పార్లమెంట్ భవన్ వివాదం – ప్రజాస్వామ్యంపై రాజకీయ పార్టీల దాడే

By KTV Telugu On 26 May, 2023
image

దేశాన్ని ఎవరు అవమానిస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీనా అధికార పార్టీపై యుద్ధం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీలా. ఇద్దరూ కలిసి దేశాన్ని ప్రపంచం ముందుకు లోకువ చేస్తున్నారంటున్నారు నిపుణులు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం చుట్టూ ఏర్పడిన వివాదం ఇప్పుడు దేశాన్ని అవమానించారు అనే వరకూ వెళ్తోంది. ఆస్ట్రేలియాలో అక్కడి ప్రభుత్వం కట్టిన భవనంపై విపక్షాలు వంకలు పెట్టలేదని అందరూ వెళ్లాలని ప్రధాని మోదీ సన్నాయి నొక్కులు నొక్కారు. అసలు రాష్ట్రపతి కదా ప్రారంభించాల్సింది అని విపక్షాలు వంకలు పెడుతున్నాయి. పవిత్రమైన పార్లమెంట్ ను రెండు పక్షాలు కలిసి వివాదాస్పదం చేస్తున్నాయి.

ఏ దేశానికి అయినా పార్లమెంట్ అత్యున్నతం. ఇప్పటి వరకూ ఉన్న పార్లమెంట్ భవనం అవసరాలకు సరిపోవడం లేదని భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు అవుతారని కొత్త భవనానికి రూపకల్పన చేశారు. పాత భవనాన్ని కూల్చకుండానే కొత్త భవనం కూడా అందులో భాగమయ్యేలా డిజైన్ చేశారు. ఈ కొత్త భవన సముదాయం నిర్మాణాన్ని 2020లో కేంద్ర గృహనిర్మాణ శాఖ చేపట్టింది.ఈ భవన సముదాయం విస్తీర్ణం 98 వేల చదరపు మీటర్లు. దీని నిర్మాణానికి జరిగిన వ్యయం ఇప్పటికే 1210 కోట్లు ఖర్చయింది. ఈ భవనం శంకుస్థాపన దగ్గర నుంచీ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. వాటిని దాటుకుని దీని నిర్మాణం ఇప్పటికి పూర్తి అయింది. ఆదివారం ఈ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని నిర్ణయించా రు. ఇప్పుడు దీనిని ఎవరు ప్రారంభించాలనే దానిపై కొత్త వివాదం బయలుదేరింది. ఈ భవన నిర్మాణానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించడం ఎంతో సముచితమని అధికార పార్టీ ప్రభుత్వ వర్గాలూ వాదిస్తున్నాయి.

రాజ్యాంగానికీ, పార్లమెంటుకూ అవినాభావ సంబంధం ఉన్నందున రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయడం ఎంతో సమంజసమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రారంభోత్సవాన్ని ప్రధాని చేత జరిపిస్తే తాము బహిష్కరిస్తామంటూ 19 పార్టీలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. మోడీ అధికారం చేపట్టిన తరువాత ఇన్ని ప్రతిపక్షాలు ఇలా ఏకతాటిపై నిలవడం ఇదే మొదటి సారి. వీటిలో కాంగ్రెస్‌, డిఎంకె, ఆప్‌, శివసేన (యూబీటీ), ఉభయ కమ్యూనిస్టులు, తదితర పార్టీలు ఉన్నాయి. తన నిర్ణయాన్ని గురువారం ప్రకటిస్తామని భారతీయ రాష్ట్రపతి ప్రకటించింది. ఈ భవన సముదాయాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయడం వీలు కుదరకపోతే కనీసం స్పీకర్‌ చేత ప్రారంభింపజేయాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వారు గతంలో పార్లమెంటు విస్తరణ భవనాన్నీ, గ్రంథాలయాన్ని ప్రారంభించిన సంప్రదాయం ఉందని కేంద్రం స్పష్టం చేస్తోంది. 1985లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ, 1987లో ఆనాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఈ రెండింటినీ ప్రారంభించిన సంగతిని కేంద్రం గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం బ్రిటిష్‌ కాలం నాటిది. ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే రీతిలో కొత్త భవనాన్ని నిర్మించారు. అయితే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తోందనీ ప్రజా సమస్యలను లేవనెత్తిన సభ్యులపై అనర్హత వేటువేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ భవన నిర్మాణానికి తాము వ్యతిరేకంకాదనీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగానే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించామని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

