా బాస్ గా ఉండాలని నినదించడంతో రాజీనామా ఉపసంహరించుకున్నారు. ఈ మూడు రోజుల్లోనూ రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల నుంచే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న విపక్షాలు కూడా పవార్ కు మద్దతుగా నిలవడం విశేషం.
మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ నెల రెండున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా విషయంలో ఓ నిర్ణయం తీసుకోడానికి ఆయన వారుసుణ్ని ఎన్నుకోవడానికీ ఓ కమిటీని వేశారు. పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్, సీనియర్ నేత ఛాగన్ భుజ్ బల్, పవార్ కూతురు సుప్రియ సూలే, ప్రఫుల్ పటేల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తాజా భేటీలో పవార్ రాజీనామాను కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. పవార్ వంటి దిగ్గజ నేత తమకు సమాచారం ఇవ్వకుండా రాజీనామాకు సిద్ధమయ్యారని ప్రఫుల్ పటేల్ అన్నారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ శ్రేణులు పనిచేయాలని అనుకుంటున్నాయని పటేల్ స్పష్టం చేశారు. అందుకే పవార్ రాజీనామాను తాము ఒప్పుకోవడం లేదని ఓతీర్మానం చేసింది కమిటీ. కమిటీ తీర్మానంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానన్నారు పవార్. శరద్ పవార్ రాజీనామా గురించి ప్రకటన చేసిన రోజున పార్టీ శ్రేణులు తీవ్రంగా కలత చెందాయి. సీనియర్ నేతలు సైతం కంటతడి పెట్టారు. అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న విపక్షాలు సైతం పవార్ ప్రకటనతో విస్మయం వ్యక్తం చేశాయి. 2024లో నరేంద్ర మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో పవార్ రాజీనామా చేయడం విపక్షాల ఐక్యత యత్నాలకు శరాఘాతమే అని ఆ పార్టీల నేతలు భావించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి డి.ఎం.కే. అధినేత స్టాలిన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా , సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ తో పాటు వివిధ పార్టీల నేతలు పవార్ కు ఫోన్లమీదు ఫోన్లు చేసి రాజీనామా ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరారు. మీ రాజీనామాకు ఇది సరియైన సమయం కాదని వారంతా నొక్కి చెప్పారని అంటున్నారు. అందరూ తన నాయకత్వాన్నే బలపర్చేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు రాజకీయాలకు తన అవసరం ఉందని వారంతా చాటి చెప్పడంతో శరద్ పవార్ లోలోన సంతోషించే ఉంటారు. తనకు ఇంకా మద్దతు ఉండడం పట్ల ఆయన కాసింత గర్వపడే ఉంటారు. దీన్ని ఆసరా చేసుకుని మరి కొంతకాలం రాజకీయాలు దున్నేయచ్చని ధీమా తెచ్చుకుని ఉంటారు. అందుకే తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడగానే పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పాత తరం నేతలు పండగ చేసుకున్నారు. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారన్నదే ప్రశ్నగా మిగిలిపోయింది. శరద్ పవార్ సోదరుడి కొడుకు అయిన అజిత్ పవార్ బిజెపి మాజీ ముఖ్యమంత్రి దేవేండ్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయన బిజెపిలో చేరతారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ వార్తలను అప్పట్లో అజిత్ పవార్ ఖండించారు. అటువంటిది ఏమీ లేదని అన్నారు.
పైకి అలా అన్నా అజిత్ పవార్ పై ఎవరికీ నమ్మకాలు లేవు. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కి యత్నిస్తారా అని మీడియా ఓ సందర్భంలో ప్రశ్నిస్తే అజిత్ పవార్ చిత్రంగా స్పందించారు. అప్పటిదాకా ఎందుకు ఏం ఇప్పుడు కావాలనుకుంటే ముఖ్యమంత్రిని కాలేనా అని ఎదురు ప్రశ్నించారు. దాంతో విస్తుపోవడం మీడియా వంతయ్యింది. అజిత్ మనసులో ఏవో ఆలోచనలు ఉన్నాయని అందరికీ అప్పుడే తెలిసింది. బిజెపితో కలిసే విషయంలో శరద్ పవార్ మద్దతు ఉండదు కాబట్టి అజిత్ పవార్ చీకట్లో మంతనాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అజిత్ పవార్ మాయలో ఉండే కొందరు ఎన్సీపీ నేతలు కూడా అతనికి మద్దతు ఇవ్వచ్చని కూడా ప్రచారం జరిగింది. అజిత్ పవార్ కూడా పెదనాన్న కు లాయల్ గా ఉన్నట్లు నటిస్తూనే తెరచాటున బిజెపి నేతలతో టచ్ లో ఉన్నారని శరద్ పవార్ అనుమానించారు. దీనికి చెక్ చెప్పాలంటే ముందుగా పార్టీలో భావోద్వేగాన్ని రాజేయాలని శరద్ పవార్ మాస్టర్ ప్లాన్ చేశారు. 24ఏళ్లుగా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగిన శరద్ పవార్ ఇక తన సేవలు చాల్లే అని ప్రకటించగానే పార్టీ నేతల్లో ఉద్వేగం వచ్చేసింది. పవార్ పట్ల అభిమానం అమాంతం పెరిగిపోయింది. అందుకే వారంతా శరద్ పవారే తమ బాస్ కావాలని నినదించారు. ఇపుడు పార్టీ నేతలంతా కూడా శరద్ పవార్ కనుసన్నల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. శరద్ పవార్ కు కావల్సింది కూడా ఇదే. దీని వల్ల అజిత్ పవార్ ఏకాకి అవుతారు. అపుడు ఆయన బిజెపిలో చేరినా ఎన్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అపుడు అజిత్ పవార్ ఆడుతోన్న నాటకానికీ తెర పడుతుంది. నచ్చినా నచ్చకపోయినా అజిత్ పవార్ పార్టీలో ఒక నేతలా కొనసాగాలే తప్ప పెత్తనం చేయడానికి ఉండదు. అజిత్ పవార్ ను అలానే వదిలేస్తే ఆయన పార్టీలో చీలిక తెచ్చే ప్రమాదమూ ఉంది. దానిక్కూడా ఈ వ్యూహంతోనే చెక్ చెప్పారు. ఇదే పవార్ ఆడిన చదరంగం అంటున్నారు రాజకీయ పండితులు.
ఒకే దెబ్బతో ఇటు అజిత్ పవార్ నూ అటు బిజెపి వ్యూహకర్తలను కూడా పవార్ చావు దెబ్బ కొట్టారని రాజకీయ పండితులు అంటున్నారు. అంతే కాదు ముచ్చటగా మూడో విజయం ఏంటంటే నితిష్ కుమార్ ను విపక్షాల అంబాసిడర్ గా ప్రచారం చేస్తోన్న విపక్షాలు కూడా తనవైపు మొగ్గు చూపేలా తన గురించి ఆలోచన చేసేలా చేసుకోవడంతో శరద్ పవార్ ఘన విజయం సాధించారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇపుడు పవార్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వచ్చి పడింది. అది నితిష్ కుమార్ కు కాస్త ఇబ్బంది కర పరిణామమే కావచ్చునంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని పదవికి అభ్యర్ధులుగా నితిష్ కుమార్ కు శరద్ పవార్ ఏ మాత్రం తీసిపోరు. రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు మాయోపాయాల్లో ఇద్దరూ ఇద్దరే ఎవరూ ఎవరికీ తీసిపోరు. ఒక విధంగా వీళ్లని చూస్తే విపక్షాల భయానికీ అదే కారణం అంటున్నారు రాజకీయ పండితులు. పవార్ దెబ్బకి ఇపుడు అజిత్ పవార్ ఫ్యూజ్ కొట్టేసిన బల్బులా మాడిపోయారు. ఇక అజిత్ పవార్ వెంట పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు బిజెపి వైపు అడుగులు వేసే పరిస్థితి కూడా ఉండదు. ఏక్ నాథ్ షిండేని పక్కన పెట్టి అజిత్ పవార్ ను అడ్డు పెట్టుకుని ఎన్సీపీని చీల్చి పారేసి శరద్ పవార్ కు షాకివ్వాలనుకున్న కమలనాథుల ఆట అర్ధంతరంగా ఆగిపోయింది. అందరి ఎత్తులకూ ఒకే నిర్ణయంతో చెక్ చెప్పారు శరద్ పవార్. తన రాజీనామా ఎంత డ్రామా ఆ తర్వాత పార్టీ శ్రేణుల ద్వారా నడిపించిన వ్యవహారం కూడా అంతే డ్రామా అంటున్నారు విశ్లేషకులు. మన దేశంలో రంగస్థలం ఇంకా బతికి ఉందంటే అది ఒక్క మహారాష్ట్రలోనే. ఇప్పటికీ అక్కడ నాటకాలకు డబ్బులు పెట్టి టికెట్లు కొని వెళ్తారు జనం. మన దగ్గర ఉచితంగా చూపించినా నాటకాలు చూసేవాళ్లు లేరు. నాటక రంగానికి మహారాజపోషకులున్న మరాఠా గడ్డపై శరద్ పవార్ తిరుగులేని రాజకీయ నటనతో నాటకాన్ని రక్తి కట్టించారని పొలిటికల్ కళాకారులు అంటున్నారు. మూడురోజుల పాటు అందరినీ అలరించిన ఈ నాటకానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ కూడా పవారే అంటున్నారు. నాటకాలకీ ఆస్కార్ అవార్డు ఇస్తే కచ్చితంగా పవార్ దానికి అర్హులే అని కూడా అంటున్నారు.