తాము చేయాల్సింది చేస్తున్నామని వారు వచ్చినా రాకపోయినా పట్టించుకోమని అదంతా వారి విజ్ఞత అని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే భారత అత్యున్నత పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అన్ని పార్టీలు రాకపోవడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే. ప్రతిపక్షాల అభ్యంతరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి ఇలాంటి సమస్యలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉండే అహం వల్లనే వస్తాయి. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. పార్లమెంట్ భవనం కొత్తది కట్టాలనుకున్నప్పుడు కేంద్రం ఎవర్నీ సంప్రదించలేదు. తమకు తిరుగులేని మెజార్టీ ఉందని బీజేపీ తమకు నచ్చిన డిజైన్ ను ఎంపిక చేసి నిర్మాణం ప్రారంభించేసింది. కానీ ఇది కేవలం మామూలు అభివృద్ధి పని కాదు. ఓ ప్రాజెక్టు లేదా మరో పరిశ్రమ లాంటిది అయితే కేంద్రం సొంతంగా నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభిస్తే సరిపోయేది కానీ ఇది పార్లమెంట్ భవనం. దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణం ఆ పార్లమెంట్ లోనే ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ఒక్క అధికారపక్షం కాదు ప్రతిపక్షం కూడా. అయితే నయా పాలకులు అధికారపక్షంగా ఉంటే ప్రతిపక్షాల్ని గుర్తించడానికి కూడా సిద్ధపడని పరిస్థితి ఏర్పడింది. తగినంత సంఖ్యాబలం లేదని కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మోదీ సర్కార్ గుర్తించలేదు. ఇప్పుడు ఆ పార్టీని పార్లమెంట్ భవనం వంటి కీలక అంశాల్లో భాగస్వాములను చేయలేదు. ఫలితంగా ఈగో సమస్యలు ప్రారంభమయ్యాయి. చివరికి ప్రారంభోత్సవ తేదీన కూడా వివాదాస్పదంగా నిర్ణయించారు. వీర సావర్కర్ జయంతిని నిర్ణయించారు. సహజంగానే ఇది విపక్ష పార్టీలకు ఆగ్రహం తెప్పిస్తుంది.

ప్రతిపక్షంలో ఎలా ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పద్దతిగా ఉండాలి. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. ఇందు కోసం కొన్ని సార్లు తగ్గాల్సి ఉంటుంది. లౌక్యంగా రాజకీయం చేస్తే తగ్గినా తగ్గినట్లుగా ఉండదు. ముఖ్యంగా పార్లమెంట్ భవనం లాంటి విషయాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని విపక్ష పార్టీలను కలుపుకోవాల్సింది. కానీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ఇప్పుడు ప్రారంభోత్సవం వివాదం అయింది. ఇప్పుడు ఒక్క బీజేపీ మిత్రపక్షాలు మాత్రమే పాల్గొనే ప్రారంభోత్సవం గురించి చరిత్రలో రకరకాలుగా చెప్పుకుంటారు. అందరి ఆమోదంతో పార్లమెంట్ నిర్మాణం జరగలేదంటారు. దేశం గురించి బయట కూడా అదే చర్చ జరుగుతుంది. దాని వల్ల ఎవరికి లాభం రాజకీయంగా ఎవర లాభపడతారో కానీ దేశానికి మాత్రం అంతర్జాతీయగా చెడ్డపేరు తెచ్చినట్లవుతోంది దీనికి బాధ్యత లేని రాజకీయాలు చేసే అధికార విపక్షాలన్నీ కారణమే.